ఖాతాల్లోకి డబ్బులు..! పథకాల లబ్దిదారులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) కింద నిధులు జమ చేయగా..

DBT Schemes Funds : సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల ముందు నిలిచిపోయిన పథకాలకు డబ్బులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆసరా, విద్యాదీవెన పథకాలకు ప్రత్యక్ష నగదు బదిలీ (DBT) కింద నిధులు జమ చేయగా, ఒకటి రెండు రోజుల్లో మిగిలిన పథకాలకు కూడా సొమ్ములు జమ కానున్నాయి.

ఐదేళ్లుగా నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు..
ఎన్నికల కమిషన్‌ ఆంక్షల కారణంగా పోలింగ్‌కు ముందు జమ కావాల్సిన డీబీటీ పథకాల డబ్బులు చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. పేదల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా ప్రత్యక్ష నగదు బదిలీ కింద వివిధ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన మహిళలకు ఏడాదికి 18 వేల 750 రూపాయలు చెల్లిస్తోంది. అదేవిధంగా ఆసరా పథకం కింద డ్వాక్రా సంఘాల రుణమాఫీని దశలవారీగా అమలు చేస్తోంది. వీటితోపాటు జగనన్న విద్యా దీవెన, రైతు భరోసా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వంటి పథకాలకు ఏటా డబ్బు చెల్లిస్తోంది.

నిధుల విడుదలకు ఈసీ బ్రేక్..
ఎన్నికల ముందు వరకు ఈ పథకాల కింద 2 లక్షల 70 వేల కోట్లను చెల్లించిన ప్రభుత్వం.. ఈ ఏడాది చెల్లించాల్సిన డబ్బులు జమ చేసేందుకు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నిధులు విడుదల చేసింది. దీనిపై ప్రతిపక్ష కూటమి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో నిధుల విడుదలకు బ్రేక్‌ పడింది. ఐతే అమలులో ఉన్న పథకాలకు ఎన్నికల నిబంధనలు వర్తించవనే విషయాన్ని ప్రభుత్వం ఎత్తిచూపడంతోపాటు హైకోర్టును ఆశ్రయించింది. ఉన్నత న్యాయస్థానం కూడా నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా, ఎన్నికల కమిషన్‌ మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఫలితంగా నిధుల విడుదలకు బ్రేక్‌ పడింది. మే 13న ఎన్నికలు ఉన్నందున 14వ తేదీ నుంచి నిధులు విడుదల చేసుకోవచ్చని ఈసీ అప్పట్లో ఆదేశించింది.

ఆసరా, విద్యాదీవెన నిధులు విడుదల..
ఎన్నికలు ముగియడంతో ప్రభుత్వం డీబీటీ పథకాలకు నిధులు చెల్లించే అంశంపై ఫోకస్‌ పెట్టింది. తొలివిడతగా ఆసరా పథకానికి 14 వందల 80 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా జగనన్న విద్యాదీవెన కింద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం 502 కోట్లు విడుదల చేసింది. ఈ రెండు పథకాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరగనుంది. డ్వాక్రా మహిళల రుణమాఫీ కోసం ఉద్దేశించిన ఆసరా పథకానికి నిధులు విడుదల చేయడం ద్వారా గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సంపూర్ణంగా అమలు చేసినట్లైంది. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కాక ఇన్నాళ్లు విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొన్ని కాలేజీలు ఫీజులు వసూలు చేసేందుకు పరీక్షలకు అనుమతి ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులు పెట్టాయి. ఇప్పుడు ఆ నిధులు జమ చేయడం వల్ల విద్యార్థుల కష్టాలు తీరినట్లైంది.

నగదు బదిలీ కోసం 14వేల కోట్లు సమీకరణ..
ఈ ఏడాది ప్రత్యక్ష నగదు బదిలీ కోసం ప్రభుత్వం సుమారు 14 వేల కోట్లు సమీకరించింది. ఇందులో రెండు పథకాలకు నిధులు విడుదల పూర్తి అయింది. ఇంకా చేయూత, ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద డబ్బు జమకావాల్సి వుంది. ఒకటి రెండు రోజుల్లో ఈ నిధులు విడుదల చేస్తారని ప్రభుత్వ వర్గాల సమాచారం. మొత్తానికి సీఎం జగన్‌ ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా నిధులు విడుదల చేయడం విశేషంగా చెబుతున్నారు.

Also Read : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన

 

ట్రెండింగ్ వార్తలు