Fire In Parawada Pharma City : అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

Fire In Parawada Pharma City : అనకాపల్లి జిల్లా పరవాడలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. లారస్ ఫార్మా కంపెనీలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారిలో కేజీహెచ్ లో చికిత్స పొందుతూ నలుగురు, కిమ్స్ లో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.

లారస్ ఫార్మా కంపెనీలో యూనిట్ ఎంబీ 6 బ్లాక్ లో రియాక్టర్ కింద రబ్బరు అంటుకోవడంతో మంటలు రాజుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు ఎగబాకడంతో కార్మికులు అందులో చిక్కుకున్నారు. బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా.. ఫలితం లేకుండా పోయింది.

యూనిట్ 3లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. క్లీనింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది త్వరగానే మంటలను అదుపు చేసింది. కానీ, ప్రాణనష్టం జరిగిపోయింది.

ఖమ్మం జిల్లాకు చెందిన రాంబాబు, గుంటూరు జిల్లాకు చెందిన రాజేశ్ బాబు, రంగారెడ్డి జిల్లాకు చెందిన సతీశ్, అనకాపల్లి జిల్లాకు చెందిన రామకృష్ణ, చోడవరం నియోజకవర్గానికి చెందిన వెంకట్రావ్.. ఈ ఐదుగురు కార్మికులు మంటల్లో ప్రాణాల్లో కోల్పోయారు. రియాక్టర్ నుంచి మంటలు చెలరేగడంతో అక్కడే విధుల్లో ఉన్న సిబ్బంది, కార్మికులు భయాందోళనకు గురయ్యారు.

ఒక్కసారిగా పెద్ద పెద్ద మంటలు రావడంతో కార్మికులంతా ప్రాణభయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఏకంగా ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. కార్మిక వర్గాల్లో ఒక రకమైన భయాందోళన నింపింది. గడిచిన ఏడాది కాలంగా పరవాడ ఫార్మా సిటీలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

తమకు రక్షణ లేకుండా పోయిందని కార్మికులు వాపోతున్నారు. పరిశ్రమల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే ఫార్మా సిటీలో ఇలాంటి ప్రమాదాలు తరుచుగా జరుగుతున్నాయని కార్మికులు ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రిపీట్ అవకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘం నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు