వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెనుక ఉమ్మడి ఆంధ్రుల కష్టమేంటో తెలుసా..

Vizag Steel Plant:కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇటీవల దేశవ్యాప్తంగా ఆందోళన పుట్టిస్తున్నాయి. రీసెంట్ గా విశాఖపట్నం వేదికగా ఉన్న ఉక్కు కర్మాగారంపైనా నిర్ణయం తీసేసుకుంది. దానిని ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నట్లు తెలియడంతో లక్షల మంది ఆశలు తాము పడ్డ కష్టానికి న్యాయం ఏదని ప్రశ్నిస్తున్నాయి. ఆ నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదిలాబాద్ నుంచి.. వరంగల్, విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాల్లో జరిగిన ప్రాణాత్యాగాలు ప్రస్తుత నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నాయి.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అంటూ పోరుబాట పట్టి ఏకంగా 32 మంది ప్రాణత్యాగం చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కుపై ప్రైవేట్ వ్యక్తులే అధికారం చెలాయిస్తారనడంతో మనస్సులు చివుక్కుమంటున్నాయి. ఇప్పుడు 18 వేల మంది పర్మినెంట్ ఎంప్లాయీస్, 20 వేల మంది కాంట్రాక్ట్ స్టాఫ్‌తో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశ్రమగా, నవరత్న కర్మాగారంగా వెలుగొందుతోంది.

66 గ్రామాల నుంచి 22వేల ఎకరాలు: శంకుస్థాపన జరిగి 2021కి 50 ఏళ్లు పూర్తి కాగా ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేగమవుతున్నాయి. ప్రైవేటీకరణ యత్నాలపై విమర్శలు, వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. 66 గ్రామాల నుంచి 22వేల ఎకరాలు సేకరించింది అప్పటి ప్రభుత్వం. అలాంటిది ఇప్పుడు పూర్తిగా ప్రైవేటీకరణ చేయడంపై సర్వత్రా విమర్శలు ఎక్కువవుతున్నాయి.

ప్రాణత్యాగాల మాటేంటి:

పోరాడనిదే ఏ హక్కులూ రావంటూ ఆంధ్రులకు నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి అన్నమాటలు గుర్తు చేసుకుంటున్నారు. 1966లో ఇలాగే పోరాడి ముగ్గురు విద్యార్థులతో పాటు, మరో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంతే కాదు అదే రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగిన ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 32మంది చనిపోయారు.

అసలు అప్పుడు ఏం జరిగింది:
1963లో దేశంలో 4 ఉక్కు కర్మాగారాలున్నాయి. తీర ప్రాంతంలో మరో పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం భావించింది. ఎక్స్‌పర్ట్‌లు రీసెర్చ్ చేసి వైజాగ్ బెటర్ అని తేల్చారు. అప్పుడే రాజకీయాలు మొదలైయ్యాయి. ఉక్కు కర్మాగారాన్ని తమ రాష్ట్రాలకు తరలించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చిన అవకాశం ఆఖరు నిమిషంలో చేజారే దుస్థితి తలెత్తింది.

కేంద్రం కూడా ప్రకటన చేసి ఊరకుండిపోయింది. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతించినప్పటికీ ఆర్థిక కారణాలు చూపి పనుల జాప్యం జరగడంతో మళ్లీ అలజడి రేగింది. ఇందిర ప్రధానిగా ఉన్నారు. మొదట కొన్ని నెలల పాటు దేశంలో అశాంతి, అసంతృప్తి, ఆందోళనలు తీవ్రమయ్యాయి. వరుసగా రెండు సీజన్లు దారుణంగా ఉండటంతో ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది.

అప్పటికే మద్రాస్ నుంచి విడిపోయాం.. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కూడా ఒడిదొడుకులతో సాగుతోంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత మద్రాసు నగరాన్ని కోల్పోయామనే అసంతృప్తి ప్రజల మనసునుంచి చెరిగిపోలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు మాత్రమే పూర్తి అయ్యాయి. అప్పటికే వచ్చిన మూడు పంచవర్ష ప్రణాళికల్లోనూ ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని.. ప్రభుత్వ పెట్టుబడులతో సరైన పరిశ్రమలు రావడం లేదని నిరుత్సాహంతో ఉన్నారు.

కొద్దికొద్దిగా రేగిన ఆగ్రహజ్వాలలు ఊపందుకున్నాయి. అప్పటి రాష్ట్రప్రభుత్వం ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. కొందరు ప్రజాప్రతినిధులు శాసనసభ సభ్యత్వాలకు, పార్లమెంటు సభ్యతాలకు రాజీనామా లేఖలు ఇచ్చేశారు. మరోపక్క గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టీ.అమృతరావు 1966 అక్టోబరు 15న విశాఖపట్నం వేదికగా నిరాహారదీక్షలో కూర్చున్నారు.

ఉద్యమం ఊపందుకున్న వేళ: కొద్ది రోజుల్లోనే కాలేజీ విద్యార్థులు, స్కూళ్లలోని స్టూడెంట్స్ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ముందుకొచ్చారు. మద్ధతు పెరిగింది. తరగతుల బహిష్కరణ, బంద్ లు, సమ్మెలు, నిరాహార దీక్షలు పెరిగాయి. ఆ సమయంలో తెన్నేటి విశ్వనాథం, యంవి భద్రం బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రసంగాలు ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇలా: ఆ తర్వాత 1966నవంబర్ 1న విశాఖపట్నంలో స్టూడెంట్స్ భారీ ప్రదర్శన చేపట్టారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీస్ కాల్పులు కూడా జరిగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోగా వారిలో ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారు. అలా రాష్టమంతా అల్లకల్లోలంగా మారింది. వీరికి మద్ధతుగా పలు ప్రాంతాల్లో ఆందోళన చేసిన వారిలో ఆదిలాబాద్ ఒకరు, తగరపు వలసలో ఒకరు, విజయవాడలో ఐదుగురు, విజయనగరంలో ఇద్దరు, కాకినాడలో ఒకరు, వరంగల్ లో ఒకరు, సీలేరులో ఒకరు, గుంటూరులో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అలా రాష్ట్రవ్యాప్తంగా 32మంది చనిపోయారు.

అమృతరావు దీక్షకు దిగొచ్చిన కేంద్రం: మరోవైపు దీక్షకు దిగిన అమృతరావు మరణించే ప్రమాదం ఉందని జిల్లా అధికారులు తేల్చారు. నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.. ప్రధాని ఇందిరాగాంధీకి అదే విషయాన్ని చెప్పారు. చివరకు ఆమె విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటుచేస్తామని ప్రకటిస్తూ అధికారిక లేఖను అందించారు.

కాసు బ్రహ్మానందరెడ్డి ఆ లేఖను తీసుకుని 1966 నవంబరు 3న విశాఖ వచ్చారు. ఆ లేఖను అందరికీ చూపి, అమృతరావుతో దీక్ష విరమింపజేశారు. ప్రధాని ఇందిరాగాంధీ 1971, జనవరి 20న విశాఖ వచ్చి పరిశ్రమకు శంకుస్థాపన చేశారు.

 

 

* 1971, జనవరి 20న శంకుస్థాపన
* 64 గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల సేకరణ
* కర్మాగారం నిర్మాణం పూర్తికి పట్టిన సమయం 20 ఏళ్లు
* 1992లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు చేతుల మీదుగా జాతికి అంకితం

ట్రెండింగ్ వార్తలు