Megastar Chiranjeevi : మళ్లీ రాజకీయాల్లోకి మెగాస్టార్? రాజకీయం నా నుంచి దూరం కాలేదన్న చిరంజీవి ట్వీట్‌పై జనసేన నేతల స్పందన

'నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ... రాజకీయం నా నుంచి దూరం కాలేదు' అంటూ చిరంజీవి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారా? అనే చర్చ జోరుగా నడుస్తోంది.

Megastar Chiranjeevi : రాజకీయాలపై ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన 10 సెకన్ల ఆడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినీ, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ… రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అని ఆ ఆడియోలో చిరంజీవి చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఇది చిరంజీవి కొత్త సినిమా ‘గాడ్ ఫాదర్’ లోని డైలాగ్ అని అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు విషయం ఏమిటనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. చిరంజీవి ట్వీట్ ను కొందరు సినిమా ప్రమోషన్ యాంగిల్ లో చూస్తున్నారు, మరికొందరు పొలిటికల్ యాంగిల్ లో చూస్తున్నారు.

చిరంజీవి విషయంలో జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో అందరికీ సమాధానం చెప్పడానికే చిరంజీవి ఈ ట్వీట్ చేసి ఉంటారనే విశ్లేషణ వినిపిస్తోంది. అదే సమయంలో గాడ్ ఫాదర్ సినిమా ప్రచారంలో ఉన్న స్తబ్దతను బ్రేక్ చేయడానికే ఈ పొలిటికల్ డైలాగ్ ను వైరల్ చేస్తున్నారా? అనే అనుమానమూ లేకపోలేదు.

Chiranjeevi : రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు.. చిరు ట్వీట్.. దేనిని ఉద్దేశించి??

ఇది ఇలా ఉంటే.. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడంలో చిరంజీవి ముందున్నారు. సినీ పరిశ్రమ సమస్యల గురించి ఏకంగా సీఎం జగన్ దగ్గరకు కూడా వెళ్లి చర్చలు జరిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ క్రమంలో చిరంజీవిని రాజ్యసభకు పంపుతారని అప్పట్లో జోరుగా ప్రచారం నడిచింది.

రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ వైరల్ అయిన అంశంపై జనసేన నేతలు స్పందించారు. చిరంజీవి వ్యాఖ్యలను పొలిటికల్ గా చూస్తున్నారా? లేక సినిమా ప్రమోషన్ లో భాగంగా చూస్తున్నారా? అంటే.. రెండు విధాలుగా చూడొచ్చని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఎందుకంటే సినిమాలు, పాలిటిక్స్ విడదీయరానివే అన్నారు.

”రాజకీయ నాయకులు అయినా కాకపోయినా ప్రజలను ప్రభావితం చేస్తారు. రాజకీయాలను శాసించే స్థితిలో మెగాస్టార్ ఉన్నారు. సౌతిండియాలోనే రాజకీయాలను శాసించే స్థితిలో మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. సినిమా కథలో భాగంగా ఆ డైలాగ్ వచ్చినప్పటికీ.. రాజకీయం ఆయనకు దూరంగా లేదు. 5వేల మంది మెగాస్టార్ ఫ్యాన్స్ జనసేనలో జాయిన్ అయ్యారు. వాళ్లందరికి కంబైన్డ్ శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. వాళ్లందరూ కలిసి.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కి మద్దతు ఇవ్వనున్నారు. మా తమ్ముడు వెనకాల మా కుటుంబం అంతా ఉంటుందని చిరంజీవి కూడా చెప్పారు. చెప్పినా చెప్పకపోయినా మెగాస్టార్ పూర్తి సహకారం పవన్ కు ఉంటుంది” అని బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు