Palasa Constituency: మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా?

మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు.. ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఓవరాల్‌గా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుంది?

Palasa Assembly Constituency: సిక్కోలు జిల్లా రాజకీయమంతా ఒక ఎత్తైతే.. పలాస సెగ్మెంట్ పాలిటిక్స్ మాత్రం మరో ఎత్తు. ఇక్క.. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య.. పచ్చగడ్డి వేసినా.. వేయకపోయినా.. భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయ్. లీడర్ల మాటలు.. కోటలు దాటుతున్నాయ్. తోలు వలిచేస్తామని ఒకరంటే.. కాళ్లు విరగ్గొడతామని మరొకరంటున్నారు. దాంతో.. లోకల్ పాలిటిక్స్.. ఫుల్ హీట్ మీద నడుస్తున్నాయ్. మంత్రి సీదిరి అప్పలరాజు, గౌతు ఫ్యామిలీ మధ్య పొలిటికల్ వార్.. పీక్‌కు చేరింది. ఇదిలా ఉండగానే.. అధికార వైసీపీలో మరో వైర్గం.. మంత్రి సీదిరికి పక్కలో బల్లెంలా మారింది. ఇలాంటి పరిస్థితులను దాటుకొని.. మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. తమ పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా? కీలకంగా ఉన్న మత్స్యకారులు.. ఏ జెండా వైపు ఉండబోతున్నారు? ఓవరాల్‌గా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి సీన్ కనిపిస్తుంది?

గౌతు శిరీష, సీదిరి అప్పలరాజు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ పాలిటిక్స్‌ నడిచే నియోజకవర్గాల్లో పలాస ఒకటి. నిత్యం అధికార, ప్రతిపక్ష నేతలు.. ఢీ అంటే ఢీ అనుకుంటూ ఉంటారిక్కడ. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా.. పలాస అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడింది. దీని పరిధిలో.. పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలున్నాయి. మొత్తంగా.. ఈ నియోజకవర్గంలో 2 లక్షల 10 వేల మంది పైనే ఓటర్లున్నారు. వీరిలో.. మత్స్యకార సామాజికవర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది. వారి తర్వాత.. కళింగ (Kalinga), యాదవ సామాజికవర్గాలున్నాయి. ఒకప్పుడు.. గౌతు ఫ్యామిలీకి.. పలాస ప్రాంతం పొలిటికల్ అడ్డాగా ఉండేది. సోంపేట నుంచి గౌతు లచ్ఛన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన వారసుడిగా.. గౌతు శివాజీ సోంపేట నుంచి ఐదు సార్లు, పలాస నుంచి ఒకసారి.. మొత్తంగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వయోభారంతో.. గత ఎన్నికల్లో.. గౌతు శివాజీ (Gouthu Sivaji) ఎన్నికల బరి నుంచి తప్పుకొని.. తన కుమార్తె గౌతు శిరీషను బరిలో దించారు. ఇక.. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సీదిరి అప్పలరాజు.. గౌతు కుటుంబం కంచుకోటను బద్దలుకొట్టారు.

సీదిరి అప్పలరాజు

అయితే.. ఇప్పటిదాకా జరిగిన మూడు ఎన్నికల్లో.. మూడు పార్టీల అభ్యర్థులకు పట్టం కడుతూ వచ్చారు పలాస ప్రజలు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా.. 2014లో తెలుగుదేశం అభ్యర్థి గెలిచారు. 2019 ఎన్నికల్లో.. వైసీపీ వేవ్‌లో.. సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) గెలిచారు. ఇప్పటివరకు.. ఏ పార్టీకి కూడా వరుసగా రెండు సార్లు అధికారం అప్పగించలేదు పలాస ప్రజలు. దాంతో.. ఈసారి అక్కడ ఎలాంటి రిజల్ట్ రాబోతుందన్నది స్థానికంగానే కాదు.. శ్రీకాకుళం జిల్లా మొత్తం ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన సీదిరి అప్పలరాజు.. తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి.. గౌతు శిరీషపై 16 వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. ఆయన మంత్రి అయినప్పటి నుంచి.. శ్రీకాకుళం జిల్లా(Srikakulam District)లో పలాస పవర్ పాలిటిక్స్‌కి కేరాఫ్‌గా మారిందనే టాక్ వినిపిస్తోంది. మంత్రి సీదిరి.. తన అధికారబలంతో.. ప్రతిపక్షాలను ఎక్కడికక్కడ తొక్కేస్తున్నారని.. విపక్ష నేతలను టార్గెట్ చేసి.. అక్రమంగా కేసులు బనాయించి.. అరెస్ట్ చేస్తున్నారని.. తెలుగుదేశం నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలను పక్కనబెడితే.. మరోసారి పలాస నుంచి గెలిచేందుకు.. మంత్రి సీదిరి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ప్రతి ఊరిని టచ్ చేస్తున్నారు.

దువ్వాడ శ్రీకాంత్

సీదిరి అప్పలరాజుకు తలనొప్పిగా గ్రూపులు
పలాస నియోజకవర్గం వైసీపీలో ఏర్పడిన గ్రూపులు.. సీదిరి అప్పలరాజుకు తలనొప్పిగా మారాయ్. స్థానిక నేతలు దువ్వాడ శ్రీకాంత్(Duvvada Srikanth), హేమబాబు చౌదరి, జుత్తు నీలకంఠం (Juttu Neelakantam) లాంటి వాళ్లంతా.. మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. సీదిరి ఏకపక్ష తీరుతో.. జిల్లాలోని మెజారిటీ సామాజికవర్గం సైతం ఆయనకు దూరమవుతుందనే టాక్ వినిపిస్తోంది. అయినప్పటికీ.. గ్రూప్‌లకు చెక్ పెట్టడంలో సీదిరి విఫలమవుతున్నారనే చర్చ నడుస్తోంది. పైగా.. మంత్రి అనుచరులు భూ కబ్జాలు, అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారనే విమర్శలు.. ఆయనకు మైనస్‌గా మారుతున్నాయ్.

Also Read: విజయనగరంలో గెలుపు గుర్రం ఎక్కేదెవరు.. రాజుల ఖిల్లాలో పాగా వేసేదెవరు?

దువ్వాడ హేమబాబు చౌదరి

ప్రతిపక్ష టీడీపీ నేతలైతే.. మంత్రి అప్పలరాజే.. భూదందాలు చేస్తున్నారంటూ బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. కానీ.. సీదిరి మాత్రం.. తాను ఫెయిర్ పాలిటిక్స్ చేస్తున్నానని చెబుతున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. అన్ని పనులు దాదాపు పూర్తి చేశానంటున్నారు. ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఉద్దానం వాసులకు వంశధార నీరు, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సాధించానని చెబుతున్నారు. మంచినీళ్ల పేటలో హార్బర్ నిర్మాణానికి.. త్వరలోనే ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొస్తానని చెబుతున్నారు. ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చాకే.. ఎన్నికలకు వెళతామంటున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఆ ఫ్యామిలీకి ఇదే లాస్ట్ చాన్స్.. అనకాపల్లిలో రసవత్తరంగా రాజకీయం!

గౌతు శిరీష

పార్టీ బలోపేతంపై గౌతు శిరీష ఫోకస్
గత ఎన్నికల్లో ఓటమిపాలైన.. గౌతు శిరీష(Gouthu Sireesha).. ఈసారి ఎలాగైనా పలాసలో పసుపు జెండా ఎగరేయాలని చూస్తోంది. ఇందుకోసం.. రాజకీయంగా గట్టిగానే ప్రయత్నిస్తోంది. తన తండ్రి, తాతల నుంచి వస్తున్న క్యాడర్‌ని కలుపుకుపోతూ.. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. కార్యకర్తలకు ఎక్కడ ఇబ్బందులొచ్చినా అండనా ఉంటానని చెబుతున్నారు. నేరుగా.. వాళ్లతోనే మమేకమవుతున్నారు. అయితే.. శిరీష విశాఖలో ఉంటూ.. పలాస రాజకీయాలు నడిపిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో.. శిరీష భర్త వెంకన్న చౌదరి పలాస రాజకీయాల్లో జోక్యం చేసుకొని.. అతిగా వ్యవహరించారన్న విమర్శలు.. ఇప్పటికీ ఆమెను వెంటాడుతున్నాయి. ఇక.. మంత్రి అప్పలరాజు హయాంలో.. పలాస పూర్తిగా నాశనమైపోయిందనే విమర్శలు చేస్తున్నారు. తన తండ్రి హయాంలో.. ట్రైబల్ ఏరియాని అభివృద్ధి చేయడంతో పాటు సాగునీటి ప్రాజెక్టులను సైతం పూర్తి చేశామంటున్నారు. మంత్రి సీదిరి అప్పలరాజు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామంటున్నారు గౌతు శిరీష.

Also Read: నెల్లూరు పెద్దారెడ్లంతా.. అనిల్‌కు సహకరిస్తారా?

మరోవైపు.. పలాస నియోజకవర్గంలో.. జనసేన(Janasena Party) పుంజుకుంటోంది. ఈ సెగ్మెంట్‌లోని మత్స్యకార గ్రామాల్లో పవన్ ఇప్పటికే చాలాసార్లు పర్యటించారు. స్థానికంగా ఉన్న జనసేన నాయకులు తరచుగా ఈ గ్రామాల్లో పర్యటిస్తూ ఉంటారు. దాంతో.. ఆ గ్రామాల్లోని యువత.. జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతోందనే టాక్ వినిపిస్తోంది. పలాసలో.. బీజేపీ ప్రాబల్యం అంతగా కనిపించడం లేదు. రాబోయే ఎన్నికల్లో.. మంత్రి సీదిరి, గౌతు శిరీష మధ్యే ఎలక్షన్ ఫైట్ ఉండబోతుందనేది క్లియర్‌గా అర్థమవుతోంది. ఓవరాల్‌గా.. వచ్చే ఎన్నికల్లో.. పలాస్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో.. ఎలాంటి సీన్ కనిపించబోతుందన్నదే ఆసక్తిగా మారింది.

ట్రెండింగ్ వార్తలు