CM Jagan : జైల్లో చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఇదే సరైన సమయమా? సీఎం జగన్ నిర్ణయం ఏంటి?

అదును చూసి దెబ్బతీయాలంటే చంద్రబాబు లేని సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. CM Jagan

CM Jagan - Early Elections

CM Jagan – Early Elections : ఏపీలో మరోసారి ముందస్తు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నిన్న, మొన్నటి వరకు ప్రతిపక్షాలు ముందస్తు అంటూ హడావిడి చేస్తే ఇప్పుడు అధికార పార్టీలోనే ఆ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్రం ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉన్నందున రెడీగా ఉండాలని ఇటీవల సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలతో ముందస్తు ఊహాగానాలు చేస్తున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. అయితే దీనిపై మంగళవారం జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అసలు అధికార పార్టీలో ముందస్తు ఊహాగానాలు ఎందుకు? నిజంగా ముందస్తు సన్నాహాలపై సీఎం జగన్ ఆసక్తి చూపిస్తున్నారా?

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ముందస్తు ఎన్నికలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ సభ్యుల మధ్యే ఈ చర్చ జరుగుతుండటంతో ఆసక్తికరంగా మారింది. చాలా కాలం నుంచి రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేశాయి. అప్పట్లో ఈ ప్రచారాన్ని అధికార పార్టీ కొట్టిపారేసింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అంటూ ప్రచారానికి తెరదించారు సీఎం జగన్. కానీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులతో మరోమారు ముందస్తు ఎన్నికలపై ప్రచారం ఊపందుకుంది.(CM Jagan – Early Elections)

Also Read: జగన్ పెట్టిన టెస్ట్‌లో పాసయ్యేదెవరు, ఫెయిలయ్యేదెవరు?

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏ ఇద్దరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కలుసుకున్నా ముందస్తుపైనే చర్చిస్తున్నారు. 26వ తేదీన జరిగే ఎమ్మెల్యేల సమావేశంలో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉండటంతో సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ ఎక్కువ అవుతోంది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రంతో కలిసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు సీఎం జగన్.

ప్రతిపక్ష పార్టీ నేత చంద్రబాబు రిమాండ్ ఖైదీగా జైలుకే పరిమితం కావడంతో ఇలాంటి సమయంలో ఎన్నికలకు వెళితే బాగుంటుందని వైసీపీలో ఓ వర్గం అభిప్రాయపడుతోంది. చంద్రబాబు జైల్లో ఉండటంతో ఎన్నికల మేనేజ్ మెంట్ చేయడంలో టీడీపీ విఫలం అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. అదును చూసి దెబ్బతీయాలంటే చంద్రబాబు లేని సమయంలోనే ఎన్నికలకు వెళ్లడం మంచిదని అంటున్నారు కొందరు వైసీపీ నేతలు. చంద్రబాబు కేసుల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఎన్నికలు వస్తే టీడీపీ బలపడలేదు అనేది వైసీపీ వ్యూహంగా చెబుతున్నారు.

Also Read: విశాఖ తూర్పు నియోజకవర్గంపై వైసీపీ స్పెషల్ ఫోకస్.. ఎమ్మెల్యేగా ఎంపీకి చాన్స్!

అయితే, అధికార పార్టీలోనే మరో వర్గం మాత్రం ఈ ప్రచారాన్ని తిప్పికొడుతోంది. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా ఎన్నికల్లో గెలిచేది వైసీపీయే అంటున్నారు. అసలు ముందస్తు ఆలోచనే లేదని, కేంద్రం జమిలి ఎన్నికలు అంటే తప్ప ముందుగా ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నారు. ఏదైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యేలే ముందస్తు చర్చలు జరుపుతుండటం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈ ఉత్కంఠకు సీఎం జగనే ఫుల్ స్టాఫ్ పెట్టాల్సి ఉంది. ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం జగన్ ఏం చెబుతారు అన్న సస్పెన్స్ మరింత ఎక్కువ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు