ఏపీతో పాటు చెన్నై విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు అంతరాయం

గన్నవరం, రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన విమానాలు..

Gannavaram airport

Gannavaram airport: ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచ వ్యాప్తంగా పలు సాఫ్ట్‌వేర్ సర్వర్లు పని చేయట్లేదన్న విషయం తెలిసిందే. దీంతో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి పంపుతున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఏకే లక్ష్మీ కాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రోజుకు గన్నవరం నుంచి 23 విమాన సర్వీసులు వివిధ ప్రదేశాలకు బయలుదేరి వెళ్లవలసి ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 13 విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి వెళ్లాయని చెప్పారు. 7 విమాన సర్వీసులు ఆలస్యంగా బయలుదేరి వెళ్లినట్లు తెలిపారు.

ఇదే ఆలస్యం సాయంత్రం వరకు కొనసాగితే ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. క్లౌడ్ సర్వర్, మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపం వల్ల ఉదయం నుంచి కొన్ని విమాన సర్వీసులు ఆలస్యమైనట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో విమాన సర్వీసులకు ఇదే పరిస్థితి ఉందని చెప్పారు. ఇప్పటికే ఆన్లైన్లో బుకింగ్ చేసుకుని వస్తున్న విమానయాన ప్రయాణికులకు, మాన్యువల్ గా బోర్డింగ్ పాసులు ఇస్తున్నామని అన్నారు.

తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన రెండు విమానాలు రద్దయ్యాయి. మరో ఎనిమిది విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి. చెన్నై విమానాశ్రయం నుంచి 40 విమానాలు ఆలస్యమవుతున్నాయి. ముంబై, లక్నో, బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూర్, ఢిల్లీ, కోల్‌కతా, గోవా, పూణే వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. సింగపూర్, కౌలాలంపూర్, శ్రీలంక, ఢాకా వెళ్లాల్సిన అంతర్జాతీయ సర్వీసులు రెండు గంటల ఆలస్యమయ్యాయి. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ విమాన సర్వీసులపై ప్రభావం పడింది.

Also Read: చిన్న సమస్య వచ్చింది.. భారత్‌లో విమాన సేవలకు అంతరాయంపై రామ్మోహన్ నాయుడు

ట్రెండింగ్ వార్తలు