పవన్‌ కల్యాణ్‌ను ఓడించినా గుర్తింపు దక్కలేదని రగిలిపోతున్నారా..! వైసీపీని వీడనున్న గ్రంథి శ్రీనివాస్?

రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తన విషయంలో అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే...

Gossip Garage : ఓటమి తర్వాత వైసీపీలో అసంతృప్తులు బయటపడుతున్నాయా? ఐదేళ్లు అధికారంలో ఉండగా, అణిగిమణిగి ఉన్న నేతలు నిరసన గళం విప్పుతున్నారా? పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ… పార్టీ అధిష్టానంపై వ్యతిరేకతను ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారా? గోదావరి తీరంలో దూకుడైన రాజకీయానికి పెట్టింది పేరైన ఓ మాజీ ఎమ్మెల్యే.. పార్టీకి దూరం.. దూరంగా ఉండటం దేనికి సంకేతం? పార్టీ మారిపోతారంటూ ఆయన అనుచరులిస్తున్న లీకుల వెనుక అసలు లిస్టులేంటి?

పార్టీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తి..!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి వైసీపీని బాగా కుంగదీసింది. ఫలితాలు విడుదలై నెలరోజులు అవుతున్నా… చాలా నియోజకవర్గాల్లో నేతలు బయటకు రాలేకపోతున్నారు. మరోవైపు పార్టీ అధిష్టానంపై తమ అసంతృప్తిని బయటపెట్టేందుకు ఇదే తగిన సమయం అంటూ కొందరు నేతలు టచ్‌ మీ నాట్‌ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. గోదావరి జిల్లాలకు చెందిన ఓ ముఖ్యనేత, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్‌ ఇప్పుడు ఇదే రీతిన తన వ్యతిరేకతను తెలియజేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో ఓడిన తర్వాత అసలు బయటకు రాని మాజీ ఎమ్మెల్యే గ్రంధి… పార్టీ హైకమాండ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

పవన్ ను ఓడించినా గౌరవం దక్కలేదని రగిలిపోతున్నారా?
ఒకప్పుడు పార్టీ కార్యక్రమాలను ఎంతో ఘనంగా నిర్వహించిన గ్రంధి… ఈ నెల 8న మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి జయంతి కార్యక్రమాన్ని కనీసం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. త్వరలో ఆయన పార్టీని వీడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతో కానీ, 2019 ఎన్నికల్లో జనసేనాని పవన్‌కల్యాణ్‌ ఓడించి సంచలనం సృష్టించిన తనకు.. పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం దక్కలేదనే అసంతృప్తితో రగిలిపోతున్నట్లు సమాచారం.

మంత్రి పదవి దక్కలేదు, పైగా మరో గ్రూపును తయారు చేశారని ఆవేదన..
కాపు సామాజికవర్గానికి చెందిన గ్రంధి శ్రీనివాస్‌కు ఆ వర్గంలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. గత ఎన్నికల్లో పవన్‌పై విజయం సాధించిన తర్వాత ఆయన క్రేజ్‌ మరింత పెరిగింది. కానీ, వైసీపీలో మాత్రం పెద్దగా గుర్తింపు దక్కలేదని ఆయన అనుచరులు చెబుతుంటారు. పైగా గ్రంధికి పోటీగా పార్టీలో మరో గ్రూపును తయారు చేశారనే ఆవేదన కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేసి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన గ్రంధి శ్రీనివాస్‌.. గత ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆశించారు. రెండు విడతలుగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో కాపు కోటాలో మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ, ఆయన ఆశ నెరవేరలేదు. విప్‌ పదవితో సరిపెట్టుకోమని చెప్పింది వైసీపీ అధిష్టానం.

ఇప్పటికైనా తన నిరసనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని..
ఐతే పెద్దగా పవర్‌ లేని విప్‌ పదవిపై ఆసక్తిలేని గ్రంధి… తనకు మంత్రివర్గంలో చాన్స్‌ దక్కకపోడానికి తాడేపల్లి కేంద్రంగా జరిగిన రాజకీయమే ప్రధానమని అనుమానిస్తున్నారు. తొలివిడత మంత్రివర్గంలో చాన్స్‌ వస్తుందని ఆశిస్తే… రెండోసారి అవకాశమిస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధిష్టానం… రెండో విడత విస్తరణలో గ్రంధి శ్రీనివాస్‌ పేరును చివరి నిమిషంలో తప్పించందని చెబుతున్నారు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తిగా ఉన్న గ్రంధి… అధికారంలో ఉండగా ఎప్పుడూ బయటపడలేదు. ఇప్పటికైనా తన నిరసనను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లకపోతే… ప్రయోజనం లేదని భావించి ఇప్పుడు అలకపాన్పు ఎక్కినట్లు తెలుస్తోంది.

నియోజకవర్గంలో తన హవాకు బ్రేక్‌ వేయాలని చూశారని ఆవేదన..
మరోవైపు భీమవరం నియోజకవర్గంలో తనకు ఎదురే లేదన్నట్లు రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్యే.. కొన్నాళ్లు పార్టీలో మరో వర్గంతో అంతర్గత పోరు ఎదుర్కోవడం అసంతృప్తికి కారణమైందంటున్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన మోషేన్‌రాజుకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపాటు మండలి చైర్మన్‌ పోస్టు కట్టబెట్టడం వల్ల మాజీ ఎమ్మెల్యేకి రాజకీయంగా ఇబ్బందికరమైందంటున్నారు. ప్రొటోకాల్‌ పరంగా ఎమ్మెల్యే కన్నా, మండలి చైర్మన్‌కే ఎక్కువ ప్రాధాన్యమివ్వాల్సి రావడంతో నియోజకవర్గంలో తన హవాకు బ్రేక్‌ వేయాలనే చూశారని మాజీ ఎమ్మెల్యే ఆవేదన చెందుతున్నట్లు సమాచారం.

అంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం..
ఇక ఈ అసంతృప్తులకు తోడుగా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమికి పార్టీలో కొందరు నేతలు ప్రయత్నించారని… ఓ ముఖ్య నేత టార్గెట్‌ చేసి తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌. తన ఓటమి కోరుకున్న నేతల లిస్టు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా, వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ పార్టీలో కొనసాగతారా? లేదా? అనే చర్చ తెరపైకి వస్తోంది. రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా త్వరలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. తన విషయంలో అధిష్టానం ఏదో ఒకటి తేల్చాలని డిమాండ్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే… నియోజకవర్గంలో తన వ్యతిరేకులపై చర్యలు తీసుకోనంతవరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.

Also Read : నామినేటెడ్‌ పదవులు దక్కేది వీరికే? పదవుల భర్తీకి సీఎం చంద్రబాబు సరికొత్త పంథా

ట్రెండింగ్ వార్తలు