Proddatur Constituency: ప్రొద్దుటూరు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు.. జోరు చూపిస్తున్న టీడీపీ..

ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తోంది వైసీపీ నాయకత్వం.. టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది.

Proddatur Assembly Constituency Ground Report

Proddatur Assembly Constituency: వైసీపీ అడ్డా కడపలో.. తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం ప్రొద్దుటూరు. గత రెండు సార్లు వైసీపీయే గెలిచినా.. ఇక్కడ పసుపు పార్టీకి బలం.. బలగమూ ఎక్కువే.. అంతేకాదు వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో ప్రొద్దుటూరుపై ఆశలు పెంచుకుంటోంది టీడీపీ.. బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుని.. వచ్చే ఎన్నికల్లో పసుపు జెండా రెపరెపలాడించాలని చూస్తోంది.. ఇంతకీ ప్రొద్దుటూరులో ఈ సారి కనిపించబోయే సీనేంటి?

సీఎం సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అధికార వైసీపీ, టీడీపీ మధ్య వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ జరిగేలా కనిపిస్తోంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ప్రొద్దుటూరులో 2014 నుంచి వైసీపీ హవా నడుస్తోంది. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (Rachamallu Siva Prasad Reddy). అయితే అధికార పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయనన్ని కార్యక్రమాలు చేశానని మరోసారి వైసీపీ జెండా ఎగరేస్తామంటున్నారు ఎమ్మెల్యే.

Rachamallu Siva Prasad Reddy

వచ్చే ఎన్నికల్లో తన విజయంపై ఎమ్మెల్యే ధీమాగా ఉన్నా.. ఇటీవల అసమ్మతి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తన వ్యతిరేకులను కలుపుకుని వెళుతున్నానని ఎమ్మెల్యే చెబుతున్నా.. ఎమ్మెల్సీ రమేశ్యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ కాజాతోపాటు కొందరు కౌన్సిలర్లు ఇప్పటికీ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కౌన్సిలర్లను పార్టీ నుంచి బహిష్కరించింది వైసీపీ నాయకత్వం. సుమారు రెండు లక్షల ఓటర్లు ఉన్న ప్రొద్దుటూరులో మున్సిపాలిటీలోనే లక్షా 60 వేల ఓట్లు ఉన్నాయి. పట్టణంలో కౌన్సిలర్ల నుంచి వ్యతిరేకత ఉండటం ఎమ్మెల్యేకు మైనస్‌గా చెబుతున్నారు పరిశీలకులు. అదే సమయంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎమ్మెల్యే.

Dr GV Praveen Kumar Reddy

ఎమ్మెల్యేపై వ్యతిరేకతే ఈ సారి టీడీపీని గెలిపిస్తుందని ఆశిస్తోంది పసుపు పార్టీ. ప్రస్తుత ఇన్‌చార్జి డాక్టర్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి (Dr GV Praveen Kumar Reddy) నియోజకవర్గంలో విస్తృతంగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేకు దీటుగా వ్యవహరిస్తూ టీడీపీలో జోష్ నింపుతున్నారు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి జోరు పెరగడంతో కట్టడి చేసేందుకు ప్రయత్నించింది వైసీపీ. ఓ కేసులో జైలుకు వెళ్లిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డి.. తనను వైసీపీయే అక్రమంగా ఇరికించిందని ఆరోపించారు. ఆ సంఘటనతో ఆయనకు నియోజకవర్గంలో సానుభూతి వచ్చినట్లు చెబుతున్నారు పరిశీలకులు. సరిగ్గా అదే సమయంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) కడప సెంట్రల్ జైలుకు వెళ్లి ప్రవీణ్‌కుమార్‌ను పరామర్శించడంతోపాటు.. ఆయనే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నియోజకవర్గంలో జోరుచూపిస్తున్నారు ప్రవీణ్‌కుమార్.

Also Read: రాయచోటిలో శ్రీకాంత్‌రెడ్డిని ఢీకొట్టే నేత ఎవరు.. దీటైన అభ్యర్థి కోసం టీడీపీలో తర్జనభర్జనలు

Mallela Linga Reddy

ప్రొద్దుటూరులో టీడీపీ టిక్కెట్‌ను ప్రవీణ్‌కుమార్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి (Mallela Linga Reddy) కూడా ఆశిస్తున్నారు. లోకేశ్ ప్రకటన తర్వాత లింగారెడ్డి సైలెంట్ అయిపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అదే విధంగా మరో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి (Nandyal Varadarajulu Reddy) తిరిగి టిడిపిలోకి వస్తారన్న ప్రచారం ఊపందుకుంది. గత ఎన్నికల్లో పార్టీని వీడిన ఆయన మాత్రం తాను ఎప్పుడూ టీడీపీలోనే ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. వరదరాజుల రెడ్డి ఈ సారి టీడీపీకి పనిచేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన అనుచర గణం అంతా తిరిగి టీడీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. పార్టీ బలోపేతం అవుతుందని అంచనాలు వేస్తున్నారు. అదేవిధంగా ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పెదనాన్న మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి కూడా టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు. ఇలా పెద్ద నాయకులంతా మళ్లీ టీడీపీలో చేరితే గత వైభవం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలతో ఊపుమీద కనిపిస్తోంది టీడీపీ.

Also Read: రోజురోజుకి వేడెక్కుతున్న మచిలీపట్నం రాజకీయం.. ఈసారి పోటీ మామూలుగా ఉండదు!

అటు అధికార పార్టీలో విభేదాలు ఉన్నా.. ముఖ్యమంత్రి సొంత జిల్లా కావడంతో ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందని భావిస్తోంది వైసీపీ నాయకత్వం.. టీడీపీ కూడా ఈసారి గెలుపుపై ఆశలు పెంచుకుంటోంది. మొత్తానికి రెండు పార్టీలూ నువ్వానేనా అన్నట్లు తలపడటం ఖాయంగా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు