Machilipatnam Constituency: రోజురోజుకి వేడెక్కుతున్న మచిలీపట్నం రాజకీయం.. ఈసారి పోటీ మామూలుగా ఉండదు!

మచిలీపట్నం రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నాయి.

Machilipatnam Assembly Constituency : ఏపీలో హాట్ హాట్ సీట్లలో బందర్ (Bandar) ఒకటి. కృష్ణా జిల్లా (Krishna District) రాజకీయాల్లో మచిలీపట్నం రాజకీయం పూర్తిగా సెపరేట్. ఇద్దరు ఉద్దండులైన నేతలు తలపడే బందర్‌లో పోటీ ఎప్పుడూ రసవత్తరమే.. ఇటు జిల్లా.. అటు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న నేతలే ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఈ సారి పోటీచేస్తారా? ఆయన స్థానంలో కుమారుడికి చాన్స్ ఇస్తారా? వైసీపీకి దీటుగా రాజకీయం చేస్తున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో ఎలా ఢీకొట్టబోతోంది? మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) రాజకీయం ఎలా ఉండబోతోంది? వైసీపీ, టీడీపీ మధ్య జరిగే హోరాహోరీ పోరులో విజయం సాధించే రేసుగుర్రం ఎవరు?

మచిలీపట్నం రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పార్టీలన్నీ ఎత్తుకు పైఎత్తులు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తూ… గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో అధికార వైసీపీ జనం బాటపడ్డగా.. ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక విధానాలు అంటూ టిడిపి నాయకులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బాదుడే బాదుడు అంటూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ జనం మధ్య తిరుగుతున్నారు. ఈ రెండు పార్టీల ప్రయత్నాలకు దీటుగా.. జనసేన, బీజేపీ కూడా ఈ సారి ఎన్నికల్లో ప్రభావం చూపాలని అడుగులు వేస్తున్నాయి.

Perni Nani

ప్రస్తుతం మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై పోటీ చేసిన నాని ఘన విజయం సాధించారు. రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేసిన పేర్ని నాని.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా చెబుతుంటారు.. కానీ, వచ్చే ఎన్నికల్లో రిటైర్మెంట్ తీసుకుని తన తనయుడు కిట్టూను బరిలోకి దింపాలని చూస్తున్నారు మాజీ మంత్రి.

సిట్టింగ్ ఎమ్మెల్యే నాని పోటీకి దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించగా… ఆయన తరఫున పేర్ని కిట్టు తండ్రి వారసత్వం అందిపుచ్చుకునేలా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలన్నింటికి హాజరవుతూ కేడర్‌తో మమేకమవుతున్నారు కిట్టూ. ఇక టీడీపీ తరఫున మాజీ మంత్రి కొల్లు రవీంద్ర.. జనసేన నుంచి బండి రామకృష్ణ (Bandi Rama Krishna) పోటీ చేసే అవకాశం ఉంది. జనసేన-టీడీపీ (Janasena- TDP Alliance) పొత్తు ఉంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు పోటీపడేలా కనిపిస్తోంది.

Perni Nani, Perni Kittu

సిట్టింగ్ ఎమ్మెల్యే నాని.. ఈ సారి పోటీచేసేది లేదని రెండేళ్ల క్రితమే ప్రకటించారు. తాను రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నప్పుడే తన కుమారుడిని ఎమ్మెల్యే చేయాలనేది నాని ప్లాన్. బందరు పోర్టు శంకుస్థాపనకు వచ్చిన సీఎం జగన్ సమక్షంలోనే తాను ఎన్నికల్లో పోటీ చేయబోవటం లేదని ప్రకటించారు పేర్ని నాని. వచ్చే ఎన్నికల్లో వారసులకు టిక్కెట్లు ఇచ్చేది లేదని అంతకుముందే సీఎం జగన్ చెప్పినా.. నాని మాత్రం తన మనసులో మాట నేరుగా చెప్పేశారు. అంతేకాదు నాని కుమారుడు కిట్టు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. సీఎం దగ్గర నానికి మంచి పలుకుబడి ఉన్నందున కుమారుడికి టికెట్ తెచ్చుకుంటారనే ధీమా వ్యక్తం చేస్తున్నారు క్యాడర్.

Kollu Ravindra

అధికార పార్టీ రాజకీయాలు ఇలా ఉంటే టీడీపీ నుంచి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పోటీ చేయబోతున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత బలంగా ఉందనే భావనతో ఉన్న టీడీపీ.. ఈ సారి బందరు సీటు కచ్చితంగా తమదేననే ధీమాతో ఉంది. బందరు సెగ్మెంటులో టీడీపీలో పెద్దగా గ్రూపులు లేకపోవడం ఆ పార్టీకి అడ్వాంటేజ్‌ అవుతుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన కాపు సామాజిక వర్గ ఓట్లను చీల్చటం వల్లే రవీంద్ర ఓడిపోయారనే భావనలో ఉంది తెలుగుదేశం పార్టీ. ఈ సారి పొత్తు కుదుర్చుకుని వైసీపీని చిత్తుచేస్తామని ప్రకటనలు చేస్తోంది. మరోవైపు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర నిరంతరం కేడర్‌కి అందుబాటులో ఉంటూ ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు.

Also Read: హీటు రేపుతోన్న గుడివాడ అసెంబ్లీ సీటు.. కొడాలి నానిని ఓడించేందుకు టీడీపీ స్పెషల్ ఫోకస్..

గతంలో రాముడు మంచి బాలుడిలా కనిపించిన కొల్లు రవీంద్ర ఇప్పుడు మాస్ లీడర్ అవతారం ఎత్తుతున్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా చిటికెలో వాలిపోతున్నారు. టిడిపి అధినేత చంద్రబాబుకు సైతం అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నే రవీంద్ర.. పార్టీలోనూ బీసీ ఫెడరేషన్ బాధ్యతలను చూస్తున్నారు. రవీంద్రపై హత్యాయత్నం కేసుని పెట్టి జైలుకు పంపడాన్ని బందరు ప్రజానీకం, ముఖ్యంగా టీడీపీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతున్నారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్రకు ఆ వర్గం ఓట్లు అదనపు బలం. ఈ సారి పేర్ని నానికి బదులుగా ఆయన కుమారుడు కిట్టూ (Perni Kittu) పోటీ చేస్తే రవీంద్ర అనుభవంతో గెలిచేయొచ్చునని ధీమాతో ఉంది తెలుగుదేశం పార్టీ.

Bandi Rama Krishna

నియోజకవర్గంలో రోజురోజుకి క్షీణిస్తున్న శాంతి భద్రత సమస్య వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న కాలంలో శాంతిభద్రతలపై తీసుకునే చర్చలే విజేతలను నిర్ణయిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీడీపీ-జనసేనతో పొత్తు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా గెలుపోటములను నిర్ణయించనున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీలో మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ వర్గంతో మాజీ మంత్రి కొల్లుకు ఉన్న విభేదాలు కూడా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మాజీ మంత్రి పేర్ని నాని సమయం సందర్భం లేకుండా జనసేనాని పవన్ (Konakalla Narayana Rao) కళ్యాణ్ని టార్గెట్ చేయడం.. ఆ సామాజిక వర్గంలో విస్తృత చర్చకు దారితీస్తోంది. ఇది ఎవరికి ప్లస్సో.. ఎవరికి మైనస్‌గా మారుతోందోననే విశ్లేషణలకు ఎక్కువగా జరుగుతున్నాయి. నాని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. టీడీపీతో జనసేన పొత్తును తప్పుబడడుతుండటం కూడా ఇక్కడ ప్రధానంగా చర్చకు వస్తోంది.

Also Read: అధికార ప్రతిపక్షాల్లో గ్రూప్ వార్.. మైలవరంలో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి.. జనసేన కీలకం!

టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తే టిడిపికి కొంత సానుకూలంగా ఉంటుందని.. విడివిడిగా పోటీ చేస్తే వైసీపీకి మేలు జరగొచ్చనే అభిప్రాయం ఉంది. అంటే బందర్‌లో విజేత ఎవరో తేలాలంటే పొత్తులు కొలిక్కివస్తేగాని తేలదు. ఎవరు ఎవరితో కలిసినా.. కలవకున్నా.. తమ విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు వైసీపీ నేతలు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే వైసీపీని గెలిపిస్తాయని అంటున్నారు. ఎన్నాళ్ల నుంచో పెండింగ్‌లో ఉన్న బందరు పోర్టు నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేయడం.. పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉండటంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. అభివృద్ధి చూపి ఓట్లు అడుగుతామని వైసీపీ.. జనసేనతో కలిసికట్టుగా వెళతామని టీడీపీ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. రెండు పార్టీల్లోనూ క్యాడర్ బలంగా ఉండటంతో పోటీ మాత్రం వాడివేడిగా జరిగేలా కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు