నాడు సహచరులు, నేడు సీఎంలు.. చంద్రబాబు, రేవంత్ భేటీపై తెలుగు ప్రజల్లో తీవ్ర ఆసక్తి

నాడు పార్టీ ప్రయోజనాల కోసం ఒక్క మాట మీద పని చేసిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఇప్పుడు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం గిరి గీసి చర్చించుకోబోతున్నారు.

Chandrababu, Revanth Meeting : ఒకే పార్టీలో సీనియర్, జూనియర్లుగా పని చేసిన ఇద్దరు.. దాదాపు దశాబ్ద కాలం తర్వాత ఒకే వేదికను పంచుకోబోతున్నారు. టీడీపీలో పదేళ్ల పాటు కలిసి ప్రయాణం చేసిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. ముఖ్యమంత్రుల హోదాలో కలవబోతున్నారు. నాడు పార్టీ ప్రయోజనాల కోసం ఒక్క మాట మీద పని చేసిన ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు.. ఇప్పుడు తమ రాష్ట్రాల ప్రయోజనాల కోసం గిరి గీసి చర్చించుకోబోతున్నారు. పదేళ్లుగా పెండింగ్ లో ఉన్న విభజన అంశాల పరిష్కారం కోసం ఇద్దరు సీఎంల భేటీపై రెండు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. హైదరాబాద్ లోని పూలే ప్రజాభవన్ లో ఇద్దరూ సమావేశం కానున్నారు. విభజనకు సంబంధించి పెండింగ్ అంశాలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో సంస్థల విభజనపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై డిస్కస్ చేసే చాన్స్ ఉంది. విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది.

అలాగే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇక షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై గతంలో కేంద్ర హోంశాఖ షీలాదేవి కమిటీని వేసింది. అయితే, ఈ కమిటీ భేటీలో 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్ లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి.

Also Read : ఇక రాజధానిని ఎవరూ తరలించలేరా? అమరావతి రక్షణకు చంద్రబాబు పక్కా ప్లాన్‌..!

ట్రెండింగ్ వార్తలు