Mylavaram Constituency: అధికార ప్రతిపక్షాల్లో గ్రూప్ వార్.. మైలవరంలో ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి.. జనసేన కీలకం!

అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్‌చార్జి అక్కల రామోహనరావు.

Mylavaram Assembly constituency : ఏపీలో ఎక్కువ ఓట్లు ఉన్న నియోజకవర్గం ఏదంటే మైలవరం.. నేతల మధ్య ఎక్కువ విభేదాలు ఉన్న నియోజకవర్గం కూడా మైలవరమే.. ఆ పార్టీ ఈ పార్టీ అన్నతేడా లేదు. అధికార వైసీపీ అయినా.. ప్రతిపక్ష టీడీపీ అయినా గ్రూపులు.. విభేదాలు కామన్. హేమాహేమీలు ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో రకరకాల సెంటిమెంట్లు ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ గెలిచి మంత్రిగా పనిచేసిన వారు తర్వాత ఎన్నికల్లో ఓడిపోతారని.. రెండోసారి గెలిస్తే ఆ తర్వాత రాజకీయంగా కనుమరుగైపోతారని చెప్పుకుంటుంటారు. రాజకీయాల్లో ఇలాంటి సెంటిమెంట్లు చాలా కామన్ అయినా.. మైలవరంలో నెగ్గుకురావడం మాత్రం చాలా కష్టమనే టాక్ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మైలవరం రాజకీయం (Mylavaram Politics) ఏ విధంగా ఉంది? సిట్టింగ్ ఎమ్మెల్యే సంగతేంటి? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగురవేస్తుందో ఇప్పుడు చూద్దాం.

రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒక ఎత్తైతే.. మైలవరం నియోజకవర్గం రూటే సెపరేటు. ఇక్కడ ఏం జరిగినా అదో సంచలనమే. సాధారణంగా ఒక పార్టీ ఇంకో పార్టీపై విమర్శలు చేయడం చూస్తాం.. కాని ఇక్కడ సీన్ రివర్స్. సొంత పార్టీలోనే నేతలపై విమర్శలకు దిగుతుంటారు మైలవరం లీడర్లు. అధికార, ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా.. అంతా ఒకరిపై ఒకరు తిట్టిపోసుకోవడం ఇక్కడ సర్వసాధారణం. రెండు పార్టీల్లోనూ ఇదే లొల్లి.. ఒకరేమో నా సీటు అంటారు.. ఇంకొకరేమో స్థానికులు కాదని గోలగోల చేస్తారు. తిట్టుకుంటారు.. కొట్టుకుంటారు.. ఈ గ్రూపులు.. విభేదాలతో మైలవరం కాస్త రాజకీయ గోలవరంగా మారిపోయింది.

ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చే మైలవరం నియోజవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సుమారు రెండు లక్షల 80 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే అతిరథ మహారథులు ఎందరో ఇక్కడి నుంచి గెలిచి ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేశారు. ఇప్పడు వైసీపీ తరఫున గెలిచిన వసంత కృష్ణప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మైలవరం నియోజకవర్గం నుంచి తొలి ఎమ్మెల్యేగా వెల్లంకి విశ్వేశ్వరరావు (Vellanki Visweswara Rao) పనిచేశారు. చనుమోలు వెంకట్రావు (Chanamolu Venkata Rao), నిమ్మగడ్డ సత్యనారాయణ, కోమిటిరెడ్డి భాస్కరరావు, జేస్ట్ రమేశ్ బాబు, వడ్డే శోభనాదీశ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao) ఇలా ఎంతో మంది హేమాహేమీలు ఇక్కడి నుంచి గెలుపొందిన వారే. చనుమోలు వెంకట్రావు, వడ్డే శోభనాద్రి శ్వరరావు, దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి గెలిచి మంత్రులుగా సేవలు అందించారు.

వసంత కృష్ణప్రసాద్ (Photo: Facebook)

2019 ఎన్నికల్లో గెలిచి తొలిసారి తన ఖాతాలో వేసుకుంది వైసిపి. టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమాపై వసంత కృష్ణప్రసాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అప్పటి మంత్రి దేవినేని ఉమాపై ఘన విజయం సాధించారు. కానీ, తరచూ రోడ్డెక్కుతున్న వర్గ విభేదాలతో వచ్చే ఎన్నికల్లో సీటు దొరుకుతుందో లేదో అనే టెన్షన్ పడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో మంత్రి జోగి రమేశ్ పోటీ చేయాల్సింది. అంతకు ముందు ఐదేళ్లు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఉన్న జోగి రమేశ్ ను ఎన్నికలకు రెండు నెలల ముందు.. మైలవరం నుంచి తప్పించి పెడన నియోజకవర్గానికి పంపింది వైసీపీ అధిష్టానం. ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చినా.. దేవినేని ఉమాపై మంచి మెజార్టీతోనే విజయం సాధించారు వసంత కృష్ణ ప్రసాద్. కానీ, ఈ స్థానంపై మంత్రి జోగి కన్నేయడంతో ఏడాదిన్నర నుంచి లుకలుకలు ఎక్కువయ్యాయి.

జోగి రమేశ్, వైఎస్ జగన్ (Photo: Facebook)

పెడన నుంచి గెలిచిన మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) స్వస్థలం మైలవరం నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపట్నం. స్థానికుడైన మంత్రికి ఇక్కడి వైసీపీ కేడర్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో మంత్రి మైలవరం నుంచి.. తన సిట్టింగ్ స్థానం పెడన (Pedana) నుంచి తన కుమారుడిని పోటీలో దింపాలని చూస్తున్నారు మంత్రి జోగి రమేశ్. సిట్టింగ్ శాసనసభ్యుడిగా తాను ఉండగా, మంత్రి తన నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడమే కాకుండా.. క్యాడర్‌తో నేరుగా సంబంధాలు పెట్టుకుని తనకు నష్టం జరిగేలా చేస్తున్నారని మండిపడుతున్నారు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్. నియోజవర్గంలో మంత్రి జోక్యంపై అధిష్టానం పెద్దలకు.. సీఎం జగన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కానీ, అధిష్టానం ఏ విషయమూ తేల్చకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందా? రాదా? అన్న టెన్షన్ పడుతున్నారు ఎమ్మెల్యే. మంత్రి జోగి రమేశ్ దూకుడు పెరగడంతో తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారు ఎమ్మెల్యే. ఎమ్మెల్యే, మంత్రి మధ్య అంతర్యుద్ధంతో వైసీపీ క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది.

ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్న కృష్ణప్రసాద్‌కు పార్టీపై పట్టుమాత్రం చిక్కడం లేదు. డ్రైనేజ్ సమస్యలు, నాడు -నేడు స్కూల్ భవనాలు, గ్రామ సచివాలయలు, సీసీ రోడ్లు, మైలవరంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడంతోపాటు.. జగనన్న ఇళ్ల నిర్మాణాలు వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే. సుమారు 27 వేల 877 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు చేశానని ఎమ్మెల్యే లెక్కలు చెబుతున్నారు. కానీ, పార్టీలో ఎదురవుతున్న సవాల్‌తో రాజకీయంగా ముందడుగు వేయలేకపోతున్నారు ఎమ్మెల్యే.

అధికార పార్టీలో అంతర్యుద్ధం అలా కొనసాగుతుండగా, ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు కనిపిస్తుంది. ఎంపీ కేశినేని నాని.. ఆయన సోదరుడు కేశినేని చిన్నివర్గంగా స్థానిక టీడీపీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయి. కేశినేని నాని వర్గం నేతగా గుర్తింపు పొందిన స్థానిక నేత బొమ్మసాని సుబ్బారావు (Bommasani Subbarao) ఈ సారి టిక్కెట్టు తనకే ఇవ్వాలని కోరుతున్నారు. స్థానిక నినాదం లేవనెత్తి మాజీ మంత్రి ఉమాకు సెగపెడుతున్నారు బొమ్మసాని. ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) ఆశీస్సులతోనే బొమ్మినేని పోటీ రాజకీయం నడుపుతున్నారని ఉమా వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ నాని సోదరుడు చిన్ని మాజీ మంత్రి ఉమాకు సన్నిహితంగా మెలుగుతుండటమే ఈ గ్రూప్ పాలిటిక్స్‌కు కారణమని చెబుతున్నారు. కొండపల్లి మున్సిపాలిటీలో టిడిపి గెలుపుతో ఈ గ్రూప్ వార్ పతాకస్థాయికి చేరింది. మాజీ మంత్రి దేవినేని ఉమా నిరంతరం ప్రజల్లో తిరుగుతూ కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ గ్రూపు రాజకీయాలతో ఆయనకు తలబొప్పి కడుతోంది. 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న సీనియర్ నేత దేవినేని ఉమాకి ప్రస్తుత జనరేషన్‌తో గ్యాప్ ఏర్పడిందని.. అందుకే ఈ ఇబ్బందులను ఆయన అనుచరులు చెప్పుకొస్తున్నారు.

దేవినేని ఉమా మహేశ్వరరావు (Photo: Facebook)

ఒకప్పుడు ఉమ్మడి జిల్లాని శాసించిన మాజీ మంత్రి ఉమా ఇప్పుడు తన సీటుకి పోటీ రావడం జీర్ణించుకోలేకపోతున్నారు. అనేకమంది నాయకులకు టికెట్లు ఇప్పించిన ఉమా.. ప్రస్తుతం అధినేత వద్ద నమ్మకాన్ని కోల్పోయారని ప్రచారం జరుగుతుంది. గతంలో టీడీపీ అధినేత ఆలోచనలకు తగ్గట్టు ఉమా నడుచుకునేవారని.. ప్రస్తుతం గ్యాప్ బాగా కనిపిస్తుందంటున్నారు సీనియర్ నేతలు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ టిక్కెట్ మాత్రం ఉమాకే కన్ఫామ్ అని చెప్పవచ్చు. బొమ్మసాని సుబ్బారావు కూడా కేశినేని నాని ఆశీస్సులతో ఏమాత్రం పట్టు సడలకుండా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. బొమ్మసాని పేరు పరిశీలించాలంటూ అధినేత
చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నారు ఎంపీ కేశినేని.

Also Read: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలాఖాలో వైసీపీ తడాఖా చూపుతుందా?

అక్కల రామోహనరావు (Photo: Facebook)

అధికార ప్రతిపక్షాల్లో ఇలా గ్రూప్ వార్ నడుస్తుండగా, చాపకింద నీరులా జనసేన (Janasena) కార్యక్రమాలు చేస్తున్నారు ఆ పార్టీ ఇన్‌చార్జి అక్కల రామోహనరావు (Akkala Ramamohana Rao). ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభావం భారీగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఇక బీజేపీ, వామపక్ష పార్టీలు ఎలాంటి ప్రభావం చూపకపోవచ్చు. పొత్తు పొడిస్తే జనసేన-టీడీపీ కలిసి పోటీచేయొచ్చు. అధికార, ప్రతిపక్ష పార్టీలు రెండూ గ్రూప్ వార్‌తో సతమతమవుతున్నందున.. ఎవరిది పైచేయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. వర్గ పోరుకు ఫుల్‌స్టాప్ పెట్టిన పార్టీయే ఇక్కడ గెలిచే చాన్స్ కనిపిస్తోంది.

ట్రెండింగ్ వార్తలు