Botcha Satyanarayana (Photo Credit : Facebook)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమవుతున్న వేళ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వారికి పలు సూచనలు చేశారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
‘విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల సీఎల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నాను’ అని బొత్స సత్యనారాయణ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై పేర్ని నాని ట్వీట్
‘తెలుగు న్యూస్ ఛానళ్ళ బ్రేకింగ్ వార్తలు చూస్తుంటే.. నేటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇద్దరి డిమాండ్లు తీరాలంటే రెండు రాష్ట్రాల పునారేకీకరణయే ఏకైక మార్గంగా కనపడుతుంద’ని మాజీ మంత్రి పేర్ని నాని ట్వీట్ చేశారు.
కాగా, రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు పరిష్కృతం కాకుండా ఉన్న సమస్యలపై చర్చించడానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి సమావేశమవుతున్నారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు చర్చకు రానున్నాయి. పదేళ్లుగా పరిష్కారం దొరకని అంశాలపై ఈ సమావేశం నిర్వహిస్తుండడం శుభ పరిణామమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని గుర్తుచేస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు