అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవాన్ని గుర్తుచేస్తూ రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
అయోధ్య నుంచి కూడా ఎవరినీ రామమందిర ప్రారంభోత్సవానికి పిలవలేదని అక్కడి ప్రజలు నిరాశ చెందారని చెప్పారు.

Congress Leader Rahul Gandhi
అయోధ్యలో రామమందిర నిర్మాణం, ప్రారంభోత్సవాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆయన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడారు. రామమందిర ప్రారంభోత్సవంలో పారిశ్రామిక వేత్తలు అదానీ, అంబానీ కనపడ్డారని, కానీ ఒక్క పేదవాడూ కనపడలేదని అన్నారు.
దీనిపై తాను ఆశ్చర్యానికి గురయ్యానని చెప్పారు. అయోధ్య విమానాశ్రయ నిర్మాణంతో అక్కడి రైతులు తమ భూములను కూడా కోల్పోయారని తెలిపారు. అయోధ్య నుంచి కూడా ఎవరినీ రామమందిర ప్రారంభోత్సవానికి పిలవలేదని అక్కడి ప్రజలు నిరాశ చెందారని చెప్పారు.
అయోధ్యలో ఉద్యమాన్ని అడ్వాణీ ప్రారంభించారని, అక్కడ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచిందని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ తమ ఆఫీసుని ఎలా కూల్చివేసిందో తాము అలాగే ఆ ప్రభుత్వాన్ని కూల్చనున్నామని చెప్పారు. కానీ, గుజరాత్ కాంగ్రెస్ లో కొన్ని లోపాలు ఉన్నాయని అన్నారు. 2022 గుజరాత్ ఎన్నికల్లో బీజేపీపై సరిగ్గా పోటీచేయలేకపోయామని చెప్పారు. 2017లో ఎన్నికలకు మూడు నెలల ముందు నుంచి బాగా పనిచేశామని, ఫలితాలు బాగా వచ్చాయని తెలిపారు.
ఇప్పుడు 2027 ఎన్నికలకు మరో మూడేళ్ల సమయం ఉందని అన్నారు. రేసు ఎక్కడ ఆపామో అక్కడి నుంచే మొదలు పెట్టాలని, గుజరాత్ లో 30 ఏళ్ల తర్వాత మళ్లీ 2027లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. తాను, తన సోదరితో పాటు పార్టీ నాయకత్వం అంతా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు మద్దతుగా ఉంటుందని అన్నారు.
Also Read: బల్దియాలో రచ్చరచ్చ.. మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ సభ్యులు పట్టు.. పోడియం చుట్టుముట్టి..