Gannavaram: గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు.. దుట్టా, యార్లగడ్డ, వంశీ ఒక్కతాటిపైకి రావడం సాధ్యమా?

వంశీకి టిక్కెట్ ఇస్తే యార్లగడ్డ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎవరు మద్దతు ఇస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

rift in gannavaram ysr congress party

Gannavaram YCP: ఏపీలో అధికార వైసీపీని అంతర్గత కుమ్ములాటలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇంతవరకు రచ్చకెక్కిన రామచంద్రాపురం రాజకీయం చల్లబడిందంటే.. ఇప్పుడు కొత్తగా గన్నవరం గొడవ వైసీపీ పెద్దలకు తలనొప్పిగా మారుతోంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకటరావు (Yarlagadda Venkat Rao) వచ్చే సారి అభ్యర్థిని నేనే.. అంటూ ప్రకటించుకోవడం హాట్‌టాపిక్ (Hot Topic) అవుతోంది. అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని చెబుతుండగా యార్లగడ్డ అడ్డంగా తిరగడం పార్టీ పెద్దలకు షాక్‌నిస్తోంది. ఇంతకీ గన్నవరంలో తెరచాటు రాజకీయం ఏంటో..?

అధికార వైసీపీని ఒక్కో సమస్య వెంటాడుతూనే ఉంది. నెల్లూరు పెద్దారెడ్ల పంచాయితీతో హీటెక్కిన వైసీపీ రాజకీయం కోనసీమ (Konaseema) లో కాకరేపింది.. ఈ పంచాయితీని ఎలాగోలా సద్దుమనిగించినట్లు భావిస్తుండగా.. తాజాగా ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ ఓడిపోయిన వైసీపీ.. టీడీపీ ఎమ్మెల్యే వంశీని పార్టీలో చేర్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఐతే వంశీ చేరికను ఆ నియోజవర్గంలోని ఇతర వైసీపీ నాయకులు తొలి నుంచి వ్యతిరేకిస్తుండగా.. ఇప్పుడు గత ఎన్నికల్లో పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు స్వరం పెంచుతున్నారు. ఎవరు ఏమనుకున్నా వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తానంటున్నారు యార్లగడ్డ వెంకట్రావ్. వైసీపీని నమ్ముకుని వచ్చిన వంశీని కాదని యార్లగడ్డకు టిక్కెట్ ఎవరిస్తారబ్బా..? అంటూ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

గన్నవరం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. సీనియర్ నేత దుట్టా రామచంద్రారావు (Dutta Ramachandrarao), యార్లగడ్డ వెంకటరావు, ఎమ్మెల్యే వంశీ వర్గాలుగా విడివిడిగా వ్యవహరిస్తున్న నేతలు.. ఒక్కతాటిపైకి రావడం సాధ్యమా? అన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే వంశీ పోటీకి అధిష్టానం ఓకే చెప్పినట్లు ప్రచారం జరుగుతుండగా యార్లగడ్డ వెంకట్రావు అడ్డు చెబుతుండటం వైసీపీని కుదిపేస్తోంది. వంశీకి టిక్కెట్ ఇస్తే యార్లగడ్డ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు? ఎవరు మద్దతు ఇస్తారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొందరు ఇవే ప్రశ్నలను యార్లగడ్డను అడుగుతుంటే.. ఆయన సన్నని చిరునవ్వుతో తప్పించుకుంటున్నారట. దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీల తరఫున పోటీ చేస్తారనే మరో టాక్ మొదలైంది. యార్లగడ్డ పోటీ చేస్తానంటున్నారు కానీ, ఏ పార్టీయో చెప్పడం లేదు కదా.. అంటే ఆయన ప్రతిపక్షాల పంచన చేరడం ఖాయమనే లాజిక్కు తీస్తున్నారు విశ్లేషకులు. మరోవైపు ఆయన స్వతంత్రంగా పోటీచేసి తిరుగుబాటు జెండా ఎగరేస్తారా? అన్నది చర్చనీయాంశంగా^మారింది.

Also Read: వైనాట్ 175 అంటున్న వైసీపీ.. కొత్త టార్గెట్ పెట్టుకున్న చంద్రబాబు.. రీచ్ అవుతారా?

ఒకవేళ యార్లగడ్డ టీడీపీకి వస్తే అక్కడ టిక్కెట్ లభిస్తుందనే గ్యారెంటీ ఉందా? అనేది పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రయత్నిస్తున్నారు. యార్లగడ్డ ఎంట్రీ ఇస్తే పట్టాభికి చెక్ పడుతోంది. దీంతో గన్నవరం రాజకీయం అన్ని పార్టీల్లో హాట్ హాట్‌గా మారింది. మొత్తం వ్యవహారానికి సెంటర్ పాయింట్‌గా మారిన యార్లగడ్డ అంతరంగం బయటపడితేగాని ఈ ఉత్కంఠకు తెరపడదు.

Also Read: బోస్‌ను ఒప్పించడం త్రిమూర్తులుకు సాధ్యమా.. ఎమ్మెల్సీ ఎలా డీల్ చేస్తారో?

ట్రెండింగ్ వార్తలు