konaseema ycp: బోస్‌ను ఒప్పించడం త్రిమూర్తులుకు సాధ్యమా.. ఎమ్మెల్సీ ఎలా డీల్ చేస్తారో?

రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది.

Rift in konaseema ycp

Rift in konaseema ycp : కోనసీమ వైసీపీ రాజకీయం కాక మీదుంది. రామచంద్రాపురం నియోజకవర్గంలో మంత్రి వేణు (Minister Venu), ఎంపీ బోస్‌ మధ్య పూడ్చలేని అగాధం పార్టీకి తలనొప్పిగా తయారైంది. మంత్రి వేణుకి మళ్లీ టిక్కెట్‌ ఇస్తే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానన్న బోస్‌ హెచ్చరికతో పార్టీ అలర్ట్ అయ్యింది.. వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు అప్పగించింది.. ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. ఇదే రామచంద్రాపురం (Ramachandrapuram) నుంచే వైసీపీ టిక్కెట్ ఆశిస్తున్న త్రిమూర్తులు (Thota Trimurthulu) ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు.. మంత్రి, ఎంపీ మధ్య రేగిన చిచ్చును వైసీపీ చల్లార్చగలదా?

అధికార వైసీపీలో కోనసీమ రాజకీయం కాకరేపుతోంది. వైసీపీ సమన్వయకర్త.. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాశ్ చంద్రబోస్, మంత్రి చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంది. ఇక తాను పార్టీలో ఉండడమో.. వైదలగొడమో ఒక్కటే మిగిలివుంది.. అన్న రేంజ్‌లో ఎంపీ బోస్ హెచ్చరికలు జారీ చేయడంతో వైసీపీ అధిష్టానం మరోసారి రామచంద్రాపురంపై ఫోకస్ పెట్టింది. ఈ నెల 16న బోస్ మద్దతుదారుల ప్రత్యేక సమవేశం కావడం.. మంత్రి వేణుపై నేరుగా విమర్శలు చేయడంతో మొదలైన వివాదం.. సీఎం జగన్ వద్దకు వెళ్లింది. ఎంపీ బోస్‌ను తాడేపల్లి పిలిపించి మాట్లాడిన సీఎం.. ఏం చెప్పారోగాని.. ఆదివారం మరోసారి ఫైర్ అయ్యారు బోస్.. వేణు అంటే తనకు అస్సలు గిట్టదని నిర్మోహమాటంగా చెబుతున్న బోస్.. పార్టీ తన కుమారుడు సూర్యప్రకాశ్‌కు టిక్కెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పడం ఓ విధంగా వైసీపీతో తెగతెంపులకు రెడీ అవుతున్నారా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.

ఎంపీ బోస్‌కు కౌంటర్‌గా మంత్రి వేణు కూడా ఆత్మీయ సమ్మేళనం పెట్టడం.. ముఖ్యమంత్రి అనుమతితో రామచంద్రాపురంలో ఇల్లు కట్టుకున్న తాను.. మరో 15 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగతానని ప్రకటించడం హీట్ పుట్టిస్తోంది. మంత్రి సమావేశం నిర్వహించిన రోజే ఎంపీ బోస్ ధిక్కార స్వరాన్ని మరింత గట్టిగా వినిపించడం రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతేకాదు ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా రామచంద్రాపురానికే చెందిన మరోనేత తోట త్రిమూర్తులకు అప్పగించింది వైసీపీ అధిష్టానం. ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన త్రిమూర్తులు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. మండపేట వైసీపీ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఐతే వచ్చే ఎన్నికల్లో కుదిరితే రామచంద్రాపురం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు త్రిమూర్తులు. గత ఎన్నికల్లో తరువాత వైసీపీలో చేరిన త్రిమూర్తులు.. ఈ నియోజకవర్గ వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదనే కండీషన్‌తో వైసీపీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అదే నేతకు తాజా వివాదం పరిష్కరించే బాధ్యత అప్పగించడం హాట్ టాపిక్‌గా మారింది. రామచంద్రాపురంలో త్రిమూర్తులకు కూడా గట్టి పట్టుఉంది. ఎంపీ బోస్.. మంత్రి వేణు మధ్య వివాదాన్ని త్రిమూర్తులు ఎలా డీల్ చేస్తారన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

Also Read: అదే జరిగితే పార్టీలో ఉండను- పిల్లి సుభాష్ చంద్రబోస్ సంచలన ప్రకటన

రామచంద్రాపురం వైసీపీలో మూడు వర్గాలు ఉన్నాయి. ఏ వర్గం కూడా ఒకరితో ఒకరు సమన్వయం చేసుకున్న పరిస్థితి కనిపించడం లేదని టాక్. ఐతే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వర్గం ప్రస్తుతం కాస్త సైలెంట్‌గా ఉంది. తమ నేతకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం.. పైగా పక్క నియోజకవర్గం మండపేట టిక్కెట్ ఇస్తామనే కండీషన్ ముందే పెట్టడంతో త్రిమూర్తులు వర్గం నేతలు మిగిలిన రెండు వర్గాలతో కలవడం లేదు. గత ఎన్నికల సమయంలో ఎంపీ బోస్ స్వయంగా మంత్రి వేణును తీసుకువచ్చి గెలిపించానని చెబుతున్నారు. ఇప్పుడు ఆయనే వ్యతిరేకిస్తున్నారు. సీఎం జగన్ ముందే తన మనసులోని మాట చెప్పేశానని.. ఇక తేల్చుకోవాల్సిందే అధిష్టానమే అని అంటున్నారు బోస్. సీనియర్ నేత అయిన బోస్‌ను ఒప్పించడం త్రిమూర్తులుకు సాధ్యమా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యమంత్రి జగన్ చెబితే వినని నేతను ఎలా దారికి తేగలరు? త్రిమూర్తుల వద్ద ఉన్న ఆ మంత్రదండం ఏమిటా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: బాలయ్యను ఓడించేలా వైసీపీ భారీ స్కెచ్.. రెబెల్స్ తేనేతుట్టెను కదిపిన టీడీపీ..

ప్రస్తుతానికి త్రిమూర్తులు, బోస్ మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. రామచంద్రాపురంలో చాంబర్ ఆఫ్ కామర్స్ సమవేశానికి ఆహ్వానం విషయంలో ఈ ఇద్దరిని పిలవొద్దని మంత్రి వేణు చెప్పారనేది బోస్ అభియోగం.. ఓ ప్రైవేటు కార్యక్రమానికి త్రిమూర్తులును ఆహ్వానించడాన్నే వ్యతిరేకించిన మంత్రి వేణు.. ఇప్పుడు బోస్‌తో సర్దుకుపోవాలని ఆయన చేసే సూచనలు పాటిస్తారా? అనేది కూడా ఆసక్తి రేపుతోంది. మొత్తానికి రామచంద్రాపురం రాజకీయం మొత్తం గందరగోళంగా మారింది. వైసీపీ అధినాయకత్వం వల్ల కానిది ఎమ్మెల్సీ ఎలా డీల్ చేస్తారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు