Hindupur : బాలయ్యను ఓడించేలా వైసీపీ భారీ స్కెచ్.. రెబెల్స్ తేనేతుట్టెను కదిపిన టీడీపీ..

బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చారు.

Hindupur YCP TDP Politics

Hindupur Politics: హిందుపురం అంటే టీడీపీ.. బాలయ్యే గుర్తుకువస్తారు. అన్న ఎన్టీఆర్ నుంచి టీడీపీకి పెట్టని కోటగా మారిపోయింది హిందుపురం (Hindupuram). గత ఎన్నికల్లో రాయలసీమ మొత్తం వైసీపీ జెండా (YCP Flag) ఎగిరినా శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai district) హిందుపురంలో మాత్రం తెలుగుదేశమే రెపరెపలాడింది. ఈ సారి మాత్రం టీడీపీ స్పీడ్‌కు బ్రేక్ వేసేలా అధికార వైసీపీ అడుగులు వేస్తోంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన మంత్రి పెద్దిరెడ్డి (MInister Peddireddy) స్వయంగా హిందుపురం రాజకీయాన్ని పర్యవేక్షిస్తున్నారు. బాలయ్య (Balayya) ను ఓడించేలా భారీ స్కెచ్ రెడీ చేశారు.

హిందుపురం నియోజకవర్గం నుంచి నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఇక్కడి నుంచే పోటీకి రెడీ అవుతున్నారు బాలయ్య.. టీడీపీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్ పోటీతో హిందుపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా మారిపోయింది. రాష్ట్రమంతా ఎదురుగాలి వీచినా.. హిందుపురంలో టీడీపీ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇందుకు గత ఎన్నికలే నిదర్శనం. అంతేకాదు రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో 49 చోట్ల వైసీపీయే గెలిచింది. అంతటి హవాలోనూ హిందుపురంలో ఆధిక్యం ప్రదర్శించలేకపోయింది అధికార పార్టీ.. ఐతే హిందుపురంలో బాలయ్య.. టీడీపీ బలంతో తాము ఓడిపోలేదని.. తమ పార్టీలోని గ్రూపులు.. క్యాడర్‌ను సమన్వయం చేసుకోలేకపోవడంతోనే దెబ్బతిన్నామని భావిస్తోంది వైసీపీ.. వచ్చే ఎన్నికల్లో ఓటమి రిపీట్ కాకూడదని పక్కా వ్యూహంతో అడుగులు వేస్తోంది.

బాలయ్యను ఓడించాలి.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరాలన్న ఏకైక లక్ష్యంతో సీఎం జగన్ హిందుపురంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇక్కడ దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీపై పోరాడుతున్న రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్.. గత ఎన్నికల్లో ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇక్బాల్‌ల్లో ఎవరిని పోటీకి పెట్టినా వచ్చే ఎన్నికల్లో గెలవలేమని భావిస్తోంది అధికార పార్టీ.. బాలయ్య జోరుకు బ్రేక్‌లు వేయాలంటే బలం.. బలగంతోపాటు సరైన వ్యూహం కూడా ఉండాలని రాయలసీమ ఇన్‌చార్జి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డిని రంగంలోకి దింపారు సీఎం జగన్.

Also Read: సీఎం జగన్ మనసులో ఏముంది.. సర్వే ఆధారంగానే టిక్కెట్లు ఖరారు చేస్తారా?

అధిష్టానం ఇచ్చిన టాస్క్‌తో హిందుపురంపై నజర్ ప్రకటించిన పెద్దిరెడ్డి గెలుపు గుర్రాలను అన్వేషించే పనిలో పడ్డారు. తన కుమారుడు ఎంపీ మిథున్‌రెడ్డికి సన్నిహితుడు.. వ్యాపార భాగస్వామి అయిన వేణుగోపాలరెడ్డి భార్య దీపికను ఇన్‌చార్జిగా నియమించేలా పావులు కదిపారు. ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న ఇక్బాల్‌కు.. నవీన్ నిశ్చల్‌కు మధ్య ఆధిపత్య పోరు ఉండటం.. నాలుగేళ్ల నుంచి ఇద్దరూ ఓ దారికి రాకపోవడంతో ఇద్దరినీ తప్పించి మూడో వ్యక్తిని రంగంలోకి దింపడంతోనే హిందుపురంలో ఆధిపత్యం చెలాయించొచ్చని భావించింది వైసీపీ.. అనుకున్న విధంగా సమయం చూసి దీపికను తెరపైకి తెచ్చింది. ఆమెను ఇన్‌చార్జిగా ప్రకటించడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోగా.. నవీన్ నిశ్చల్, ఇక్బాల్ వర్గాలు రగిలిపోతున్నాయి.

Also Read: జంపింగ్‌లకు ప్రత్యామ్నాయంగా జనసేన.. వారాహి యాత్రతో పవన్ పార్టీలో జోష్!

ఇన్నాళ్లు రెండు వర్గాలుగా కొట్లాడుకున్న నవీన్, ఇక్బాల్‌… ఇప్పుడు దీపిక తెరపైకి రావడంతో ఒకే రాగం అందుకున్నారు. తామిద్దరలో ఎవరికి టిక్కెట్ ఇచ్చినా సహకరించుకుంటామని.. హిందుపురంలో వైసీపీ జెండా ఎగరేస్తామని చెబుతున్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం పెద్దిరెడ్డి వ్యూహానికే పచ్చజెండా ఊపుతున్నారు. దీపిక హిందుపురంలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకావడం.. ఆమె భర్త రెడ్డి సామాజిక వర్గానికి చెందడంతో రెండు వర్గాల ఓట్లుతో టీడీపీకి బ్రేక్‌లు వేయొచ్చని అంచనా వేస్తోంది వైసీపీ.. ఐతే దీపిక తెరపైకి రావడంతో నవీన్ నిశ్చల్, ఇక్బాల్ తెరవెనుక చేసే రాజకీయమే కీలకంగా మారింది. ఈ ఆటలో ఎవరు ఎలాంటి పాచికలు వేస్తారో.. ఎవరికి ఎవరు చెక్ చెబుతారో కాని.. టీడీపీ టార్గెట్‌గా వైసీపీ విసిరిన చాలెంజ్.. రెబెల్స్ అనే తేనే తుట్టెను కదిపింది. ఇక ఏం జరగనుందో కాలమే నిర్ణయించనుంది.

ట్రెండింగ్ వార్తలు