Salur Constituency: సాలూరులో టీడీపీకి బహు నాయకత్వ సమస్య.. రాజన్నదొర ఆలోచనకు అధిష్టానం అంగీకరిస్తుందా?

టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీకి దీటైన పోటీ ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3 వేల ఓట్లు వచ్చినా.. ఈ సారి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

Salur Assembly Constituency Ground Report

Salur Assembly Constituency: కోర్టు తీర్పుతో ఎమ్మెల్యే అవ్వడమే కాదు.. ఆ తర్వాత వరుస విజయాలతో డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగారు పీడిక రాజన్నదొర (Peedika Rajanna Dora) అన్యూహంగా పదవి వచ్చినా.. ఆ అవకాశం చేజారకుండా నాలుగుసార్లు గెలిచిన రికార్డు సొంతం చేసుకున్నారు. కుదిరితే ఓ సారి ఎంపీగా పనిచేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టారు రాజన్నదొర.. గిరిజనుల్లో ప్రత్యేక ప్రేమాభిమానాలు పొందిన ఏపీ డిప్యూటీ సీఎం.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా సాలూరుకు ఏం చేశారు? పార్టీలో ఆయన మాట చెల్లుబాటు అవుతోందా? ప్రతిపక్ష టీడీపీ పరిస్థితి ఏంటి? సాలూరులో ఈ సారి కనిపించబోయే సీనేంటి?

పార్వతీపురం మన్యం జిల్లా (parvathipuram manyam district) సాలూరు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక స్థానం. ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఈ నియోజకవర్గంలో గిరిజన, మైదాన ప్రాంతాలు రెండూ సమానంగా ఉంటాయి. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన సాలూరు ఒకప్పుడు టీడీపీకి కంచుకోట అయితే.. 2006 నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్నదొర ఖిల్లాగా మారిపోయింది. 2004లో గెలిచిన ఎమ్మెల్యే భంజ్‌దేవ్ ఎన్నికల చెల్లదంటూ కోర్టు తీర్పు వెలువడటంతో.. 2006లో రెండోస్థానంలో నిలిచిన రాజన్నదొర ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించారు. కోర్టు తీర్పుతో పదవి వచ్చినా.. 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి సాలూరును సుస్థిరం చేసుకున్నారు రాజన్నదొర..

Peedika Rajanna Dora

సాలూరు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు.. మైదాన ప్రాంతాల్లో తూర్పు కాపు, కొప్పల వెలమ సామాజికవర్గాల ప్రభావం ఎక్కువ. ముఖ్యంగా సాలూరు మున్సిపాలిటీ ఓట్లు విజేతలను నిర్దేశిస్తుంటాయి. మెంటాడ, మక్కువ, పాచిపెంట మండలాల్లో టీడీపీకి చెక్కుచెదరని ఓటు బ్యాంకు ఉన్నా.. గత మూడు ఎన్నికల్లో రాజన్నదొర హవాయే నడిచింది. 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజన్నదొర.. 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయాన్ని సాధించారు. ఆ తర్వాత వైసీపీలో చేరి గత రెండు సార్లు తిరుగులేని విజయం నమోదు చేశారు. అయితే వైసీపీలో గిరిజన నేతగా రాజన్నదొరకు తిరుగులేకపోయినా.. సాలూరు పట్టణంలో గ్రూపు తగాదాలు తలనొప్పిగా మారుతున్నాయి. అయితే ముక్కుసూటి తనంతో వ్యవహరించే రాజన్నదొర.. జనం సమస్యలపై వేగంగా స్పందిస్తారనే మంచిపేరు సంపాదించుకున్నారు. అధిష్టానానికి విధేయుడిగా ఉండటంతో గత మంత్రివర్గ విస్తరణలో రాజన్నదొరకు మంత్రి పదవి వరించింది.

Gummadi Sandhya Rani

వైసీపీలో రాజన్నదొర నాయకత్వానికి ఎదురులేకపోయినా.. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో కాస్త వెనకబడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిధుల కొరతతో కొన్ని పనులను సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రాజన్నదొర. ముఖ్యంగా గిరి శిఖర గ్రామాలకు రహదారులు, తాగునీరు, విద్యా, వైద్యం వంటి మౌలిక సదుపాయాలను కల్పించలేదని విమర్శలు ఉన్నాయి. 18 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా పనిచేసినా.. చెప్పుకోదగ్గ అభివృద్ధి చేయలేదని.. సాలూరు ఆటోనగర్ ఏర్పాటు, పెద్దగెడ్డ, వెంగళరాయసాగర్ జలాశయాలకు నిధులు సాధనలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సమస్యలు నెరవేరక చాలా గిరిజన గ్రామాల వారు ఇప్పటికీ డోలీలనే ఉపయోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాలూరులో ఓటమి ఎరుగని నేతగా పేరున్న రాజన్నదొర ఈ సారి పార్లమెంట్‌కు పోటీ చేయాలని భావిస్తున్నారు. ఐతే సాలూరుకు ప్రత్యామ్నాయ నేత లేకపోవడంతో అధిష్టానం ఆయన ఆలోచనకు అంగీకరిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

Also Read: మంత్రి సీదిరి గట్టెక్కగలరా? గౌతు ఫ్యామిలీ.. పొలిటికల్ లెగసీని కాపాడుకుంటుందా?

Rajendra Pratap Bhanj Deo

ఇక వైసీపీకి దీటుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీకి బహు నాయకత్వ సమస్య వెంటాడుతోంది. ఈ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా గుమ్మడి సంధ్యారాణి (Gummadi Sandhya Rani) ని నియమించింది అధిష్టానం. కానీ, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్ (Rajendra Pratap Bhanj Deo) కూడా ఇన్‌చార్జి పదవిని ఆశిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఇద్దరు కలిసే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. క్యాడర్‌ మాత్రం రెండు వర్గాలుగా విడిపోయింది. కొన్ని మండలాల్లో సంధ్యారాణి నాయకత్వాన్ని క్యాడర్ అంగీకరించడం లేదు. 2006 వరకు భంజ్‌దేవ్ ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో టీడీపీకి సాలూరులో గట్టి పట్టు ఉండేది. ఆయన పదవీచ్యుతడయ్యాక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. ప్రస్తుతం భంజ్‌దేవ్, సంధ్యారాణి వర్గాల మధ్య గ్రూప్ వార్ పెరిగిపోవడంతో అధిష్టానం కూడా గట్టి హెచ్చరికలు పంపుతోంది. ఈ మధ్య అమరావతిలో సాలూరుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు.. సంధ్యారాణికి అందరూ సహకరించాల్సిందేనని స్పష్టం చేశారు.

Also Read: ఆమదాలవలసలో మామ మరోసారి జెండా ఎగరేస్తారా.. అల్లుడు చక్రం తిప్పుతాడా?

టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే వైసీపీకి దీటైన పోటీ ఇవ్వచ్చనే అంచనాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 3 వేల ఓట్లు వచ్చినా.. ఈ సారి ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక బీజేపీ వామపక్షాలు ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ పరిస్థితిలో లేవు. ప్రధానంగా వైసీపీ, టీడీపీ మధ్యే పోటీ కనిపిస్తోంది. టీడీపీ క్యాడర్ ఏకతాటిపై నడిస్తేనే వైసీపీకి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీలో కూడా వర్గ విభేదాలు టీడీపీలో ఆశలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు మరో పది నెలల సమయం ఉండటంతో రెండు పార్టీలూ గ్రూపుల గొడవలపై దృష్టిపెట్టాల్సివుంది.

ట్రెండింగ్ వార్తలు