Skyscraper : హైదరాబాద్‌లో ఆకాశహర్మ్యాలకు డిమాండ్‌.. వెస్ట్‌లో అత్యధికంగా స్కైస్క్రాపర్స్‌ నిర్మాణం

హైదరాబాద్ వెస్ట్ ప్రాంతమైన ఐటీ కారిడార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అత్యధికంగా స్కైస్క్రాపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. 50 నుంచి 59 అంతస్తుల మధ్య 9 హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

skyscraper projects trend rise in hyderabad

Hyderabad Skyscraper: ఒకప్పుడు ఐదు అంతస్తుల భవనం అంటే అమ్మో అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్‌లో అంతా ఆకాశహర్మ్యాల ట్రెండ్ నడుస్తోంది. 30 అంతస్తుల నుంచి మొదలు 60 అంతస్తుల వరకు భారీ ప్రాజెక్టులను డెవలప్‌ చేస్తున్నాయి నిర్మాణ సంస్థలు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వెస్ట్ ప్రాంతమైన ఐటీ కారిడార్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అత్యధికంగా స్కైస్క్రాపర్స్ నిర్మాణం జరుపుకుంటున్నాయి. కనీసం 5 ఎకరాల నుంచి మొదలు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న హైరైజ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో 3వేల నుంచి 4 వేల వరకు ఫ్లాట్స్ ఉంటున్నాయి. ఒక్కో ప్రాజెక్టు ఓ ఊరునే తలపించేలా నిర్మిస్తున్నారు బిల్డర్లు. కోకాపేట్, (kokapet) తెల్లాపూర్, నార్సింగి, గండిపేట్, పుప్పాలగూడ, కొండాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో 50 నుంచి 59 అంతస్తుల మధ్య 9 హైరైజ్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటి నిర్మాణం 2026 నుంచి 2028 నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఫ్లాట్లను అందజేసేందుకు డెవలపర్లు ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే పూర్తైన, పూర్తికావడానికి సిద్ధంగా ఉన్నవన్నీ 40 అంతస్తుల లోపు ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. వీటి కంటే మరో 20 అంతస్తులు అధికంగా నిర్మిస్తుండటంతో గతంలో ఉన్న ఆకాశహర్మ్యాలు సైతం చిన్నబోతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్మాణంలో ఉన్న హైరైజ్‌ అపార్ట్‌మెంట్స్‌కు బయ్యర్స్‌ నుంచి చక్కని డిమాండ్‌ ఉంది. దీంతో మరికొంతమంది బిల్డర్లు కూడా స్కైస్క్రాపర్స్‌ను డెవలప్‌ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. హైరైజ్ అపార్ట్ మెంట్స్‌లో నివాసం ఉండటాన్ని కొనుగోలుదారులు సమాజంలో హోదాగా భావిస్తున్నారు. నివాసం ఉండటంతో పాటు మరింత పెట్టుబడి పెట్టి ఫ్లాట్స్ కొని రెంట్‌కు సైతం ఇస్తున్నారు. ఐటీ ఎంప్లాయీస్‌తో పాటు ఇతర రంగాల ఉద్యోగులు, వ్యాపారస్తులు, అధిక ఆదాయ వర్గాలు హైరైజ్ అపార్ట్‌మెంట్స్‌లోనే ఎక్కువగా ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో ఫ్లాట్ కోసం కనిష్టంగా కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తుండగా, గరిష్టంగా ఒక్కో ఫ్లాట్‌కు 10 కోట్ల రూపాయలు సైతం ధరలున్నాయి.

Also Read: హైదరాబాద్‌లో జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోతోన్న నిర్మాణ రంగం.. స్థిరమైన వృద్ధితో ఫుల్‌ జోష్‌

హైరైజ్ అపార్ట్‌మెంట్స్ 2వందల మీటర్ల ఎత్తులో అంటే 50 నుంచి 59 అంతస్తుల వరకు ఉంటాయి. అక్కడి నుంచి చూస్తే హైదరాబాద్ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఉదయం, సాయంత్రం నగరంలోని పరిసరాలను ఆస్వాదించవచ్చు. అత్యంత ఎత్తులో ఉంటాయి కాబట్టి వాహనాల ధ్వని, వాయు కాలుష్య సమస్యలు ఉండవు. ఏకాంతం కోరుకునేవారికి స్కైస్క్రాపర్స్‌లోని ఫ్లాట్స్ అనువుగా ఉంటాయి. ఆకాశహర్మ్యాల ప్రాజెక్టులన్నీ కూడా గేటెడ్‌ కమ్యూనిటీలే. మొత్తం ప్రాజెక్టు విస్తీర్ణంలో 70 శాతం వరకు ఖాళీ ప్లేస్‌ను సౌకర్యాల కోసం వదిలి మిగతా స్థలంలో అపార్ట్‌మెంట్స్‌ కడుతున్నారు. వీటిలో ఉంటున్నవారికి నీరు, గ్యాస్‌, కరెంట్‌ సమస్యలు పెద్దగా ఉండవు. ఆధునిక సౌకర్యాలన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తుండటంతో పాటు సేఫ్టీ పరంగానూ బెస్ట్‌ ప్రాజెక్ట్‌లుగా ఉంటున్నాయి.

Also Read: అఫర్డబుల్ హౌజింగ్ ప్రాజెక్టులపై భారీ ఆశలు.. ఆ రేంజ్‌లో ఇళ్లు రావాలంటోన్న నిపుణులు

హైరైజ్ అపార్ట్‌మెంట్ ప్రాజెక్టుల్లో సానుకూలతతో పాటూ ప్రతికూలతలను కొనుగోలుదారులు బేరీజు వేసుకోవాలని రియల్ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో కొనుగోలు చేసిన ఇంటి విస్తీర్ణంలో 30 శాతం వరకు ఉమ్మడి అవసరాలకు పోతుందనేది బయ్యర్స్‌ గమనించాలి. 2వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్‌ కొంటే బిల్టప్‌ ఏరియా 14 వందల నుంచి 15 వందల వరకు మాత్రమే ఉంటుంది. ఇక 59 అంతస్తుల భవనం అంటే కిందకు రావాలన్నా, పైకి వెళ్లాలన్నా లిఫ్ట్‌ల వద్ద కాసేపు ఎదురుచూపులు తప్పవు. ఇక స్కైస్క్రాపర్స్ కమ్యూనిటీల్లో నిర్వహణ చార్జీలు సైతం ఎక్కువే ఉంటాయి. ఇక పైఅంతస్తుల్లో ఉండే ప్లాట్స్‌కు గాలుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఒక్కోసారి ఈ గాలుల శబ్దాలు హోరెత్తిస్తుంటాయి. వీటిని తట్టుకునేలా కిటికీలు ఉన్నాయా.. లేవా.. అనేది ఒకటికి పదిసార్లు ఫ్లాట్‌ను కొనుగోలు చేసే సమయంలో సరిచూసుకోవాలని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు