CM KCR Pays Tributes To Nizam : చివరి నిజాంకు ఘనంగా నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్..

ఎనిమిదవ, చివరి నిజాం నవాబు ముకర్రమ్ ఝాకు సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

CM KCR pays tributes to Nizam :  ప్రపంచంలో ఐదవ అతిపెద్ద వజ్రం అయిన జాకబ్‌ డైమండ్‌ ను పేపర్ వెయిట్ గా ఉపయోగించిన నిజాం నవాబుల గురించి వారి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి నిజాం నవాబుల వంశంలో ఎనిమిదవ, చివరి నిజాం నవాబు ముకర్రమ్ ఝా శనివారం (జనవరి 14,2023) రాత్రి టర్కీలోని ఇస్తాంబుల్ లో కన్నుమూశారు. ఈరోజు ఆయన పార్థివ దేహాన్ని ప్రత్యేక విమానంలో హైదరాబాదుకు తీసుకొచ్చి చౌమొహల్లా ప్యాలెస్ లో పార్థివ దేహాన్ని ఉంచారు. ఆయన భౌతికకాయానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. నిజాం కుటుంబ సభ్యులను పరామర్శించారు.

హైదరాబాద్ లో ఓ వెలుగు వెలిగిన నిజాం వంశం ప్రాభవం భారత్ లో సంస్థానం విలీనం తరువాత వారి వంశస్తులు వివిధ దేశాల్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో చివరి నిజాం నవాబు ముకర్రమ్ జా అంత్యక్రియలు హైదరాబాద్ లోనే జరగాలని వారి వారసులు నిర్ణయించారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని హైదరాబాద్ తరలించారు. ముకర్రమ్ జా చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలను చార్మినార్ పక్కనున్న మక్కా మసీదులో నిర్వహించనున్నారు. అక్కడే ఆయనను ఖననం చేయనున్నారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. మధ్యాహ్నాం మూడున్నరకు చౌమహల్లా ప్యాలెస్ నుంచి అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మక్కా మసీదు ప్రాంగణంలో ముకర్రమ్ ఝా అంత్యక్రియలను సంప్రదాయం బద్దంగా ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు