రైతు రుణ‌మాఫీపై రేవంత్ స‌ర్కార్ వేగం.. మార్గదర్శకాలు ఇవేనా?

రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. అంతేకాదు.. భార్య లేదా భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రెండు ల‌క్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేయ‌నుంది ప్రభుత్వం.

Farmer Loan Waiver : రైతు రుణ‌మాఫీపై రేవంత్ స‌ర్కార్ వేగం పెంచింది. పంద్రాగ‌స్టులోగా రుణమాఫీ చేయాలని డెడ్ లైన్‌ పెట్టుకున్న రేవంత్ స‌ర్కార్.. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత‌ల రుణాల వివ‌రాలను సేక‌రిస్తోంది. దీనికోసం ప‌క్కా ప్రణాళిక‌తో మార్గద‌ర్శకాల‌ను రూపొందిస్తోంది.

డిసెంబ‌ర్ 9 క‌టాఫ్ డేట్‌..!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు తీసుకున్న రుణాల‌ను మాఫీ చేయ‌డం అన్నది.. ఇప్పుడు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత‌గా పెట్టుకుంది. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేయాలన్న టార్గెట్‌తో సీఎం రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తోంది. ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ చేసేందుకు మార్గద‌ర్శకాల‌ను రూపొందించ‌డంలో బిజీగా ఉంది. రైతుకు న‌ష్టం జ‌ర‌గ‌కుండా.. ఇచ్చిన మాట‌ను నిల‌బెట్టుకునే విధంగా.. ప‌క్కాగా గైడ్ లైన్స్ రూపొందిస్తుంది ప్రభుత్వం. రుణ‌మాఫీకి డిసెంబ‌ర్ 9ని క‌టాఫ్ డేట్‌గా తెలంగాణ ప్రభుత్వం ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆ రోజు సోనియా గాంధీ పుట్టిన రోజు కావడం.. తెలంగాణ ఏర్పాటుపై 2009 లో ఇదే రోజు ప్రక‌ట‌న చేయడంతో డిసెంబ‌ర్ 9 వైపు మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మా..
ఈ పథకం అమలులో భాగంగా ప్రభుత్వం 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాలో రైతుల సమాచారాన్ని సేకరిస్తోంది. పీఏసీఎఎస్‌ల వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, రుణం వివరాలను తీసుకుంటోంది. రైతుకు సంబంధించి ఇంటిపేరుతో సహా రైతు పూర్తిపేరు, తండి లేదా భర్త పేరు, రైతు ఆధార్‌ కార్డు నెంబరు, మొబైల్‌ నెంబర్‌, స్త్రీనా, పురుషుడా, జనరల్‌, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చిరునామా సేకరిస్తున్నారు. రైతు లోన్‌కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో కస్టమర్‌ ఐడీ నెంబర్, లోన్‌ అకౌంట్‌ నెంబరు, టైప్‌ ఆఫ్‌ లోన్‌, ఏ విధమైన అకౌంట్, క్రాప్‌ లోన్‌ మంజూరైన తేదీ, అప్పు తీసుకున్న తేదీ నుంచి అసలు మొత్తం, వడ్డీ రేటు వంటి వివరాలను నమోదు చేస్తోంది.

రైతు లోన్‌ అకౌంట్‌ ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
అలాగే 2023 డిసెంబర్ 9 వరకు అసలు మొత్తం, వడ్డీ, ఇతర ఛార్జీలు, మొత్తం ఔట్‌ స్టాండింగ్‌ లోన్‌, అదే క్రమంలో 2024 మే 19 తేదీ నాటికి రైతులపై ఉన్న ఔట్‌ స్టాండింగ్‌ లోన్ ల వివరాలను సేకరిస్తోంది. అటు రైతు లోన్‌ అకౌంట్‌ ప్రస్తుత పరిస్థితి ఏమిటి? ఎన్‌పీఏ జాబితాలో పడిపోయిందా? స్టాండర్డ్‌గా ఉందా? రైతు సేవింగ్‌ బ్యాంకు అకౌంట్‌ నెంబరు ఏమిటి? ఐడీ నెంబర్ ఏమిటి? తదితర వివరాలను కూడా ప్రొఫార్మాలో బ్యాంకులను అడుగుతోంది ప్రభుత్వం.

ఒక కుటుంబానికి 2 లక్షల వరకే రుణమాఫీ..!
రెండు ల‌క్షల రుణ‌మాఫీపై తెలంగాణ ప్రభుత్వం మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఒక కుటుంబానికి 2 లక్షల వరకే రుణమాఫీ చేయనుంది. అసలు, వడ్డీ కలిపి 2 లక్షల లోపు బకాయిలు ఎంతుంటే అంత మొత్తం మాఫీ చేస్తుంది. ఒక‌వేళ 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే 2 లక్షలు మాఫీ అవుతుంది. మిగతాది రైతు చెల్లించాల్సి ఉంటుంది.

నాడు వైఎస్ సర్కార్ చేసిన విధంగానే..!
ఇక రైతు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు తీసుకుంటే అన్నీ కలిపి లెక్కిస్తారు. అంతేకాదు.. భార్య లేదా భర్త పేర్ల మీదున్న అన్ని ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలను క్రోడీకరించి రెండు ల‌క్షల రుణమాఫీ పథకాన్ని అమలు చేయ‌నుంది ప్రభుత్వం. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల స‌మాచారాన్ని కూడా తీసుకుంటుంది. రైతులు ఎంతమేర బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్నారన్న సమాచారాన్ని సేకరిస్తోంది. దీంతో 2009లో వైఎస్ సర్కారు చేసిన విధంగా రేవంత్ సర్కారు కూడా కొన్ని పరిమితులతో బంగారం రుణాలు మాఫీ చేస్తుందన్న చ‌ర్చ జరుగుతోంది.

2023 డిసెంబర్ 9వ తేదీ కటాఫ్‌ తేదీ అయితే అప్పటి వరకు రైతుల పేర్ల మీద ఉన్న బకాయిలను మాఫీ చేయనుంది ప్రభుత్వం. 2023 డిసెంబరు 9 తేదీ లోపు ఎన్ని పంట రుణాలు తీసుకున్నా అవన్నీ రుణమాఫీ పథకం పరిధిలోకి వస్తాయి. అయితే ప్రొఫార్మాలో మాత్రం 2024 మే 19 వరకున్న బకాయిలు వివరాలను కూడా సేకరించాలని పేర్కొన్నారు. దీంతో 2023 డిసెంబర్ తేదీ వరకున్న బకాయిలు, 2024 మే 19 తేదీ వరకున్న బకాయిల లెక్కలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. మొత్తానికి రెండు ల‌క్షల రుణ‌మాఫీపై వెన‌క్కి త‌గ్గేదే లేదంటోంది సీఎం రేవంత్ రెడ్డి సర్కారు.

రైతు రుణమాఫీకి గైడ్ లైన్స్ ఇవేనా?
* బ్యాంకుల నుంచి రైతు సమాచారం సేకరణ
* 4 విభాగాలు, 30 అంశాలతో కూడిన ప్రొఫార్మాతో సమాచారం
* రుణమాఫీ పథకానికి డిసెంబర్ 9 కటాఫ్ తేదీ
* కుటుంబానికి రూ.2లక్షల వరకు రుణమాఫీ
* అసలు, వడ్డీ కలిపి రూ.2లక్షల లోపు బకాయిలు మాఫీ
* రూ.2లక్షల కంటే ఎక్కువ ఉంటే రైతులే చెల్లించాలి
* ఒకటి కంటే ఎక్కువ బ్యాంకుల్లో అప్పు ఉంటే అన్నీ కలిపి లెక్కింపు
* భార్య/భర్త ఖాతాల వివరాలు, అప్పులు, వడ్డీలు క్రోడీకరించి పథకం అమలు
* ప్రొఫార్మాలో బంగారం రుణాల ప్రస్తావన
* రైతుల బంగారం రుణాల వివరాలు సేకరణ

* దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలకు వర్తించని పథకం
* డిసెంబర్ 9 తర్వాత తీసుకున్న రుణాలకు వర్తించని పథకం
* రుణమాఫీ ప్రొఫార్మాలో నాలుగు విభాగాలు
* పీఏసీఎస్ ల వివరాలు, బ్యాంకుల వివరాలు, రైతుల వివరాలు, రుణం వివరాలు
* రైతు ఇంటి పేరుతో సహా రైతు పూర్తి పేరు, తండ్రి/భర్త పేరు సేకరణ
* రైతు ఆధార్ కార్డు నెంబర్, మొబైల్ నెంబర్ నమోదు
* స్త్రీ, పురుషుడు, జనరల్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, చిరునామా సేకరణ
* నాలుగో విభాగంలో లోన్ వివరాలు
* కస్టమర్ ఐడీ నెంబర్, లోన్ అకౌంట్ నెంబర్ సేకరణ
* టైప్ ఆఫ్ లోన్, ఏ విధమైన అకౌంట్ వివరాలు

* లోన్ మంజూరు తేదీ, అప్పు తీసుకున్న తేదీ నుంచి అసలు మొత్తం, వడ్డీ రేటు
* 2023 డిసెంబర్ 9 వరకు అసలు మొత్తం, వడ్డీ, ఇతర ఛార్జీలు నమోదు
* మొత్తం ఔట్ స్టాండింగ్ లోన్ వివరాలు సేకరణ
* అకౌంట్ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్ పీఏ జాబితాలో పడిపోయిందా? స్టాండర్డ్ గా ఉందా?
* రైతు సేవింగ్ బ్యాంకు అకౌంట్ నెంబర్, ఐడీ నెంబర్ వంటి వివరాలు నమోదు.

Also Read : ప్రభుత్వ భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్, పూర్తి లెక్కలు తీస్తున్న సీఎం.. ఎందుకో తెలుసా?

ట్రెండింగ్ వార్తలు