ప్రభుత్వ భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్, పూర్తి లెక్కలు తీస్తున్న సీఎం.. ఎందుకో తెలుసా?

ఏ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో గుర్తిస్తున్నారు.

ప్రభుత్వ భూములపై రేవంత్ సర్కార్ ఫోకస్, పూర్తి లెక్కలు తీస్తున్న సీఎం.. ఎందుకో తెలుసా?

Cm Revanth Reddy : హెచ్ఎండీఏ పరిధిలోని ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చే పనిలో రేవంత్ సర్కార్ నిమగ్నమైంది. ఏ ప్రాంతంలో ఎంత ప్రభుత్వ భూమి ఉందో గుర్తిస్తున్నారు. నిరుపయోగంగా ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములతో పాటు కబ్జారాయుళ్ల ఎంట్రీతో లిటికేషన్ లిస్ట్ లో చేరిన సర్కార్ భూముల లెక్కలు కూడా తీస్తున్నారు. వీటిని వేలం వేసి కొంతైనా సర్కార్ ఖజానాను నింపుకోవచ్చని భావిస్తోంది రేవంత్ సర్కార్.

ఖజానాకు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్..
తెలంగాణలో ఎన్నికలు ముగియటంతో హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకోసం ఖజానాకు ఆదాయం పెంచుకునే మార్గాలపై ఫోకస్ చేసింది. ఎక్సైజ్, జీఎస్టీ, రిజిస్ట్రేషన్ శాఖల్లో పన్నుల ఎగవేతకు బ్రేకులు వేసుకుంటూనే మరోవైపు నిరుపయోగంగా పడి ఉన్న సర్కార్ భూములపై దృష్టి సారించింది. వాటిని సర్కార్ అవసరాలకు ఉపయోగించుకోవడంతో పాటు అవసరమైన మేరకు వేలం వేయాలని భావిస్తోంది. దీంతో రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూర్చుకోవచ్చని భావిస్తోంది సర్కార్.

ప్రభుత్వానికి సవాల్ గా మారిన భూముల పరిరక్షణ..
హెచ్ఎండీఏ పరిధిలో వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములు ఉన్నాయి. కొన్ని హెచ్ఎండీఏ ఆధీనంలో ఉంటే, మరికొన్ని కబ్జాకోరుల నీడలో, కోర్టు కేసుల్లో ఉన్నాయి. అయితే హెచ్ఎండీఏ పరిధిలోని వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ ప్రభుత్వానికి సవాల్ గా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఔట్లు వేసి గత ప్రభుత్వం విక్రయించింది. ఖజానాకు ఆదాయం సమకూర్చుకుంది. ఇంకా పలుచోట్ల వేల కోట్ల విలువైన భూములు ఉన్నప్పటికీ వాటిని కాపాడుకోవడం కోసం అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

భూముల ఆక్రమణలో ప్రజాప్రతినిధులు..!
గతంలో జవహర్ నగర్ భూముల ఆక్రమణల వ్యవహారంలో ప్రజాప్రతినిధులు ఉన్నట్లు చర్చ జరిగింది. శంషాబాద్, పుప్పాలగూడ, మియాపూర్ లో హెచ్ఎండీకు చెందిన విలువైన భూములు అన్యాక్రాంతం కావడంతో సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది.

ఇనుప కంచెలు వేసినా.. భూములను కాపాడుకోలేని పరిస్థితి..
నగరం చుట్టుపక్కల హెచ్ఎండీఏ ల్యాండ్ బ్యాంక్ లో ఉన్న భూములకు చుట్టూ ఇనుప కంచెలు వేసినా.. వాటికి తొలగించి మరీ ఆక్రమిస్తున్నారు. అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నా.. భూములను కాపాడుకోలేని పరిస్థితి. ప్రస్తుతం ఆ ప్రాంతాల్లో భూములు కోట్ల రూపాయలు పలుకుతుండటంతో కబ్జాదారులు మరింత రెచ్చిపోతున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. వీటన్నింటిపై రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఎంత భూమి ఉంది? ఎక్కడెక్కడ ఉంది? కబ్జాకు గురైనటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే లెక్కలు తీస్తోంది. కబ్జాకు గురైన భూముల్లో ఏమైనా నిర్మాణాలు జరిగాయా? ఎవరు నిర్మించారు? అనే వివరాలతో సహా పూర్తి లెక్క తియ్యాలని ప్రభుత్వం ఆదేశించింది.

కబ్జాదారులపై కఠినమైన చర్యలు..
హైదరాబాద్ చుట్టుపక్కల.. జిన్నారం 170 ఎకరాలు, లక్డారం 184 ఎకరాలు, చిట్ కుల్ 50, ఇస్నాపూర్ 22 ఎకరాలు, పటాన్ చెరు 8 ఎకరాలు, ఫసల్వాడి 52 ఎకరాలు, ఆరుట్ల కంది 106 ఎకరాలు, కంది 190 ఎకరాలు, బుదేరా 86 ఎకరాలు, శంకరం పేట్ 85 ఎకరాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తీసినట్లు సమాచారం. కోర్టు లిటిగేషన్ అంశాలపై లీగల్ గా ముందుకెళ్లాలని, కబ్జాకు గురైనటువంటి భూములపై కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకునే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

హెచ్ఎండీఏ భూములు గతంలో ఎవరికైనా లీజుకి కానీ, ఇతర అంశాలకు ఇచ్చినట్లు అయితే, వాటికి సంబంధించిన విషయం మీద పునరాలోచన చేయాలని ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని రేవంత్ సర్కార్ ఆదేశించింది. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయనుంది ప్రభుత్వం.

Also Read : తెలంగాణలో మరోసారి అధికారుల బదిలీ? కీలక శాఖల్లో మార్పులు, చేర్పులు..? కారణం అదేనా