తెలంగాణలో మరోసారి అధికారుల బదిలీ? కీలక శాఖల్లో మార్పులు, చేర్పులు..? కారణం అదేనా

ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

తెలంగాణలో మరోసారి అధికారుల బదిలీ? కీలక శాఖల్లో మార్పులు, చేర్పులు..? కారణం అదేనా

Cm Revanth Reddy : తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఉన్నత ఉద్యోగులను బదిలీ చేయబోతోందా? సెక్రటేరియట్ లో ముఖ్యమైన ఉద్యోగులతో పాటు అన్ని శాఖాధిపతుల బదిలీలు ఉండనున్నాయా? ఎన్నికల కోడ్ ముగియగానే పరిపాలన వ్యవస్థను ప్రభుత్వం ఆర్డర్ లో పెట్టనుంది? ఇప్పుడు తెలంగాణలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

6 గ్యారెంటీల అమలు పూర్తి స్థాయిలో జరగలేదన్న భావనలో సీఎం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి 6 నెలలు కావొస్తోంది. ఇప్పటివరకు రెండుసార్లు ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. తాజాగా లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియగానే మరోసారి అధికారుల బదిలీ చేపట్టనున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఈ 5 నెలల కాలంలో కాంగ్రెస్ 6 గ్యారెంటీల అమలు అన్నది పూర్తి స్థాయిలో జరగలేదన్న భావనలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉన్నారని తెలుస్తోంది.

ఆశించిన స్థాయిలో పని చేయని కొంతమంది అధికారులు..
దీనికి తోడు కొంతమంది అధికారులు ఆశించిన మేరకు పని చేయడం లేదని అసంతృప్తితో ఉన్నారట. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలకు అనుగుణంగా అధికారులు వ్యవహరించడం లేదని అనుకుంటున్నారని సమాచారం. దీంతో పాటు ముందు నుంచి కీలక శాఖలకు సంబంధించిన అధికారుల మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు. ఇందులో భాగంగానే ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన కీలక అధికారులను మారుస్తారన్న చర్చ సెక్రటేరియట్ వర్గాల్లో జరుగుతోంది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరికి అధికారుల సహకారం, సర్కార్ కీలక నిర్ణయాలపై లీకులు..!
ప్రభుత్వంలో పని చేస్తున్న కొంతమంది అధికారులు.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొందరికి ఇంకా సహకరిస్తున్నారని సీఎం రేవంత్, మంత్రులు అనుకుంటున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపై వారు లీకులు ఇస్తున్నారనే అభిప్రాయం ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతోందట. అంతే కాకుండా పరిపాలనలో కీలకమైన ఫైనాన్స్, రెవెన్యూ శాఖలతో పాటు మరికొన్ని శాఖల ఉన్నతాధికారుల పనితీరుపై ప్రభుత్వ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

దీంతో పాటు తెలంగాణలో కొత్త ప్రభుత్వం నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ మార్క్ అన్నది ఇప్పటివరకు కనిపించడం లేదని సీఎం రేవంత్ భావిస్తున్నారట. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే కచ్చితంగా సెక్రటేరియట్ లో ఆయా శాఖల అధిపతులను మార్చాల్సిందే అన్న ఆలోచనకు ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.

సీఎం స్పీడ్ ను అందుకోని సీఎంవో అధికారులు..
సీఎం రేవంత్ రెడ్డి దూకుడుకు చీఫ్ మినిస్టర్ కార్యాలయంలో పని చేస్తున్న అధికారులు పూర్తి స్థాయిలో సరిపోలడం లేదన్న భావనలో ఉన్నారు. సీఎం చెబితేనే కానీ ఏ పనీ జరగడం లేదని, ప్రధానమైన అంశాల్లో ఏ రిపోర్ట్ సీఎం టేబుల్ మీదకు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ సీఎంఓలో తమకు అప్పగించిన బాధ్యతను అధికారులు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసి గ్రౌండ్ లెవెల్ లో చేసి సీఎంకు రిపోర్ట్ ఇచ్చే వారు. అయితే, సీఎం రేవంత్ ఇప్పుడు అంతకుమించిన దూకుడుతో వెళ్తున్నా.. ఆ స్పీడ్ ను ఇప్పుడున్న సీఎంవో అధికారులు అందుకోవడం లేదన్నది చర్చ.

సీఎంవోలోనూ అధికారుల మార్పు..?
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలకు అనుకున్నంత గ్రౌండ్ లెవెల్ రిజల్ట్ రావాలంటే తన స్పీడ్ ను అందుకునే అధికారులు కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నికల కోడ్ తర్వాత సీఎంవోలో కూడా ఒకరిద్దరు అధికారులు మారుతారు అన్న చర్చ గట్టిగానే జరుగుతోంది.

సమర్థవంతంగా పని చేసే అధికారుల కోసం కసరత్తు..
లోక్ సభ ఎన్నికల కోడ్ ముగియగానే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలుపైనే దృష్టి పెట్టనుంది. ఈ గ్యారెంటీలు ప్రజలకు పూర్తిగా అందించే ఆలోచనలో భాగంగానే అధికారుల బదిలీలు ఉంటాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల మేరకు సమర్థవంతంగా పని చేసే అధికారుల కోసం ఇప్పటికే రేవంత్ సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.

Also Read : కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ క్షమాపణ చెప్పాలి: మంత్రి జూపల్లి కృష్ణారావు

పూర్తి వివరాలు..