కడుపులు కాలిపోతున్నాయ్:53 దేశాల్లో ఆకలి కేకలు

  • Publish Date - April 3, 2019 / 06:02 AM IST

ఆకలి..ఆకలి..ఆకలి..జానెడు కడుపు నింపుకోవటం కోసం మనిషి పడరాని పాట్లు పడుతున్నాడు. భూమి మీద పుట్టిన ప్రతీ ప్రాణీ కడుపు నింపుకునేందుకు తాపత్రాయపడుతుంది.  అంతరిక్షంలోకి దూసుకుపోతున్న మానవుడు ఆకలి కేకలు లేని సమాజాన్ని మాత్రం నిర్మించుకోలేకపోతుండటం అత్యంత విషాదం. ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లోని 11.3 కోట్ల మంది ప్రజలు ఆకలితో అల్లాడిపోతున్నారనీ..కడుపు నింపుకోని దుస్థితిలో ఉన్నారని సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి అధికారికంగా వెల్లడించింది. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంత్య విషాదకరమైన దుస్థితి. 
 

అంతర్యుద్ధాలు, వాతావరణ వైపరీత్యాల వల్ల 2018లో  11.3 కోట్ల మంది అంటే 113 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో అలమటించిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ దుస్థితి ఎక్కువగా ఆఫ్రికా దేశాల్లోనే కనిపించిందని తెలిపింది. ఆహార సంక్షోభానికి సంబంధించి 2019 నివేదికను ఐరాస మంగళవారం (ఏప్రిల్ 2)  విడుదల చేసింది. 

ప్రపంచ వ్యాప్తంగా 53 దేశాల్లో ఆకలి తీవ్రత ఉందని ఈ నివేదిక వెల్లడించింది. ఆకలి తీవ్రతను ఎదుర్కొన్న వారిలో ఎనిమిది దేశాలకు చెందిన ప్రజలు ఉన్నారని..ఈ ఎనిమిది దేశాల్లో యెమెన్, కాంగో, సిరియా, ఆఫ్ఘనిస్థాన్ దేశాలున్నాయని నివేదిక వెల్లడించింది. కేవలం ఆఫ్రికా ప్రాంతంలోనే 7.2 కోట్ల మంది ఆకలి కేకలతో అలమటించారని..సంఘర్షణలు, అభద్రత, ఆర్థికపరమైన సమస్యలు, కరవు, వరదలు వంటి పలు కారణాలే ఈ ఆకలికి ప్రధాన కారణమని ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన నివేదిక తెలిపింది. సిరియాలో అంతర్యుద్ధం, మయన్మార్‌లో అశాంతి వల్ల రోహింగ్యాలు బంగ్లాదేశ్‌కు వలస వెళ్లడం లాంటి పరిస్థితులు ఆకలి తీవ్రతకు అద్దం పడుతున్నాయని తెలిపింది.
 

ట్రెండింగ్ వార్తలు