Langya Henipa Virus In China : చైనాలో మరో కొత్త వైరస్ కలవరం..35 కేసులు నమోదు

చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వెల్లడించింది.

Langya henipa Virus In China : ప్రపంచాన్ని కరోనాను వ్యాప్తి చేసిన చైనాలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. కోవిడ్ వైరస్ తరువాత ఎన్నో రకాల వైరస్ లో ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. గతంలో ఎప్పుడు ఇన్ని వైరస్ లు మూకుమ్మడి దాడి చేసిన దాఖలాలులేవు. కానీ చైనా నుంచి వ్యాప్తి చెందిన కోవిడ్ తరువాత ఎన్నో రకాల వైరస్ లో వెలుగులోకి వస్తున్నాయి. ఓ పక్క మంకీపాక్స్‌ పంజా విసురుతోంటే పులిమీద పుట్రలాగా చైనాలో మరో కొత్త వైరస్ బయటపడింది. దాని పేరు ‘లాంగ్యా హెనిపా’వైరస్..!

చైనాలో ‘లాంగ్యా హెనిపా’ అనే కొత్త వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్‌ 35 మందికి సోకినట్లు తైవాన్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) వెల్లడించింది. దీంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని షాంగ్‌డాంగ్‌, హెనాన్‌ ప్రావిన్సుల్లో వైరస్‌ను గుర్తించగా.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు ఇది వ్యాపించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

తైవాన్‌కు చెందిన సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్ సియాంగ్ మాట్లాడుతూ వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదని పేర్కొన్నారు. దీనిపై మరింత పరిశోధనలు జరుగుతున్నాయని, అప్పటివరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పెంపుడు జంతువులపై నిర్వహించిన సెరోలాజికల్‌ సర్వేలో మేకలు, కుక్కల రక్త నమూనాలను అధికారులు సేకరించి, పరీక్షించారు. దీంతో మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం వరకు వైరస్‌ పాజిటివ్ తేలింది. 27శాతం ఎలుకల్లో వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు.

35 మందిలో లాంగ్యా హెనిపా వైరస్‌ పాజిటివ్‌..
తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఓ వ్యక్తి రక్త నమూనాలు సేకరించి..పరీక్షలు చేయగా ఈ వైరస్ వెలుగులోకి వచ్చింది. అప్రమత్తమైన అధికారులు పరీక్షలు నిర్వహించగా 35 మందిలో లాంగ్యా హెనిపా వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. కానీ వీరికి ఒకరితో మరొకరికి ఎటువంటి సన్నిహిత సంబంధాలు లేవు. వైరస్‌ ఇప్పటివరకు ఒకరి నుంచి మరొకరికి సోకిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సీడీసీ డిప్యూటీ డీజీ తెలిపారు.
వైరస్‌ లక్షణాలు..
వైరస్‌ సోకిన 26మందిలో రోగులు జ్వరం, అలసట, దగ్గు, ఆకలి లేకపోవడం, కండరాల నొప్పి, వికారం, తలనొప్పి, వాంతులు తదితర లక్షణాలున్నాయని పేర్కొన్నారు. అలాగే ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గిపోవడంతో పాటు లివర్‌, కిడ్నీలపై ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.

 

ట్రెండింగ్ వార్తలు