Russia and ukraine war: రష్యాకు మరో ఎదురు దెబ్బ.. ఐరాసలో నాలుగు కమిటీల్లో ఓటమి

ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా ప్రపంచ వేదికపై ఒంటరితనానికి మరింత దగ్గరవుతోంది. ఉక్రెయిన్ లో రష్యా సైనికులు సృష్టించి నరమేధానికి ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి...

Russia and ukraine war: ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా ప్రపంచ వేదికపై ఒంటరితనానికి మరింత దగ్గరవుతోంది. ఉక్రెయిన్ లో రష్యా సైనికులు సృష్టించి నరమేధానికి ప్రపంచ దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఇప్పటికే యూఎన్ లోని చాలా దేశాలు రష్యా పై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాలు వీటిలో ఉన్నాయి. ఈ క్రమంలో బుధవారం ఐక్యరాజ్య సమితిలో కమిటీ ఆఫ్ ఎన్జీఓస్, యూఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు, పర్మినెంట్ ఫోరమ్ ఆన్ ఇండిజీనస్ ఇస్యూస్ కమిటీలకు జరిగిన ఎన్నికల్లో రష్యా పోటీ చేసింది.

రష్యా బుధవారం పాల్గొన్న నాలుగు కమిటీల్లోనూ ఓటమి పాలైంది. తొలి మూడు కమిటీల్లో రష్యాకు 54ఓట్లకు గాను వరుసగా 15, 16, 17 ఓట్లు వచ్చాయి. చివరి కమిటీలో 52 ఓట్లకుగాను 18 ఓట్లు రష్యాకు వచ్చాయి. చివరి కమిటీ ఎన్నికలో ఉక్రెయిన్‌ 34ఓట్లతో గెలుపొందింది. ప్రపంచ దేశాలు ఉక్రెయిన్ పై రష్యా సైన్యం దాడులు చేయటాన్ని సమర్థించడం లేదనే విషయాన్ని తాజా ఫలితాలు చూపుతున్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

ఇదిలా ఉంటే ఐరాస ఆర్థిక సామాజిక మండలి నిర్వహించిన ఎన్నికల్లో కమిషన్ ఫర్ సోషల్ డెవలప్ మెంట్, కమిటీ ఆన్ ఎన్జీవోస్, కమిషన్ ఆన్ ఎస్ అండ్ టీ, కమిటీ ఫర్ ఈఎస్సీఆర్‌లో ఇండియా విజయం సాధించిందని ఐరాసలో భారత శాశ్వత రాయబారి వెల్లడించారు. చివరి కమిటీలో భారత అంబాసిడర్‌ ప్రీతీ శరన్‌ మరలా గెలుపొందారన్నారు. ఈ కమిటీలు నాలుగేళ్ల కాలపరిమితితో పనిచేస్తాయి.

ట్రెండింగ్ వార్తలు