Bayyaram Steel : బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు అన్న కేంద్రం..టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు అన్న కేంద్రంపై టీఆర్ఎస్ మండిపడుతోంది. దీంతో ఎమ్మెల్యేలు బయ్యారంలో ఉక్కు దీక్ష చేపట్టారు.

Bayyaram Steel Plant: కేంద్రం ప్రభుత్వ రంగ పరిశ్రమల్లోని వాటాలను వేగంగా విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగానే ఏపీలోని విశాఖ నగరంలో ఉన్న ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టింది. నష్టాలు వస్తున్నాయనే పేరుతో తెగనమ్మటానికి డిసైడ్ అయ్యింది. కార్మికులు ఎంతగా గగ్గోలు పెడుతున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈక్రమంలో తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని చెప్పినమాటల్ని కూడా కేంద్రం పక్కన పెట్టింది. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని స్పష్టంచేసింది. దీంతో బయ్యారం ఉక్కు పరిశ్రమపై టీఆర్ఎస్ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ‘బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు’ పేరుతో దీక్ష చేపట్టింది టీఆర్ఎస్ పార్టీ. బయ్యారం ఉక్కు పరిశ్రమపై కేంద్రం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తుందని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై భగ్గుమంటున్నారు. బయ్యారంలో ఫ్యాక్టరి ఏర్పాటు చేయాల్సిందనంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీక్ష చేపట్టారు.

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే విషయంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ అభ్యంతరం..
కాగా విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే విషయంలో కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అవసరమైతే తాను విశాఖ వెళ్లి ఉద్యమానికి అండగా ఉంటామంటూ మద్దతు ఇచ్చారు. ఇదిలా ఉంటే మరోసారి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేసిన విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్నట్టు అన్ని వనరులు ఉన్న బయ్యారంలో రూ.36 వేల కోట్ల వ్యయంతో ఒక భారీ ఉక్కు పరిశ్రమను నెలకొల్పుతామన్న లిఖితపూర్వక హామీ కేంద్రం ఇచ్చిన హామీ విషయంలో కేంద్రం చేతులు ఎత్తేసింది.

ఏడేళ్లు గడిచిన బయ్యారం ఉక్కుపై తేల్చని కేంద్రం..
తెలంగాణ ఏర్పడి..ఏడేళ్లు గడిచాయి. అయినా ఈనాటికి కేంద్రం బయ్యార ఉక్కు ఏర్పాటుపై ఒక్క అడుగూ పడకపోవడం..దీనికి తోడు ఇక ఆ సంగతి ఏమీలేదు..ఇక ఏర్పాటు లేనట్లేనని స్పష్టంచేయటంతో పలు పార్టీలు, ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. టీఆర్ఎస్ మాత్రం ఓ అడుగు ముందే ఉండి ఉద్యమం చేపట్టింది.

బయ్యారంలో 50 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో క్వాలిటీ ఇనుప ఖనిజ నిక్షేపాలు..
బయ్యారం ఉక్కు సంగతేంటంటే.. నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి మహబూబాబాద్‌ జిల్లా బయ్యారంలో సుమారు 50 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో క్వాలిటీ ఇనుప ఖనిజ నిక్షేపాలున్నట్టు గుర్తించి.. నిర్ధారించారు. బయ్యారంతో పాటు గార్ల, గూడూరు, నేలకొండపల్లిలోని పలు ప్రాంతాలలోనూ ఇనుప ఖనిజం ఉన్నట్టు నిపుణులు నిర్ధారించారు. ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న కొణిజేటి రోశయ్య హయాంలో ఒక సంస్థకు ఇనుప ఖనిజాన్ని తవ్వి తీసే కాంట్రాక్టు అప్పగించడం.. పలు పార్టీలు ఉద్యమించడంతో సదరు జీవోను ఉపసంహరించుకోవడం తెలిసిందే. స్థానికంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న ఇనుప ఖనిజ నిక్షేపాలపై కూలంకషంగా స్టడీ చేసిన ఎన్‌ఎండీసీ బృందాలు ఒక సవివర నివేదికను కేంద్రానికి సమర్పించాయి. బయ్యారంలో ఉన్న నిల్వలు దేశంలోని నిల్వలతో పోల్చితే 11 శాతం మొత్తం ఇక్కడే ఉన్నాయని..ముడి ఖనిజంలో లభ్యమయ్యే ఉక్కు నాణ్యతలోనూ అరవై శాతంగా ఉందని తేల్చారు.

25 ఏళ్ల పాటు ఏలోటూ రానంత నిల్వలు ఒక్క బయ్యారంలోనే ఉన్నాయని చెప్పిన నిపుణులు..
దీంతో బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్రం తెలిపింది. దీంట్లో భాగంగా..ఏటా నాలుగు లక్షల మెట్రిక్‌ టన్నుల ఖనిజాన్ని తవ్వి తీయగలిగినా కనీసం పాతికేళ్ల పాటు ఏలోటూ రానంత నిల్వలు ఒక్క బయ్యారంలోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంచేశారు. బయ్యారంతో పాటు నేలకొండపల్లి, కారేపల్లి, భీమదేవరపల్లి, ములుగు, గూడూరు, గార్ల మండలాల్లోని అన్ని ప్రాంతాలతో కలిపితే సుమారు వంద కోట్ల టన్నుల మేర ఇనుప ఖనిజం ఉన్నట్టు కూడా గుర్తించారు నిపుణులు.

జీవనది గోదావరి..పక్కనే రైలు మార్గం ప్రధాన సౌకర్యం..
మిగిలిన వనరులూ దగ్గరే.. ఉక్కు పరిశ్రమ నెలకొల్పడానికి కావాల్సిన ఇనుప ఖనిజం స్థానికంగానే లభ్యం కావడం.. దీంతోపాటుగా ఉప ఖనిజాలైన డోలమైట్‌, బైరేటిస్‌, బొగ్గు లభ్యత కూడా దగ్గరలోనే ఉండడంతో ఇంకా ఫ్యాక్టరీ ఏర్పాటుకు నమ్మకం కుదిరింది. దీనికితోడు పాల్వంచ కేటీపీఎస్ లో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఉండడం, దగ్గరలోనే గోదావరి జీవనది ఉండడం.. రైలు మార్గం కూడా పక్కనుంచే ఉండడం మరో ప్రత్యేకత. దీనికితోడు వెనుకబాటుకు గురైన బయ్యారం ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటైతే అటు అభివృద్ధి, ఇటు ఉపాధి రంగం ఊపందుకుని సంక్షేమం కూడా మెరుగవుతుందన్న ఆశలు నెలకొన్నాయి. దీంతోనే విభజన చట్టంలో నాటి యూపీఏ ప్రభుత్వం బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయాన్ని ప్రస్తావించడంతో ఇక్కడి స్థానిక యువతలోనూ, ఇక్కడ గిరిజనుల్లోనూ ఆశలు చిగురించాయి.
కానీ ఏడేళ్లకు కేంద్రం బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసేది లేదని చెప్పటంతో తెలంగాణ ప్రభుత్వం భగ్గుమంది. బయ్యారం ఉక్కు..తెలంగాణ హక్కు అంటూ నినదిస్తోంది.

కేంద్రం తీరుతో మండి పడ్డ మంత్రి కేటీఆర్
బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై విభజన చట్టంలో ఇచ్చిన హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని..నాణ్యమైన ఇనుప ఖనిజ సంపద అందుబాటులో ఉన్నప్పటికీ కేంద్రం దాన్ని వినియోగించటంలో విఫలమైందని విరుచుకుపడ్డారు.తెలంగాణ నుంచి ఎన్నికైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర హక్కులు సాధించాల్సింది పోయి చిక్కులున్నాయంటూ ఉక్కు కర్మాగారంపై చేతులేత్తేయడం సిగ్గుచేటంటూ మండిపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు