Pavan Kumar Rai: ఎవరీ పవన్ కుమార్ రాయ్? భారత్-కెనడా మధ్య ఇంతటి వివాదం వెనుక..

పవన్ కుమార్ రాయ్ గతంలో ఏయే విధులు నిర్వర్తించారు? ఆయనను కెనడా ఎందుకు బహిష్కరించింది? వంటి విషయాలు తెలుసుకుందాం.

Pavan Kumar Rai

Pavan Kumar Rai – Canada: కెనడాలోని భారత రాయబార కార్యాలయం నుంచి తాజాగా సీనియర్‌ అధికారి పవన్‌ కుమార్‌ రాయ్‌ను బహిష్కరించడంతో ఇరు దేశాల మధ్య వివాదం రాజుకుంటోంది. ఆ దేశంలో రా (భారత గూఢచార సంస్థ) విభాగ అధిపతిగా పవన్ కుమార్ రాయ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఖలిస్థానీ ఉగ్రవాది, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ (KTF) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్యలో పవన్‌ కుమార్‌ రాయ్‌ జోక్యం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అన్నారు. పవన్‌ కుమార్‌ రాయ్‌ను కెనడా బహిష్కరించడంతో భారత్ కూడా అందుకు తగ్గట్లుగానే చర్యలు తీసుకుంది. భారత్ లోని కెనడా రాయబార కార్యాలయం నుంచి కెనడా గూఢచార సంస్థ విభాగ అధిపతి ఒలివర్‌ సిల్వస్టర్‌ ను బహిష్కరించింది.

పంజాబ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి

అసలు ఈ పవన్‌ కుమార్‌ రాయ్‌ ఎవరు? ఆయన గతంలో ఏయే విధులు నిర్వర్తించారు? వంటి విషయాలు తెలుసుకుందాం. పవన్ కుమార్ రాయ్ పంజాబ్ క్యాడర్, 1997 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి. 2010, జులై 1 నుంచి సెంట్రల్ డిప్యూటేషన్‌పై ఉన్నారు. కెనడాలో ఇండియన్ ఇంటెలిజన్స్ చీఫ్‌గా కొనసాగుతున్నారు. 2018 డిసెంబరులో విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమితుడయ్యారు. అలాగే, కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ గానూ పనిచేశారు.

సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లకముందు?
పవన్‌ కుమార్‌ రాయ్‌ సెంట్రల్ డిప్యూటేషన్‌పై వెళ్లకముందు పంజాబ్‌లో విధులు నిర్వర్తించారు. అమృత్‌సర్‌లో సీఐడీ ఎస్పీగా పనిచేశారు. 2008 జులైలో జలంధర్‌లో అదే శాఖలో సీనియర్ ఎస్పీగా ఆయన పదోన్నతి పొందారు.

మరి భారత్‌-కెనడా మధ్య వాణిజ్యం?
భారత్-కెనడా మధ్య వివాదం రాజుకోవడంతో సత్సంబంధాలు దెబ్బతింటాయని ఓ వైపు వాదనలు వినపడుతుండగా, మరోవైపు ఈ ప్రభావం వాణిజ్యంపై పడదని కొంందరు నిపుణులు అంటున్నారు. గత ఆర్థిక ఏడాది భారత్-కెనడా మధ్య వాణిజ్యం దాదాపు 816 కోట్ల డాలర్లకు పెరిగిందిద. భారత్ నుంచి కెనడాలు ప్రధానంగా వజ్రాలు, ఔషధాలు, ఆభరణాలు, వస్త్రాలు, పలు యంత్రాలు ఎగుమతి అవుతాయి. కెనడా నుంచి భారత్‌కు ప్రధానంగా కలప, కాగితం, పప్పులు వంటివి దిగుమతి అవుతాయి. అలాగే, కెనడాలో చదువుకునే భారతీయ విద్యార్థులు అధికం.
USA : అమెరికా చికాగోలో దారుణం.. తల్లీదండ్రులు, ఇద్దరు పిల్లలతోపాటు మూడు కుక్కలను కాల్చి చంపారు

ట్రెండింగ్ వార్తలు