TS High Court : తెలంగాణ హైకోర్టుకు 10మంది కొత్త న్యాయమూర్తులు..నలుగురు మహిళలకు స్థానం

తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 10మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

New Judges appointed for telangana high court : గతంలో కోర్టులకు న్యాయమూర్తుల కొరత తీవ్రంగా ఉండేది. దీంతో కేసుల విచారణలు పెండింగ్ లో ఉండేవి.కానీ ఇప్పుడలా కాదు. హైకోర్టులకు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతున్నాయి. ఈ 10మంది జడ్జిల నియామకాల్లో నలుగురు మహిళలు కూడా ఉండటం విశేషం. దీంట్లో భాగంగా..తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 10మంది న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం న్యాయవాదుల కేటగిరీ నుంచి 7గురు, న్యాయాధికారుల కేటగిరీ నుంచి ఐదుగురు కలిపి మొత్తం 12 మంది పేర్లు సిఫార్సు చేయగా, వారిలో 10 మంది నియామకాలకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు.

Also read : Delhi Security: దేశ రాజధానికి ఉగ్రముప్పు: భద్రతా దళాలను హెచ్చరించిన యూపీ పోలీస్

వీరిలో న్యాయవాదుల విభాగం నుంచి కాసోజు సురేందర్‌, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్‌కుమార్‌, జువ్వాడి శ్రీదేవి, ఎన్‌.శ్రావణ్‌ కుమార్‌ వెంకట్‌ ఉన్నారు. న్యాయాధికారుల విభాగం నుంచి గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, దేవరాజ్‌ నాగార్జున్‌లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 217(1)కింద దఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి వీరి నియామకాలకు ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలో వారి సీనియారిటీ వర్తిస్తుందని, బాధ్యతలు చేపట్టిన నాటినుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ 10మంది న్యాయమూర్తులు గురువారం (మార్చి 14,2022)ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ వీరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు. వీరి నియామకంతో మొత్తం సంఖ్య 29కి చేరుతుంది. హైకోర్టులో ఒకేసారి పదిమంది న్యాయమూర్తులను నియమించడం ఇదే మొదటిసారి.

Also read : Fire Accident: బోయిగూడలో భారీ అగ్ని ప్రమాదం, 11 మంది సజీవ దహనం

న్యాయవాదుల కోటానుంచి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన చాడ విజయభాస్కర్‌ రెడ్డి, మీర్జా సైఫుల్లా బేగ్‌ల పేర్లు తాజా నియామక ఉత్తర్వుల్లో కనిపించలేదు. ఇప్పుడు నియమితులైన వారిలో మహిళలు నలుగురు ఉన్నారు. దీంతో ఈ హైకోర్టులో మొత్తం మహిళా న్యాయమూర్తుల సంఖ్య 10కి చేరనుంది. మొత్తం న్యాయమూర్తుల్లో మహిళల శాతం 34.48%కి పెరుగుతుంది.

కాగా..న్యాయమూర్తుల సంఖ్య భారీగా పెరగటంతో పెండింగ్ లో ఉన్న కేసుల విచారణ త్వరితగతిన జరుగనుంది. ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకం తరువాత పలు కోర్టులో న్యాయమూర్తుల భర్తీ జరుగుతోంది. గతంలో న్యాయమూర్తుల కొరతగా ఉందని పలువురు న్యాయమూర్తులు సమావేశాల్లోవాపోయిన సందర్భాలున్నాయి.

 

ట్రెండింగ్ వార్తలు