MGM Hospital : వరంగల్ ఎంజీఎంలో దారుణం.. పేషెంట్‌‌పై ఎలుకల దాడి.. తీవ్ర రక్తస్రావం..!

MGM Hospital : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన ఓ పేషెంట్‌ను ఎలుకలు గాయపరిచాయి.

MGM Hospital : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో వైద్యం కోసం వెళ్లిన ఓ పేషెంట్‌ను ఎలుకలు గాయపరిచాయి. ఆర్ఐసీయూలో అపస్మారక స్థితిలో ఉన్న బాధితుడి కాలు, చేతి వేళ్లను ఎలుకలు కొరికేశాయి. ఎలుకల దాడిలో అతడికి తీవ్ర రక్తస్రావమైంది. శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు రోజుల క్రితమే ఎంజీఎంలో అడ్మిట్ అయ్యాడు. తొలిరోజునే అతడి కుడిచేయి వేళ్లను ఎలుకలు కొరికాయి. హన్మకొండ జిల్లా భీమారానికి చెందిన శ్రీనివాస్‌ ఊపిరితిత్తులు, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. గత కొన్ని రోజులుగా ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌కు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. దాంతో అతన్ని వెంటనే వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడే నాలుగు రోజుల నుంచి చికిత్స పొందుతున్నాడు.

డయాలిసస్ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన నాటి నుంచే శ్రీనివాస్‌పై ఎలుకలు దాడి చేస్తున్నాయి. అతడి రెండు చేతులు, రెండు కాళ్లను ఎలుకలు తీవ్రంగా గాయపరిచాయి. గతంలోనూ ఇదే పరిస్థితి తలెత్తిందని ఇతర పేషెంట్లు ఫిర్యాదు చేస్తున్నారు. అదే వార్డులో చాలామంది పేషెంట్లు ఎలుక దాడికి గురయ్యారని వాపోతున్నారు.

పేషెంట్లపై ఎలుకల దాడికి సంబంధించి ఎంజీఎం సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. ఎలుకల దాడిలో తీవ్ర గాయాలపాలైన శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. బాధితుడి కుటుంబం ఎంజీఎం వద్ద ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఎలుకల బెడదపై ఆస్పత్రి ఆర్‌ఎంవో మురళి దృష్టికి తీసుకెళ్లారు. ఆస్పత్రి సిబ్బందితో ఆయన ఐసీయూకి వచ్చి పరిశీలించారు. ఎలుకల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు.

Read Also : Srisailam Clash : శ్రీశైలం ఘర్షణలో కోటి రూపాయలకుపైగా ఆస్తి నష్టం

ట్రెండింగ్ వార్తలు