Bandi Sanjay: పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బండి సంజయ్.. కేంద్రం దృష్టికి వ్యవహారం..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన జన జాగరణ దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Bandi Sanjay Arrest : ఉద్యోగులు, ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవోను వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తలపెట్టిన జన జాగరణ దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేశారు. అనంతరం పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి మానకొండూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడే బండి సంజయ్ జాగరణ దీక్షను కొనసాగించారు.

దాంతో.. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఆయన్ను చూసేందుకు వెళ్తున్నవారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మానకొండూరు పోలీస్ స్టేషన్ నుంచి కరీంగనర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మీదుగా బండి సంజయ్ ను పోలీసులు తరలించినట్టు సమాచారం. సంజయ్‌ను రిమాండ్‌కు పంపే అవకాశం కనిపిస్తోంది.

బండి సంజయ్ అరెస్ట్‌ను రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వ్యవహారశైలిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ నేతలు. ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారం అంతా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, రాష్ట్ర ఇంచార్జ్  తరుణ్ చుగ్‌కు పార్టీ రాష్ట్ర నేతలు వివరించారు. బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సరిగా లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని కేంద్రానికి, జాతీయ నాయకత్వానికి నివేదించినట్టు కొల్లి మాధవి తెలిపారు.

కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. కరీంనగర్‌లో బండి సంజయ్ దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి తరలించారు. తన కార్యాలయానికి తాళాలు వేసుకుని బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. పోలీసులు గ్యాస్ కట్టర్ సాయంతో తాళాలు పగులగొట్టి లోనికి వెళ్లి సంజయ్‌ను అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బీజేపీ కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

Read Also : Bandi Sanjay Arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు