Cm Revanth Reddy : కేసీఆర్ కుట్ర చేసి నన్ను ఓడించారు- సీఎం రేవంత్ రెడ్డి

ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది.

Cm Revanth Reddy : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుట్ర చేసి నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి 2018లో కొడంగల్ లో నన్ను ఓడించారు అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కొడంగల్ లో ఓడించినా మల్కాజ్ గిరి ఎంపీగా నిలబడితే కూకట్ పల్లి బిడ్డలు నాకు అండగా నిలబడి గెలిపించారని చెప్పారు. మల్కాజ్ గిరి ప్రజలు గెలిపించారు కాబట్టే సోనియా గాంధీ పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారని తెలిపారు. కూకట్ పల్లిలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”అసెంబ్లీ ఎన్నికల్లో 4 కోట్ల ప్రజలు కేసీఆర్ ను బంగాళాఖాతంలో కలిసి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. 36 కులాలను బీసీల్లో చేర్చే బాధ్యత నాది. ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. మోదీ, కేడీ కలిసి 1200 రూపాయలకు సిలిండర్ రేటు పెంచితే కాంగ్రెస్ ప్రభుత్వం 500 లకే ఇస్తోంది. మీ ఇంటికి తాగునీరు ఉచితంగా ఇవ్వాలంటే, సమస్యలు తీరాలంటే సునీతా మహేందర్ రెడ్డిని గెలిపించాలి.
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చిన వారి సమస్యలను పరిష్కరిస్తాం.

కేసీఆర్, మోదీ పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలను పట్టించుకోలేదు. ప్రధాని మోదీ తెలంగాణకు మెట్రో కొత్త లైన్ ఇవ్వలేదు. మూసీ ప్రక్షాళనకు కూడా నిధులు ఇవ్వలేదు. ఢిల్లీ నుంచి మోడీ తెలంగాణకు గాడిద గుడ్డు తెచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చింది. ఉచిత ప్రయాణం ఇచ్చిన కాంగ్రెస్ కు ఓటేస్తారా? గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీకి ఓటేస్తారా..? సునీతా మహేందర్ రెడ్డిని ఎంపీగా పంపిస్తే మీ సమస్యలను పరిష్కరిస్తాను. సునీతా మహేందర్ రెడ్డికి వేసే ప్రతి ఓటు రేవంత్ రెడ్డికి వేసినట్లు. బీజేపీకి పడే ఓటు గాడిద గుడ్డుకు వేసే ఓటు. ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే కూకట్ పల్లికి న్యాయం జరిగేది. మల్కాజ్ గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డికి లక్ష ఓట్ల మెజార్టీ ఇవ్వాలి” అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

Also Read : కేసీఆర్‌కు ఈసీ బిగ్ షాక్.. ఎన్నికల ప్రచారంపై నిషేధం

ట్రెండింగ్ వార్తలు