KTR: ఆ ముగ్గురు.. మంత్రుల బినామీలు, భూదాన్ భూములపై కన్నేశారు- కేటీఆర్ సంచలన ఆరోపణలు
- రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది
- కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసం, వినాశనమే
- ఖమ్మంలో భూదాన్ భూములను హస్తగతం చేసుకునేందుకు మంత్రుల బినామీలు డ్రామా
- ఆ ముగ్గురు ల్యాండ్ మాఫియాను నడుపుతున్నారు
- మా ప్రభుత్వం వచ్చాక వారిని వదిలేది లేదు
KTR: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాజేంద్రనగర్ మానస హిల్స్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లీగల్ గా క్రషర్ నడుపుతున్నారని ఆరోపించారు. ఖమ్మం వెలుగుమట్ల బాధితులు రోడ్లపైకి వస్తే పెయిడ్ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భూ మాఫియాదారులను వదిలేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. సురేష్, కిషోర్, దామోదర్ రావులు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల బినామీలు అని ఆరోపించారు. వారి కోసమే వెలుగుమట్ల భూదాన్ భూములపై కన్నేశారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలపై దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సర్కార్ నడుపుతున్నారా సర్కస్ నడుపుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ పిచ్చి తుగ్లక్ అని విమర్శించారు. వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలతో పాటుగా నష్టపరిహారం చెల్లించాలని రేవంత్ సర్కార్ ను డిమాండ్ చేశారు కేటీఆర్. వారికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని తేల్చి చెప్పారు.
”రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విధ్వంసం, వినాశనమే. ఖమ్మంలో భూదాన్ భూములను హస్తగతం చేసుకునేందుకు ముగ్గురు మంత్రుల బినామీలు సురేశ్, కిశోర్, దామోదర్ డ్రామా చేశారు. ఆ ముగ్గురు ల్యాండ్ మాఫియాను నడుపుతున్నారు. 3వేల మంది పోలీసులు వెళ్లి వెలుగుమట్లలో ఇళ్లను కూల్చేశారు. పట్టాలున్న వారి ఇళ్లు ఎలా కూల్చుతారు?. ఇళ్లను కూల్చేసి మళ్లీ తక్కువ ఇళ్లను కేటాయిస్తారా? సర్కార్ ను నడుపుతున్నారా? సర్కస్ నడుపుతున్నారా? ఆందోళన చేస్తున్న పేదలను పెయిడ్ ఆర్టిస్టులు అంటారా? వెలుగుమట్ల బాధితులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే తొలగించాలి. వెలుగుమట్ల నిర్వాసితులందరికీ ఇళ్లు కట్టించి కాంగ్రెస్ నేతలు మాట్లాడాలి. మా ప్రభుత్వం వచ్చాక భూదాన్ భూముల వ్యవహారంపై విచారణ చేపిస్తాం. భూదాన్ భూములను తమ పేర్లపై మార్చుకున్న ప్రైవేట్ వ్యక్తులను వదిలిపెట్టం” అని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
Also Read: భూదాన్ బాధితులకు భారీ ఊరట.. కూల్చిన చోటే వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
