Indian Navy ‘INS Mormugao’ : భారత రక్షణ రంగం అంతకంతకు బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటోంది. భారీ అస్త్రశస్త్రాలతో శతృదేశాలకు సవాల్ విసురుతోంది. రక్షణరంగంపై భారీగా ఖర్చు చేస్తున్న భారత్ త్రివిధ దళాల్లోనూ అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. దీంట్లో భాగంగా తాజాగా అగ్ని-5 క్షిపణి సరిహద్దుల్లో తోక జాడిస్తున్న డ్రాగన్ దేశానికి సవాల్ విసురుతోంది. ఈక్రమంలోనే భారత నావికాదళంలోకి మరో భారీ విధ్వంసక నౌక వచ్చి చేరింది. అదే ద గ్రేట్ ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’(INS Mormugao). ఈ యుద్ద నౌక నావికా దళంలోకి చేరటంతో భారత నావికారంగం మరింత బలోపేతమైంది.
స్వదేశీయంగా నిర్మించిన స్టెల్త్ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ‘ఐఎన్ఎస్ మోర్ముగావో’ ఆదివారం (డిసెంబర్ 18,2022) నౌకాదళంలో అడుగుపెట్టింది. ‘విశాఖపట్టణం’ క్లాస్ డిస్ట్రాయర్లో రెండవదైన ఈ భారీ నౌకను ఆదివారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ..స్వదేశీ రక్షణ ఉత్పత్తి సామర్థ్యానికి అత్యాధునిక యుద్ధనౌక INS మోర్ముగో ఒక ప్రధాన ఉదాహరణ అని అన్నారు. ఈ నౌక భారతదేశం స్థానికంగా కాకుండా ప్రపంచ నౌకా నిర్మాణ అవసరాలను తీర్చగలదని ధీమా వ్యక్తంచేశారు.
నేవీకి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ చేసిన ఈ నౌక (INS Mormugao) నాలుగు శక్తిమంతమైన గ్యాస్ టర్బైన్లతో నడిచే ఈ నౌక గంటకు 30 నాట్ల (55 కిలోమీటర్లు)కు పైగా వేగంతో ప్రయాణించగలదు. మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. ఈ నౌకలో వినియోగించిన పరికరాలు..టెక్నాలజీ మూడు వంతులు స్వదేశీయంగా తయారైనవే కావటం విశేషం. ధునాతన సెన్సార్లు, ఆయుధాలు కలిగి ఉన్న ఈ నౌకకు నిఘా రాడార్ వ్యవస్థ కూడా ఉంది. సముద్రం ఉపరితలం నుంచి గగన లక్ష్యాలపై క్షిపణులను సంధించగల శక్తి ఈ నౌక సొంతం. అంతేకాదు అణు, జీవ రసాయన యుద్ధ పరిస్థితుల్లో కూడా పోరాడగలిగేలా ఈ ‘ఐఎన్ఎస్ మోర్ముగావో (INS Mormugao)ను తీర్చి దిద్దారు.
Indian Navy ‘INS Mormugao’