Mandula Samuel: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్.. కీలక నేత రాజీనామా.. ఎందుకంటే?

బీఆర్ఎస్ లో మాదిగలకు తగిన గుర్తింపు లేదని చెప్పుకొచ్చారు. పార్టీలో మాదిగలకు అవమానం జరుగుతోందని అన్నారు.

Mandula Samuel

Mandula Samuel – BRS : సూర్యాపేట(Suryapet) జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, పదవికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మందుల శామ్యూల్ రాజీనామా చేశారు. గతంలో ఆయన తుంగతుర్తి (Thungathurthy) నియోజకవర్గ ఇన్‌చార్జ్ గా.. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా పని చేశారు.

గురువారం తుంగతుర్తి ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గాదరి కిశోర్ (Gadari Kishore)కు మరోసారి ఓటు వేయాలని కోరారు. కిశోర్ కు సీటు ఖాయమైందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో శామ్యూల్ వర్గం అసంతృప్తితో ఉంది.

ఇవాళ శామ్యూల్ మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ లో మాదిగలకు తగిన గుర్తింపు లేదని చెప్పుకొచ్చారు. పార్టీలో మాదిగలకు అవమానం జరుగుతోందని అన్నారు. మాదిగలు లేని కేబినెట్ తెలంగాణలోనే ఉందని చెప్పారు. ఎవరి కోసం తెలంగాణ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంత మందికి దళిత బంధు ఇచ్చారని శామ్యూల్ నిలదీశారు. ఈ ప్రభుత్వ పాలనలో మాదిగల ఆత్మగౌరవం దెబ్బతింటోందని చెప్పారు. తెలంగాణను సాధించుకున్నప్పటికీ మాదిగల జీవితంలో మార్పులేదని అన్నారు. ప్రగతి భవన్ లో అడుగుపెట్టే అవకాశం తమకు ఉండడం లేదని అన్నారు. మాదిగల సమస్యలు చెప్పుకునే అవకాశం లేదని తెలిపారు.

ఎన్ రెడ్డి త్యాగ ఫలితమే ఇక్కడి ప్రాంతానికి గోదావరి నీళ్లని చెప్పారు. గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా తాను కట్టిన గిడ్డంగులను తనను పిలవకుండా ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేగాక, మంత్రి కేటీఆర్ సభకూ పిలుపు లేదని అన్నారు. మాదిగల మెజారిటీ ఉన్న ప్రాంతాల్లోనూ మాదిగలకు గుర్తింపు లేదని చెప్పారు.

దళిత బంధులో అన్ని అక్రమాలు ఆని కేసీఆరే చెప్పారని అన్నారు. ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని, తనను ఆశీర్వదించాలని కోరారు. ఆత్మగౌరవం కోసం మాదిగలు పోరాడాలని పిలుపునిచ్చారు. కొన్ని రోజుల్లో తన భవిష్యత్తుకు సంబంధించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కచ్చితంగా తుంగతుర్తి అసెంబ్లీ బరిలో ఉంటానని, ఏ పార్టీ నుంచి అనేది త్వరలో చెబుతానని తెలిపారు.

CM Biren Singh: ముఖ్యమంత్రి పదవికి రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన మణిపూర్ సీఎం బిరేన్ సింగ్

ట్రెండింగ్ వార్తలు