Gold and silver Price: ఇప్పుడు బంగారం కొని పెట్టుకుంటే లాభమా? నష్టమా?

మూడు నెలల వరకు బంగారం ధర ఇలానే ఉంటుందని.. కొన్నిసార్లు ఇప్పుడున్న రేటు..

బంగారం.. ఆడవాళ్లు అయినా, మగవాళ్లు అయినా ఇష్టపడని వాళ్లు ఉండరు. గోల్డ్.. అలంకరణకు ఉపయోగపడే వస్తువే కాదు.. సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌ కూడా. గోల్డ్‌ కొనడంలో సంప్రదాయం, సామాజిక అవసరాల కోణం ఉన్నా.. ఫైనల్‌గా బంగారంపై పెట్టే ప్రతీ రూపాయి పెట్టుబడిగానే భావిస్తుంటారు పబ్లిక్.

కొన్నాళ్లుగా రేపన్నదే లేదన్నట్లుగా రికార్డుస్థాయికి పెరిగిన బంగారం ధర.. కేంద్రం నిర్ణయంతో ఒక్కసారిగా తగ్గిపోయింది. 75వేల మార్క్ క్రాస్ అయిన 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్లు.. కస్టమ్స్‌ డ్యూటీ తగ్గింపుతో 69 వేలకు దిగి వచ్చాయి. ఇది ఇంకా తగ్గి.. 65 వేల వరకు కూడా రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే 4 వేల వరకు తగ్గింది బంగారం ధర. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ గోల్డ్ రేటు తక్కువగానే ఉంది. ఔన్స్‌ బంగారం ధర 1.2 శాతం తగ్గి 2వేల 369 డాలర్లకు చేరుకుంది. ఫ్యూచర్‌లో మరింత తగ్గి ఔన్స్ గోల్డ్ రేటు 2వేల 365 డాలర్లకు కూడా తగ్గొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

బంగారానికి డిమాండ్‌ తగ్గిందా?
కేంద్రం కస్టమ్స్‌ డ్యూటీ తగ్గించడం వల్లే కాదు.. అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్‌ తగ్గిందన్న ప్రచారం ఉంది. అటు ఇంటర్నేషనల్ మార్కెట్ ధరలు.. ఇటు కస్టమ్‌ డ్యూటీ దిగిరావడంతో.. ఒక్కసారిగా పసిడి ధరలు పడిపోయాయి. అయితే ఈ రేట్లు ఎన్నాళ్లు కొనసాగుతాయి.. భవిష్యత్‌లో గోల్డ్ రేట్లు ఎలా ఉంటాయనే దానిపై రకాల రకాల చర్చలు జరుగుతున్నాయి.

స్టాక్ట్ మార్కెట్లు ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఏ చిన్న న్యూస్‌ అయినా షేర్ వ్యాల్యూను తగ్గించొచ్చు. రియల్ ఎస్టేట్‌లో కూడా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. గోల్డ్ రేట్లు పెరగడమే కానీ.. తగ్గిన దాఖలాలు లేవు. అనుకోకుండా, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేంద్రం కస్టమ్స్ డ్యూటీ తగ్గించడంతో పాటు, గోల్డ్‌కు డిమాండ్‌ కాస్త తగ్గడంతో బంగారం ధరలు 70వేల లోపునకు దిగి వచ్చాయి. దీంతో ఇప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్‌మెంట్‌ సేఫేనా? కాదా? అన్న చర్చ మొదలైంది.

అయితే చాలామంది భవిష్యత్‌ కోసం డబ్బు దాచుకోవాలి అనుకునేవారు గోల్డ్‌నే ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. జనం కోరుకున్నట్లుగా 70వేల లోపునకు గోల్డ్ రేట్లు తగ్గడంతో పాటు మరికొన్ని రోజుల్లోనే 65వేలకు చేరుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. దీంతో బంగారాన్ని కొని పెట్టుకునేందుకే ఇదే సరైన సమయమని అనుకుంటున్నారు పబ్లిక్.

సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌
ఏ మాత్రం డబ్బులు ఉన్నా ఇప్పుడు చాలామంది పసిడి మీదే ఇన్వెస్ట్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. మన దగ్గరున్న బంగారమే ఆస్తి అవుతుందన్న నమ్మకం ఉండటంతో.. గోల్డ్‌నే సేఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే అందరి దగ్గర లక్షల రూపాయలు ఉండకపోచ్చు. గోల్డ్ కొనాలంటే గ్రాము కూడా కొనొచ్చు.

మూడు నాలుగు వేల రూపాయలతో గోల్డ్ కొని పెట్టుకోవచ్చు. అయితే పేద, మధ్య తరగతి జనం బంగారం కొనేటప్పుడు చూసేది ధర ఒక్కటే. గతంలో ఉన్న రేటు ఎంత.. భవిష్యత్తులో తగ్గుతుందా, పెరుగుతుందా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా జనాల్లో ఇదే డౌట్ ఉంది. ఇప్పుడు గోల్డ్‌ కొంటే లాభమా.. నష్టమా.? భవిష్యత్‌లో బంగారం రేటు 80వేలు దాటే అవకాశం ఉందా.? మరో రెండుమూడేళ్లైతే 10 గ్రాముల 24క్యారెట్ల గోల్డ్‌ లక్ష రూపాయలు దాటొచ్చన్న అంచనాలు నిజమేనా అన్నదానిపై జనాలు అయోమయంలో ఉన్నారు.

గోల్డ్ ఇప్పుడు కొని పెట్టుకుంటే బెటర్ అంటున్నారు గోల్డ్ మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌. మూడు నెలల వరకు బంగారం ధర ఇలానే ఉంటుందని.. కొన్నిసార్లు ఇప్పుడున్న రేటు కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. 3 నెలల తర్వాత మాత్రం మళ్లీ పాత రేటు కంటే పెరిగే అవకాశం ఉందని..గోల్డ్‌ మీద ఇన్వెస్ట్ చేయడం బెటరే అంటున్నారు.

శ్రావణ మాసం వచ్చేసింది. పెండ్లీల ముహూర్తాలు ముందున్నాయి. ఈ ఏడాది చివరికి బంగారం మార్కెట్‌ మళ్లీ స్పీడందుకునే అవకాశం ఉంది. అదే జరిగితే గోల్డ్ రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అందుకే బంగారం కొని పెట్టుకోవడానికి ఇదే సరైన సమయమని జనం అనుకోవడమే కాదు.. మార్కెట్ ఎక్స్‌పర్ట్స్‌ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.

Also Read: శాంసంగ్ గెలాక్సీ A06 ఫోన్ వచ్చేస్తోంది.. డిజైన్, కీలక స్పెసిఫికేషన్‌లు లీక్..!

ట్రెండింగ్ వార్తలు