ఆయన సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు- సీఎం రేవంత్ రెడ్డి

రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది.

Cm Revanth Reddy : కల్వకుర్తిలో జైపాల్ రెడ్డి సంస్మరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు పార్లమెంట్ తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జైపాల్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారని ప్రశంసించారు. నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయన రాజకీయాలు చేశారని కితాబిచ్చారు. పదవులకే గౌరవం తెచ్చేలా జైపాల్ రెడ్డి వ్యవహరించారని కొనియాడారు.

”రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి. నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది. జైపాల్ రెడ్డి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు. కానీ ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాలేదు. కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు. కాంగ్రెస్ మాట ఇస్తే చేసి తీరుతుంది.

కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం. ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నాం. మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10 కోట్లు. నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు. కల్వకుర్తి- హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్లు అభివృద్ధి చేస్తాం. నేను చదువుకున్న కాండ్ర పాఠశాల రూ.5 కోట్లతో అభివృద్ధి చేస్తాం. ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1 న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. 50 ఎకరాల్లో రూ.100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు.. నేను నల్లమల బిడ్డనే.. మీ సోదరుడినే.

ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని సవాల్ చేశాం. ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశాం. జూలై 31 లోగా లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసి తీరతాం. ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేసి తీరుతాం. బీఆర్ఎస్ నేతల్లో అధికారం కోల్పోయిన బాధ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతిపక్షం తన బాధ్యత సరిగ్గా నిర్వహించి ఉంటే కనీసం పంచాయతీ ఎన్నికల్లోనైనా గెలిచేది. కానీ పంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు వారికి అవకాశం ఇవ్వరు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సమాయత్తం కండి. కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించే బాధ్యత నాయకులుగా మేం తీసుకుంటాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : వనపర్తి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోందో తెలుసా?

 

ట్రెండింగ్ వార్తలు