Hyderabad Rain : హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్.. ఆ జోన్‌ల పరిధిలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు

కూకట్ పల్లి జోన్ పరిధిలోసైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో మూడు నుంచి ఐదు సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఐదు నుంచి 10 సెంటీ మీటర్లు వర్షం కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Hyderabad Rain : తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర రాజధాని భాగ్యనగరంలోనూ వర్షం దంచికొడుతోంది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో నగరంలోని రహదారులన్నీ జలమయంగా మారాయి. నగరంలో మరో రెండుమూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా బుధవారం నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

Telangana Rain Alert : తెలంగాణకు రెడ్ అలర్ట్.. రెండు రోజులపాటు ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు..

నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీవర్షం కురిసింది. ఆసిఫ్‌నగర్‌లో 43.5మి.మీ, టౌలిచౌకిలో 19.8 మి.మీ వర్షం పడినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక అభివృద్ధి సొసైటీ (టీఎస్‌డీపీఎస్) వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో 10 మి.మీ లోపు వర్షపాతం నమోదైంది. బుధవారం చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ , శేరిలింగంపల్లి జోన్ ల పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కూకట్ పల్లి జోన్ పరిధిలోసైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. గంటలో మూడు నుంచి ఐదు సెంటీ మీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని, కొన్నిసార్లు ఐదు నుంచి 10 సెంటీ మీటర్లు వర్షం కూడా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 10 నుంచి 14 కిలో మీటర్ల వేగంతో గాలులుసైతం వీస్తాయని, ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.

Rain Alert : మళ్లీ కుమ్ముడే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

గురువారం పలు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడవచ్చునని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఐదు జోన్ల పరిధిలో గురువారం ఎల్లో అలర్ట్ ను వాతావరణ శాఖ జారీచేసింది. నగరంలో భారీ వర్షం సూచనలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. భారీ వర్షాల వల్ల వాహనదారులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగానే కాక నగరంలోని ప్రభుత్వ, ప్రైయివేట్ పాఠశాలలకు రెండు రోజులు పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. భారీ వర్షం సూచనతో పలు ఐటీ కంపెనీలుసైతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి.

మరోవైపు జంట నగరాల్లోని జలాశయాలైన హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టానికి చేరుకుంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు వరద గంటగంటకు పెరుగుతుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అందుకు తగిన విధంగా జలాశయాలకు పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరోవైపు మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు