అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను.. ఏపీలో ఏమైందో చూశాం కదా: సీఎం రేవంత్

జగన్ తరహా పాలన నాది కాదు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూయించారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు నేను తీసుకోను.

cm revanth reddy hot comments: ప్రతీకార, కక్ష సాధింపు రాజకీయాలు చేయబోనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”కేసీఆర్ విషయంలో ప్రతీకార రాజకీయాలు చేయను. జగన్ తరహా పాలన నాది కాదు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే ఏం జరుగుతుందో ఏపీ ప్రజలు చూయించారు. అలాంటి తప్పుడు నిర్ణయాలు నేను తీసుకోను. కేసీఆర్‌ను గద్దె దించడమే ప్రజలు ఆయనకు వేసిన పెద్ద శిక్ష. కేసీఆర్‌ను గద్దె దించా.. సీఎం అయ్యా.. బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేసా. ఎన్నికలకు ముందు నేను చెప్పినవన్నీ జరిగాయి. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడమే నా ముందున్న కర్తవ్యం.నా కుటుంబంలో ఉన్నవారు నాకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నారు. అధికార దుర్వినియోగం చేస్తే ఎవరిని ఉపేక్షించన”ని వార్నింగ్ ఇచ్చారు.

అందుకే చేరికలను ప్రోత్సహిస్తున్నాం
రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేరుస్తానని, ఏ విషయంలోనూ ప్రతిపక్షాలు విమర్శలు చేసేందుకు అవకాశం ఇవ్వబోనని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ ఒకటో తేదీ జీతాలు తీసుకోలేని 5 లక్షల ఉద్యోగులకు 1న జీతాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల్లో నమ్మకం కలిగిస్తే రాష్ట్ర అభివృద్ధికి వారు తనతో కలిసి పని చేస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కార్యకర్తలకు మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని, ఐదేళ్లపాటు సుస్థిర పాలన అందించడానికే చేరికలను ప్రోత్సహిస్తున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

Also Read : అధికార పార్టీలో ఉంటే ఆ కిక్కే వేరప్పా..! పవర్‌ కోసం సన్‌ఫ్లవర్స్ అవుతున్న లీడర్స్‌..!

హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదు
హైదరాబాద్ అభివృద్ధికి తమ వద్ద అద్భుతమైన ప్రణాళికలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు అమరావతి పోటీ కాదని.. ఇప్పటికే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడానికి ఇంకా లక్షల ఎకరాల భూమి ఉందని.. రూరల్, సెమి రూరల్ మాస్టర్ ప్లాన్‌తో ముందుకెళ్తామన్నారు. ”విజన్ 2050 ప్రణాళికతో హైదరాబాద్ అభివృద్ధి చేస్తాం. తెలంగాణ చుట్టూ 12 జాతీయ రహదారులు ఉన్నాయి. నగరంలో నుంచి కనెక్టివిటీ పెంచుతూ రింగ్ రోడ్ రీజినల్ రింగ్ రోడ్ పరిధిలో భూముల్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ దిశగా పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నా ధ్యేయమ”ని చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు