అధికార పార్టీలో ఉంటే ఆ మజానే వేరప్పా..! పవర్‌ కోసం సన్‌ఫ్లవర్స్ అవుతున్న లీడర్స్‌..!

ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్ అయిపోయింది. అపోజిషన్ వీక్‌గా ఉండాలని.. తమకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీలు లేకుండా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ జంపింగ్స్‌ను ప్రోత్సహిస్తారని చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్‌.

అధికార పార్టీలో ఉంటే ఆ మజానే వేరప్పా..! పవర్‌ కోసం సన్‌ఫ్లవర్స్ అవుతున్న లీడర్స్‌..!

Party Defections : ఈ గట్టున ఉంటావా? ఆ గట్టున ఉంటావా? ఏ గట్టున ఉండాలో సమయాన్ని బట్టి లీడర్లు ఎప్పుడూ క్లారిటీతోనే ఉంటారు. ఏ నేతను ఎన్నుకోవాలో అన్నదాంట్లో ఓటర్లకు మాత్రమే కన్ ఫ్యూజన్ ఉంటుంది. బెల్లం ఉన్న దగ్గరే ఈగలు వాలతాయి. అధికారం ఉన్న దగ్గరే హడావిడి ఉంటుంది. ఒక్కసారి పవర్ పోతే మాట్లాడించే వాడు కూడా దిక్కు ఉండడు. గల్లీ నుండి ఢిల్లీ వరకు దేశంలో ఇదే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు. పార్టీ ఏదైనా, లీడర్ ఎంత పెద్ద తోపైనా, పవర్ లో ఉన్న పార్టీలో ఉండేందుకు ఇష్టపడుతున్నారు. చచ్చినా, బతికినా.. తమకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన పొలిటికల్ ఫ్యూచర్ ఇచ్చిన నేత వెంబడే ఉంటామని మరీ స్టేట్ మెంట్లు ఇచ్చి.. తెల్లారేసరికి అధికారంలో ఉన్న పార్టీలో వాలిపోతున్నారు లీడర్లు.

పవర్ లేకుండా ఉండలేకపోతున్నారు..
పాలిటిక్స్ ఈస్ ఆల్వేస్‌ డైనమిక్స్. లీడర్స్‌ ఈస్ గ్రూమింగ్ ఎరౌండ్ పవర్. అంటే రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయి. రాజకీయ నేతలు ఎప్పుడూ అధికారం చుట్టే తిరుగుతుంటారు. పరిస్థితులకు తగ్గట్లుగా రాజకీయాలు మారినట్లే.. లీడర్లు కూడా అధికార పార్టీలో ఉండేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎమ్మెల్సీగా కొనసాగుతోన్నా.. పవర్‌లో ఉన్న పార్టీలోకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అధికారంలో లేకపోతే అపోజిషిన్‌లో ఉండలేకపోతున్నారు లీడర్లు. దేశవ్యాప్తంగా జంపింగ్ జపాంగ్స్‌ లొల్లి ఇప్పుడే మొదలు కాలేదు. సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చే కంటే ముందే దేశ రాజకీయ నేతల వలసలు ఉన్నాయి. అధికారంలో ఉన్న పార్టీలో ఉంటే అంతా బాగుంటుందనే ఆశతో.. అప్పటివరకు పదవులు, హోదా, గుర్తింపు, రాజకీయ భవిష్యత్‌ కల్పించిన పార్టీలకు హ్యాండిస్తున్నారు లీడర్లు.

విలువల ముచ్చటే లేదు.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే..
ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా.. ఎంత పేరున్నా.. రాజ్యాంగబద్దమైన పదవులకు ఎన్నిక కాబడితే ఉండే కిక్కే వేరు. అట్లే అధికార పార్టీలో ఉంటే ఆ మజానే వేరు. ప్రజాప్రతినిధులు అయితే ప్రొటోకాల్, పోలీస్ ఎస్కార్ట్‌, ఆఫీసుల్లో రాచమర్యాదలు అన్నీ ఉంటాయి. ఇక అధికార పార్టీలో ఉంటే నెక్స్ట్ లెవల్ పవర్స్ ఎంజాయ్‌ చేయొచ్చు. అందుకే విలువల ముచ్చటే లేదు. ప్రజలు ఏమనుకుంటారోనన్న డౌట్ అసలు లేదు. పవర్ ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయి.. లైమ్‌ లైట్‌లో ఉండేందుకు ఆరాటపడుతున్నారు నేతలు. ఓ పార్టీలో ఉండి అధికారం కోల్పోగానే ఐదేళ్లు అపోజిషన్‌లో ఉండాలంటే సెకను కూడా ఇష్టపడటం లేదు.

కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తిన లీడర్లే.. దుమ్మెత్తిపోస్తున్నారు..
అధికారం ఉన్నప్పుడు అన్నీ అనుభవించి.. అప్పటి వరకు ఆ పార్టీలో కొనసాగుతున్న వారికి పదవులు దక్కకుండా చేసి.. తీరా పవర్ పోయాక ఫేస్ టర్నింగ్ ఇచ్చి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో వలసల రాజకీయం ఇలానే కొనసాగుతోంది. ఒకప్పుడు గులాబీ బాస్‌ను ఆకాశానికి ఎత్తిన లీడర్లే.. ఇప్పుడు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓ వైపు కేసీఆర్‌ను అభినందిస్తూనే మరోవైపు సుతిమెత్తగా సున్నితంగా విమర్శిస్తూ జంపింగ్‌కు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.

పవర్ పోగానే కారు దిగేస్తున్నారు..
కేసీఆర్‌తో కలిపి బీఆర్ఎస్‌ నుంచి 39మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పటికే దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సంజయ్‌ కుమార్ హస్తం గూటికి చేరారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు పలువురు సిట్టింగ్‌ ఎంపీలు కూడా పార్టీ మారి.. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పార్టీ జంప్‌ అయినోళ్లంతా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటపడితే చాలు అని కోరుకున్న వారే. పిలిచి పదవులు ఇస్తే అందలమెక్కిన వాళ్లే. మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వంలో ఇంకా కీలక పదవులు అనుభవించి తీరా పవర్‌పోగానే.. బీఆర్‌ఎస్‌కు టాటా చెప్పి కారు దిగి హస్తం గూటికి చేరుకుంటున్నారు.

ఎప్పటి నుంచో ఎమ్మెల్యేల వలసల రాజకీయం..
తెలుగు స్టేట్స్‌లో ఎమ్మెల్యేల వలసల రాజకీయం ఎప్పటి నుంచో కొనసాగుతోంది. రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పటి టీఆర్ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఒక్కరికి కూడా కండువా కప్పలేదు. అప్పుడు టీఆర్ఎస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేసి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు పోరాటం చేశారు. కానీ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడలేదు. పైగా అప్పుడు స్పీకర్‌గా ఉన్న కేఆర్‌ సురేష్‌రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లో రాజ్యసభ సభ్యుడిగా, పార్టీ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు.

టీడీఎల్పీ, సీఎల్పీని బీఆర్ఎస్ లో కలుపుకున్న కేసీఆర్..
ప్రత్యేక రాష్ట్రం వచ్చాక గులాబీబాస్‌ కేసీఆర్ కూడా వలసలను ప్రోత్సహించారు. ఓ ఎమ్మెల్సీ పదవి కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు.. టీడీపీ 2017లో కుట్రలు చేసిందని.. టీడీఎల్పీని బీఆర్ఎస్‌లో విలీనం చేశారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని సీఎల్పీని కూడా బీఆర్ఎస్‌లో కలుపుకున్నారు. అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్‌లో చేరిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశాయి. న్యాయం పోరాటం కూడా కొనసాగించాయి.

ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్..
ఏపీలోనూ 2014లో టీడీపీ అధికారంలో వచ్చాక.. పదుల సంఖ్యలో వైసీపీ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు చంద్రబాబు. ఫిరాయింపుదారులపై చర్యల కోసం అప్పట్లో వైసీపీ కూడా గట్టిగానే ప్రయత్నం చేసింది. కానీ స్పీకర్‌ దగ్గర వ్యవహారం ఉండటంతో ఏమీ చేయలేకపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీ నుంచి వల్లభనేని వంశీ, జనసేన నుంచి రాపాక వరప్రసాద్‌ను వైసీపీలో చేర్చుకున్నారు. ఇలా ఎవరు అధికారంలో ఉన్నా వలసలను ప్రోత్సహించడం కామన్ అయిపోయింది. అపోజిషన్ వీక్‌గా ఉండాలని.. తమకు వ్యతిరేకంగా పోరాడేందుకు వీలు లేకుండా మనోధైర్యం దెబ్బతీసే ప్రయత్నాల్లో భాగంగా ఈ జంపింగ్స్‌ను ప్రోత్సహిస్తారని చెప్తున్నారు పొలిటికల్ ఎక్స్ పర్ట్స్‌. పైకి మాత్రం నియోజకవర్గ అభివృద్ధి కోసం, రాష్ట్రం బాగుకోసం పార్టీ మారుతున్నామని చెప్పడం జంపింగ్ జపాంగ్స్‌కు ట్యాగ్‌లైన్స్‌ అయిపోయాయి.

Also Read : 33 మందిలో చివరికి మిగిలేది ఎంతమంది? గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్