Imran Khan: హిట్లర్ పాలన కంటే దారుణం.. మిమ్మల్ని వదిలేది లేదు.. ఆసిం మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ సోదరి ఫైర్..

తాజాగా ఈ వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్రంగా స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Imran Khan: హిట్లర్ పాలన కంటే దారుణం.. మిమ్మల్ని వదిలేది లేదు.. ఆసిం మునీర్‌పై ఇమ్రాన్ ఖాన్ సోదరి ఫైర్..

Updated On : November 28, 2025 / 10:05 PM IST

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ మరణ వదంతులు ఆ దేశంలో కలకలం రేపుతున్నాయి. అవినీతి ఆరోపణలతో రావల్పిండిలోని అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌ను.. ఆసిమ్ మునీర్ నేతృత్వంలోని సైన్యం హత్య చేసిందనే వదంతులు వ్యాపిస్తున్నాయి. గత నాలుగు వారాలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. ఇమ్రాన్ ఖాన్ చెల్లెళ్లతో సహా ఖైబర్ ఫఖ్తుంఖ్వా సీఎంను కూడా జైలు అధికారులు అనుమతించడం లేదు. దీంతో అనుమానాలు మరింత పెరిగాయి.

గత 845 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ నిర్బంధంలో ఉండగా..6 వారాలుగా ఆయనను పూర్తిగా ఏకాంతంగా డెత్ సెల్ లో ఉంచారని తెలుస్తోంది. కనీసం కుటుంబ సభ్యులను కూడా ఆయనను చూసేందుకు అంగీకరించకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

తాజాగా ఈ వ్యవహారంపై ఇమ్రాన్ ఖాన్ సోదరి తీవ్రంగా స్పందించారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తన సోదరుడికి ఏదైనా జరిగితే, ఆర్మీ చీఫ్ వారసులు దేశంలో ఎప్పటికీ సురక్షితంగా ఉండరని ఆసిమ్ మునీర్‌ను హెచ్చరించారు ఇమ్రాన్ ఖాన్ సోదరి నోరీన్ నియాజీ. పాకిస్తాన్‌లో తన సోదరుడికి ప్రాథమిక మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందన్నారు. ఇమ్రాన్ నుండి “ఒక్క మాట” వస్తే, అతని పార్టీ కార్యకర్తలు “జైలు ద్వారాలను బద్దలుకొట్టి అతడిని రక్షిస్తారని నోరీన్ చెప్పారు. మునీర్ పాలనపై ఆమె నిప్పులు చెరిగారు. మునీర్ పాలన హిట్లర్ పాలన కంటే దారుణంగా ఉందన్నారు.

మహిళలను, పిల్లలను కాల్చి చంపుతున్నారు..

“పోలీసులు మహిళలను, పిల్లలను కాల్చి చంపుతున్నారు. పాకిస్తాన్‌లో కోర్టులు బలహీనపడ్డాయి. మూడు వారాలకు పైగా ఇమ్రాన్ ఖాన్ గురించి ఎటువంటి వార్తలు లేవు” అని ఆమె వాపోయారు. ఇమ్రాన్ ఖాన్‌ను చూసేందుకు తమ కుటుంబానికి చాలా వారాలుగా అనుమతి ఇవ్వడం లేదని, దీని వల్ల ఆయన క్షేమ సమాచారం మాకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని నోరీన్ అన్నారు. రావల్పిండిలోని అడియాలా జైలులో పిటిఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ పరిస్థితి గురించి అధికారులు ఎటువంటి సమాచారం అందించలేదన్నారు.

ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వదంతులు వ్యాపించడం, ఆయన కమ్యూనికేషన్ పై ఆంక్షలు విధించడం.. ఇమ్రాన్ కుటుంబం, మద్దతుదారుల్లో తీవ్ర అలజడి రేపింది. “మాకు ఏమీ తెలియదు. వారు మాకు ఏమీ చెప్పడం లేదు. ఎవరినీ ఆయనను కలవనివ్వడం లేదు. ఆయన పార్టీ సభ్యులను కూడా లోపలికి అనుమతించలేదు. గత నాలుగు వారాలుగా ఆయనను కలవడానికి మాకు అనుమతి లేదు. ఆయన హత్యకు గురయ్యారని వార్తలు వ్యాపిస్తున్నాయి” అని ఇమ్రాన్ సోదరి తెలిపారు.

అంతకుముందు, ఇమ్రాన్ ఖాన్ చిన్న కుమారుడు కాసిం ఖాన్ కూడా తీవ్రంగా స్పందించారు. తన తండ్రి బతికున్నట్లుగా తమకు ఆధారాలు చూపించాలని ఖాసీం ఖాన్ జైలు అధికారులను, పాక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులను జైల్లోకి అనుమతించడం లేదన్నారు. నిర్బంధంలో ఉన్న ఇమ్రాన్ కు ఏదైనా జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ బతికి ఉన్నాడా లేదా అనేది తెలుసుకునేందుకు ఆయన కుటుంబం అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతోంది.

Also Read: భారత్‌ను రెచ్చగొట్టేలా నేపాల్ తీరు.. కొత్త 100 రూపాయల నోటుపై ఏముందంటే..