33 మందిలో చివరికి మిగిలేది ఎంతమంది? గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్

పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే... ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు.

33 మందిలో చివరికి మిగిలేది ఎంతమంది? గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాంగ్రెస్

Brs Mlas Defections : కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌ జోరు పెంచిందా? ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలను చేర్చుకున్న కాంగ్రెస్‌ మరో వికెట్‌ పడగొట్టడానికి సిద్ధమవుతోందా? ఈ లిస్టులో ఇంకా చాలా మందే ఉన్నారా? గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎందరు? పార్టీ నుంచి నేతల వలసలపై గులాబీ బాస్‌ కేసీఆర్‌ ఏమంటున్నారు? పోతేపోనీ అంటూ లైట్‌ తీసుకుంటున్నారా? కేసీఆర్‌ వైఖరితో బీఆర్‌ఎస్‌ ఫ్యూచర్‌ ఎలా ఉండబోతోంది? తెలంగాణలో తాజా రాజకీయాలు ఎలా ఉన్నాయి?

కాంగ్రెలో కి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు?
కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌….. గులాబీ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు తన గూటికి చేర్చుకున్న హస్తం పార్టీ…. మరింత మంది ఎమ్మెల్యేలను టార్గెట్‌ చేస్తోందట. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో హస్తం పార్టీని కకావికలం చేయడాన్ని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్‌ నాయకులు… ఇప్పుడు అదే పంథాను ఎంచుకుంటున్నారట… ఇప్పటికే ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకటరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ లిస్టులో ఇప్పుడు పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ పేర్లు వినిపిస్తున్నాయి.

ఆ ఇద్దరు.. బీఆర్ఎస్ లో కొనసాగడంపై అనుమానాలు..
మాజీ మంత్రి గంగులకు బీఆర్‌ఎస్‌లో ఎంతో ప్రాధాన్యమిచ్చినా… ఆయన పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారం గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది. గంగుల తమ పార్టీలో చేరతారంటూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మీడియా ముఖంగా ప్రకటించినా ఖండించలేదు గంగుల… దీంతో గంగుల బీఆర్‌ఎస్‌లో కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిపై ఇటీవల ఈడీ దాడులు జరిగాయి. దీంతో ప్రభుత్వ మద్దతు కోసం ఆయన కూడా గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారట.

సీఎం రేవంత్ టార్గెట్ 23..!
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 39 చోట్ల గెలిచింది. ఇందులో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోగా, కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో సిట్టింగ్‌ స్థానం కోల్పోయింది బీఆర్‌ఎస్‌. అంటే ఇంకా 33 మంది మాత్రమే మిగిలారు. వీరిలో 23 మందిని కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని టార్గెట్‌ పెట్టుకుంది కాంగ్రెస్‌ నాయకత్వం. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి పూర్తి అధికారమిచ్చిందట హైకమాండ్‌.

మిగిలిన ఎమ్మెల్యేలను తెస్తే మంత్రి పదవి..?
ప్రభుత్వ సుస్థిరత పేరిట గతంలో బీఆర్‌ఎస్‌ అనుసరించిన విధానాన్ని గుర్తు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి… బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్నారు. ప్రస్తుతం చేరిన ఐదుగురితోపాటు మరో ఇద్దరు లైన్ లో ఉండటంతో… మిగిలిన వారి కోసం చకచకా పావులు కదుపుతున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. కొత్తగా పార్టీలో చేరడం… తమతోపాటు మిగిలిన ఎమ్మెల్యేలను తెస్తే మంత్రి పదవి ఇస్తామనే బంపర్‌ ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు.

పార్టీని కాపాడుకోవడం ఎలాగో తెలుసంటూ ధీమా..
ఇక ఎమ్మెల్యేల వలసలతో బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్కసీటు గెలుచుకోలేక పార్టీ శ్రేణులు నైరాశ్యంలో ఉంటే… ఇప్పుడు పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన గులాబీ బాస్‌ కేసీఆర్‌… అందుబాటులో ఉన్న లీడర్లతో సమావేశమై వలసలపై ఆందోళన చెందొద్దని శ్రేణులకు ధైర్యం చెప్పాలని పిలుపునిచ్చినట్లు సమాచారం… ఎంతమంది వెళ్లినా… ఆందోళన చెందాల్సిన పనిలేదు. కేసీఆర్‌లో ఇంకా ఫైటర్‌ బలంగానే ఉన్నాడు. ఉద్యమ కాలం నాటి పోరాట పటిమ, తెగువ కార్యకర్తల్లో సడలలేదు. మధ్యలో వచ్చిన వారు మధ్యలోనే పోతారు.. పార్టీని కాపాడుకోవడం ఎలాగో తనకు తెలుసంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్‌.

ఈ పరిణామాలతో బీఆర్‌ఎస్‌ వలసలపై అధినేతకు ఫుల్‌ క్లారిటీ ఉన్నట్లే భావించాల్సి వస్తోందంటున్నారు పరిశీలకులు. పార్టీ మారిపోతామనే ఎమ్మెల్యేను బుజ్జగించొద్దు… బతిమలాడొద్దని అధినేతే స్వయంగా చెబుతుండటం అంతుపట్టక… కేసీఆర్‌కే ఏదో స్కెచ్‌ ఉండే ఉంటుందని సరిపెట్టుకుంటున్నారు గులాబీ కార్యకర్తలు.. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న 33లో చివరికి మిగిలేది ఎందరన్నదే ఆసక్తికరంగా మారింది.

Also Read : ఇటు సీనియర్లు, అటు జూనియర్లు.. మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ