ఇటు సీనియర్లు, అటు జూనియర్లు.. మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ

ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిన ఒక‌రిద్దరిని మంత్రివ‌ర్గంలోకి తీసుకంటార‌న్న చ‌ర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఇటు సీనియర్లు, అటు జూనియర్లు.. మంత్రి పదవుల కోసం తీవ్రమైన పోటీ

Telangana Cabinet Expansion : తెలంగాణ మంత్రివ‌ర్గ విస్తరణపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్‌ పెట్టారు. కొత్త పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా హస్తిన టూర్‌ వెళ్లిన సీఎం… పనిలో పనిగా క్యాబినెట్‌ విస్తరణపైనా అధిష్టానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందారట. ఇక ఢిల్లీ నుంచి సీఎం రాగానే కొత్త మంత్రులపై కసరత్తు ముమ్మరం అవుతోందని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే కొత్త మంత్రులుగా ఎవరిని తీసుకుంటే ఎలా ఉంటుందనే విషయమై పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్న సీఎం… ఎవరికి చాన్స్‌ ఇస్తారనేదే సస్పెన్స్‌గా మారింది.

ఇంకా క్యాబినెట్‌లో ఆరు ఖాళీలు..
తెలంగాణ‌ మంత్రివ‌ర్గ విస్తర‌ణ‌కు స‌మ‌యం ద‌గ్గర ప‌డుతోంది. గత ఏడాది డిసెంబర్‌లో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌రెడ్డి తొలి విడతలో 10మంది మంత్రులను తీసుకున్నారు. ఇంకా క్యాబినెట్‌లో ఆరు ఖాళీలు ఉన్నాయి. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి ఈ ఖాళీలను భర్తీ చేయాలని గతంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో మంత్రివర్గ విస్తరణ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు ఆశావహులు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే కొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల‌ ముందే మంత్రివర్గాన్ని విస్తరించాలని సీఎం ఆలోచనగా ఉందంటున్నారు.

అటు సీనియర్లు, ఇటు జూనియర్లు.. పదవుల కోసం పోటీ..
పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లో ఎందరో సీనియర్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు. వీరంతా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇదే సమయంలో జూనియర్‌ నేతలు కూడా అమాత్య యోగం కోసం పైరవీలు మొదలుపెట్టారట.. ఇటు సీనియర్లు, అటు జూనియర్లు… సీఎం రేవంత్ రెడ్డితోపాటు అధిష్టానం పెద్దల ఆశీస్సుల‌ కోసం తెగ‌ లాబీయింగ్ చేసుకుంటున్నారు. కులాలు, జిల్లాలు, బ‌లాలు ఇలా ఎవ‌రికి వారు లెక్కలు వేసుకుని మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకునేందుకు…. ప్రయ‌త్నాలు చేసుకుంటున్నారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌ల కోసం దాదాపు డజను మంది నేతలు విస్తృతంగా ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు అవ‌కాశమివ్వాలని సీఎం నిర్ణయం..!
ప్రస్తుతం క్యాబినెట్ లో హైద‌రాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల‌కు ప్రాధాన్యం ద‌క్కలేదు. ఈ విస్తర‌ణ‌లో ఈ జిల్లాలకు మంత్రి ప‌ద‌వులు కేటాయించాల‌ని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్త్‌ల్లో రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు అవ‌కాశమివ్వాలని సీఎం నిర్ణయించినట్లు కాంగ్రెస్‌ వర్గాల సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి మ‌ల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మెహ‌న్ రెడ్డి ఆశ‌ ప‌డుతున్నారు. ఈ ఇద్దరిలో ఒకరికి చాన్స్‌ పక్కా అనే విశ్లేషణలు ఉన్నాయి. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి గడ్డం వివేక్, ఆయన సోదరుడు గడ్డం వినోద్‌ మంత్రి పదవిని ఆశిస్తుండగా, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగ‌ర్‌రావు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదిలాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు తీసుకుని, పార్టీ బలోపేతానికి కృషి చేసిన తనపేరు పరిశీలించాల్సింగా ప్రేమ్‌సాగర్‌రావు ఒత్తిడి ఎక్కువ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రేసులో దానం, పోచారం, రాజగోపాల్ రెడ్డి..!
ఇక నిజామాబాద్ నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి సుద‌ర్శన్ రెడ్డికి బెర్త్ క‌న్ఫార్మ్‌ అన్న టాక్‌ వినిపిస్తోంది. ఐతే ఇదే జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ మ‌హేశ్‌కుమార్ గౌడ్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. తనకు పీసీసీ ప్రెసిడెంట్‌ కావాలని కోరుతున్న మహేశ్‌కుమార్‌గౌడ్‌… పీసీసీ లేదంటే మంత్రి పదవి కచ్చితంగా ఇవ్వాల్సిందేనని లాబీయింగ్‌ చేస్తున్నారట. ఇక తాజాగా పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. హైద‌రాబాద్ నుంచి దానం నాగేంద‌ర్ పేరు వినిపిస్తుంటే… సీనియర్‌ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి సైతం ఒక్కచాన్స్‌ ఇవ్వాలంటున్నారట..

ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిన ఒక‌రిద్దరిని మంత్రివ‌ర్గంలోకి తీసుకంటార‌న్న చ‌ర్చ కూడా నడుస్తోంది. మొత్తానికి ఆరు మంత్రి పదవుల కోసం డజనుకు పైగా నేతలు పోటీ పడుతుండటం కాంగ్రెస్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Also Read : బీఆర్ఎస్‌లో చివరికి మిగిలే ఎమ్మెల్యేలు ఎవరు? గులాబీ దళంలో వలసల గుబులు