Nellore Mayor: నెల్లూరు మేయర్ పీఠం టీడీపీదేనా? సైకిల్ పార్టీ ప్లాన్ ఏంటి.. వైసీపీ స్ట్రాటజీ ఏంటి..
అవిశ్వాస తీర్మానం ప్రకారం, కలెక్టర్ 15 రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ జరపాలి. 54 మంది సభ్యుల సభలో మెజారిటీ 28 ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది.
Nellore Mayor: నెల్లూరు నగర పాలక సంస్థలో పాగా వేసే స్కెచ్ వేస్తోంది టీడీపీ. గత కొన్నాళ్లుగా ఇక్కడి పాలక పక్షంపై ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం మారిన తర్వాత పొలిటికల్ ఈక్వేషన్స్ మారాయి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు స్పీడప్ చేశారు. 2021లో జరిగిన ఎన్నికల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని వైసీపీ దక్కించుకుంది. మొత్తం 54 కార్పొరేషన్ స్థానాలున్న నెల్లూరు నగర పాలక సంస్థలో క్లీన్ స్వీప్ చేసి మేయర్ కుర్చీని తన ఖాతాలో వేసుకుంది వైసీపీ. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే, మాజీ వైసీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు..ఇక్కడ వైసీపీని బలోపేతం చేశారు.
అయితే..గతేడాది రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. పైగా నెల్లూరుకు చెందిన వైసీపీ కీలక నేతంలా టీడీపీ కండువా కప్పుకొన్నారు. ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న ఆ నేతలు.. లోకల్‌గా తమ ఆధిపత్యం కోసం గేమ్ షురూ చేశారు. దీనికి తోడు మేయర్ స్రవంతి ఫ్యామిలీ పాలిటిక్స్ కాంట్రవర్సీ అయ్యాయి. కార్పొరేషన్ నిధులను దారి మళ్లించారని..ఈ విషయంలో స్రవంతి భర్త ప్రమేయం ఉందని టీడీపీ కార్పొరేటర్లు ఆరోపించారు.
54 మందిలో వైసీపీకి మిగిలింది 13 మందే..!
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ రూపు కుమార్..టీడీపీ గూటికి చేరడంతో నెల్లూరు రాజకీయాలు మారుతూ వచ్చాయి. 41 మంది వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా సైకిల్ ఎక్కారు. గతంలో 54 సీట్లకు 54 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసిన వైసీపీకి అక్కడ 13మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలిపోయారు. సంఖ్యా పరంగా తమకు 41 మంది ఉండటంతో..మేయర్ స్రవంతిపై అవిశ్వాసం కోసం జాయింట్ కలెక్టర్‌కు నోటీసులు ఇచ్చారు కార్పొరేటర్లు. ఇప్పటికే జిల్లా మంత్రి నారాయణ పార్టీ లీడర్లు, కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. మెజారిటీ నాయకులు ఇక్కడ నాయకత్వాన్ని మార్చాల్సిందేనని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అనిల్ వర్గంగా ఉన్న కొందరు కూడా త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు. దీంతో నెల్లూరు మేయర్ పీఠం వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది.
అవిశ్వాస తీర్మానంలో డిప్యూటీ మేయర్ కీలక పాత్ర..
మేయర్ స్రవంతిపై అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన కార్పొరేటర్లు..ఎందుకు అవిశ్వాసం పెట్టాల్సి వస్తుందో వివరించారు. మేయర్ స్రవంతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గత నాలుగేళ్లలో కార్పొరేషన్ సమావేశాలు కేవలం ఏడు సార్లు మాత్రమే ఏర్పాటు చేశారని, ఆమె భర్త జయవర్ధన్ కమిషనర్ల సంతకాలను ఫోర్జరీ చేసి నేరం చేశారని చెప్పుకొచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 మార్చిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరిన రూప్‌కుమార్..ఇప్పుడు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీలో కీరోల్ ప్లే చేస్తున్నారు.
54 మంది సభ్యుల నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీకి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన మెజార్టీ సరిపోతుంది. అవిశ్వాస తీర్మానానికి మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. అయితే టీడీపీలో వెళ్లేందుకు మేయర్ స్రవంతి 2024 జూన్‌లోనే వైసీపీకి రాజీనామా చేశారు. కానీ ఆమెను కూటమి పార్టీలు ఆహ్వానించ లేదు.
లేటెస్ట్‌గా స్రవంతి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానం ప్రకారం, కలెక్టర్ 15 రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ జరపాలి. 54 మంది సభ్యుల సభలో మెజారిటీ 28 ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది. దీంతో అవిశ్వాస పరీక్షలో టీడీపీ నెగ్గితే స్రవంతి పదవి ఊస్ట్ అవడం ఖాయం. నెల్లూరు మేయర్ పీఠాన్ని నిలబెట్టుకునేందుకు వైసీపీ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుందో చూడాలి.
