అందుకే GHMCలో మున్సిపాలిటీల విలీనం? ప్రభుత్వ నిర్ణయంతో వాళ్లకు పరేషాన్
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు ఐటీ ప్రాంతాన్ని అంతా కలిపి మరో కొత్త పేరు ఏదైనా తెరపైకి తీస్తారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.
GHMCలో మున్సిపాలిటీల విలీనం కొత్త చర్చకు దారితీస్తోంది. గ్రేటర్‌లో శివారు ప్రాంతంలోని 20 మున్సిపాలిటీలు, 7కార్పొరేషన్లు విలీనం చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో డౌట్స్‌కు కారణమవుతోంది. గతంలోనే GHMC పరిధి పెరిగిన నేపథ్యంలోనే శివారు ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఆవిర్భవించాయి.
ఇప్పుడా 27 మున్సిపాలిటీలను గ్రేటర్ పరిధిలో చేరుస్తూ మంత్రివర్గం డెసిషన్ తీసుకుంది. GHMCలో 27 లోకల్ బాడీల విలీనంతో..గ్రేటర్ పరిధి 625 చదరపు కిలోమీటర్ల నుంచి 2వేల చదరపు కిలోమీటర్లపైగా విస్తరించనుంది. ఇంత భారీ విస్తీర్ణంలో ఉన్న లోకల్ బాడీ దేశంలో హైదరాబాద్ మాత్రమే కానుంది. ఈ అంశమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది.
ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తే సరైన ప్రణాళికతో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన..డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటివి ఈజీ అవుతాయనేది ప్రభుత్వ వర్గాల భావన. హైదరాబాద్‌కు వలసలు పెరుగుతుండటంతో చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నిర్వహణ సరిగ్గా చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. చిన్న చిన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధుల సేకరణ కష్టంగా మారిందని..మౌలిక వసతులు, అభివృద్ధి అనుకున్నట్లుగా జరగట్లేదన్న భావన కూడా ఉంది.
అయితే GHMCలో విలీనం అయితే అందరికీ ఒకే స్థాయిలో వేతనాలు జీతాలు అందే అవకాశం ఉంటుంది. ఇది విలీనం కాబోతున్న మున్సిపల్ ఉద్యోగులకు ఊరట కలిగించే అంశం. ఇక పొలిటికల్‌గా చూస్తే 20 మున్సిపాలిటీల్లో చైర్మన్లు..మరో ఏడు కార్పోరేషన్లలో మేయర్లుగా అయ్యే అవకాశం పోతుంది. అంతేకాకుండా 5, 10, 15 వేల ఓట్లకు ఒక వార్డ్ సభ్యుడు గతంలో ఉండేవారు.
ఇప్పుడు 35 నుంచి 50 వేల ఓటర్లకు ఒక వార్డు సభ్యుడు ఉండే అవకాశం ఏర్పడుతుంది. దాంతో చాలామంది రాజకీయంగా ఎదిగేందుకు విలీనం ఆటంకంగా మారుతుందనే చర్చ సాగుతుంది. హైదరాబాద్‌లో కలపడం ద్వారా ఒకేసారి పన్నుల భారం పెరుగుతుందనే విమర్శలు వినబడుతున్నాయి. అయితే పన్నుల భారం పెరిగినప్పటికీ..నిధుల పెరుగుదల అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందనేది మరో అంశం.
రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా మారుస్తారా?
ఔటర్ రింగ్ రోడ్డు వరకు GHMC పరిధిలోకి తీసుకొచ్చే ఆలోచన చేసిన ప్రభుత్వం..భవిష్యత్‌లో ఇంత విస్తీర్ణం కలిగిన భూభాగాన్ని ఒకే పాలన కింద ఉంచుతుందా.? లేదా అన్నది చర్చకు దారితీస్తోంది. రెండు లేదా మూడు కార్పొరేషన్లుగా మారుస్తారా అన్న టాక్ కూడా నడుస్తోంది. మూసీకి ఒకవైపు సౌత్ హైదరాబాద్..మరోవైపు నార్త్ హైదరాబాద్‌గా విభజిస్తారనే వాదనలు ఉన్నాయి. లేదంటే గ్రేటర్ పరిధి మూడు కార్పొరేషన్లుగా మారే అవకాశం ఉన్నట్లు మరో వాదన ఉంది. అయితే మూడు సిటీలుగా మారితే వాటి పేర్లు ఏముంటాయనేది మరొక చర్చ.
హైదరాబాద్, సికింద్రాబాద్‌తో పాటు ఐటీ ప్రాంతాన్ని అంతా కలిపి మరో కొత్త పేరు ఏదైనా తెరపైకి తీస్తారా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. GHMCని ఇలాగే ఉంచి ఆరు జోన్ల నుంచి పది జోన్లుగా మార్చడం..30 సర్కిళ్లను 50 సర్కిళ్లకు పెంచుతారన్న టాక్ కూడా లేకపోలేదు. కొత్తగా విలీనం అయిన మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మరో 100 డివిజన్లు కొత్తగా పెంచి ఇలాగే గ్రేటర్ పాలనను కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ అంశంలో ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి క్లారిటీ రావడం లేదు.
ఇప్పటికే హైదరాబాద్ వాటర్ బోర్డ్ నీటి సరఫరాను ఔటర్ రింగ్ రోడ్డు లోపల..అవతల అన్నట్లుగా ఇంప్లిమెంట్ చేస్తోంది. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు తన కార్యక్రమాలను చేపడుతుంది. GHMC కూడా ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరిస్తే ఇలాంటి సంస్థలన్నీ ఒకే జోన్ పద్ధతిలో మౌల్డ్ అయ్యేందుకు అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా ఏదైనా నిర్ణయం చేసినప్పుడు వాటిని బలంగా అమలు చేసే వీలుంటుందని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. గ్రేటర్‌లో మున్సిపాలిటీల విలీనం ఎలాంటి మార్పులకు, రాజకీయ వివాదాలకు తెరదీస్తుందో చూడాలి మరి.
