Citrus Cultivation : నిమ్మతోటల్లో గజ్జితెగులు నివారణ చర్యలు

నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ,  గజ్జితెగులు బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తెగులు వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, పంట నాణ్యత తగ్గిపోయి, మార్కెట్ లో సరైన  ధర పొందలేకపోతున్నారు. 

Citrus Cultivation : నిమ్మతోటల్లో రైతును నిరంతరాయంగా వెన్నాడుతున్న సమస్య గజ్జి తెగులు. సమస్యాత్మక నేలల్లో నాటిన తోట ల్లోను, యాజమాన్యం సరిగా లేని తోట ల్లో ఈ తెగులు తాకిడి అధికంగా కనిపిస్తోంది. గజ్జి తెగులు వల్ల చెట్లు క్షీణించటంతోపాటు, కాయ నాణ్యత లోపించటం వల్ల రైతులు నష్టాలను ఎదుర్కుంటున్నారు. గజ్జితెగులు తీవ్రత అధికంగా వున్న తోటల్లో, వేరుకుళ్లు  కూడా ఆశించి చెట్లు తొందరగా చనిపోయే ప్రమాదం ఉంది.  ఈ తెగులు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర  చర్యలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

READ ALSO : Lemon Farming : నిమ్మతోటల్లో రైతులు అనుసరించాల్సిన ఎరువుల యాజమాన్యం !

నాటిన  3వ సంవత్సరం నుంచి  30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడినిచ్చే పంట నిమ్మ. ఈ తోటల నుంచి ఏడాది పొడవునా కాయదిగుబడి వచ్చినప్పటికీ నవంబరు నుంచి వచ్చే పూత నుంచి రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఈ పూత నుంచి వేసవిలో కాయ తయారవుతుంది. వేసవిలో నిమ్మకాయకు అధిక డిమాండు వుంటుంది కనుక, రైతుకు మంచి రేటు లభిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో నిమ్మతోటలను అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు. కృష్ణా గుంటూరు, గోదావరి జిల్లాలతోపాటు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని సారవంతమైన మెట్ట భూముల్లో ఈ పంట అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. నిమ్మ సాగులో అనేక రకాల చీడపీడలను రైతులు సులభంగా అధిగమిస్తున్నప్పటికీ,  గజ్జితెగులు బెడదతో ఏడాది పొడవునా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ తెగులు వల్ల దిగుబడి తగ్గడమే కాకుండా, పంట నాణ్యత తగ్గిపోయి, మార్కెట్ లో సరైన  ధర పొందలేకపోతున్నారు.

READ ALSO : Tips For Growing Lemons : నిమ్మతోటల్లో పూత నియంత్రణ యాజమాన్యం.. అధిక దిగుబడులకు మేలైన సూచనలు

సాధారణంగా ఈ తెగులు చెట్ల ఆకులు – పండ్లు మీద ఎక్కువగా కనిపిస్తుంది. మొదట ఆకుపై పసుపు పచ్చగా, చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. క్రమేపి ఈ మచ్చలు ఉబ్బెత్తుగా గరుకుగా, గజ్జి వలే కనిపిస్తాయి. ఆకులు పసుపు రంగుకు మారి, రాలిపోతాయి. కాయలమీద  ఈ తెగులు లక్షణాలను గమనించినప్పుడు మచ్చలు ఉబ్బెత్తుగా వున్న ప్రాంతాల్లో జిగురు వంటి ద్రవం కారటం కనిపిస్తుంది.

తెగులు తీవ్రత అధికంగా వున్నప్పుడు కాయల్లో పగుళ్లు సంభవించటం కనిపిస్తుంది. కాయలు  ముదరక ముందే  రాలిపోతాయి . తెగులు తీవ్రమైనప్పుడు చెట్టులోని అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. ముళ్లమీద, పెద్ద కొమ్మల మీద, కాండం మీద   చివరకు వేరుపై కూడా ఈ తెగులు సోకి తీవ్ర నష్టం కలిగిస్తుంది. తెగులు ముదిరిన దశలో కొమ్మలు ఎండిపోయి చెట్టు క్షీణిస్తుంది.

READ ALSO : Lemon Yield In Summer : వేసవిలో నిమ్మదిగుబడి కోసం రైతులు అనుసరించాల్సిన యాజమాన్య పద్దతులు!

గజ్జితెగులు నివారణకు రైతులు సమగ్ర యాజమాన్యం పాటించాలి. తెగులు సోకిన కొమ్మలను కత్తిరించి వేయాలి.   1 గ్రాము స్ట్రెస్టోసైక్లిన్,  30 గ్రాములు బ్లైటాక్స్ 10 లీటర్ల నీటిలో కలిపి 20 రోజుల వ్యవధిలో 2 – 3 సార్లు చెట్టంతా తడిచేటట్లు పిచికారి చేయాలి. చెట్ల మొదళ్ళపైన , పెద్దకొమ్మలపైనా గజ్జితెగులు ఉంటే, తెగులు ఉన్న బెరడును కత్తితో గోకివేసి,  బోర్డోపేస్ట్ పూయాలి.

తెగులును గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు చేపడితే ఈ తెగులు ప్రభావం దిగుబడిపై అంతగా వుండదు. ఏటా మే, జూన్ నెలల్లో ఎండుకొమ్మలను కత్తిరించి, చెట్లకు గాలీ వెలుతురు దారాళంగా వచ్చేటట్లు చూసుకుంటే గజ్జి తెగులు ఆశించే అవకాశాలు తక్కువగా వుంటాయి. కొత్తగా తోటలు వేసే రైతులు తెగులును తట్టుకునే బాలాజీ రకాన్ని సాగుకు ఎంచుకోవటం ఉత్తమం. ఈ విధమైన యాజమాన్యంతో ఈ తెగులును సమర్ధంగా అధిగమించి నిమ్మలో అధిక దిగుబడితోపాటు, నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు