Mirchi Crop : అధిక దిగుబడినిచ్చే సూటి మిరప రకాలు

Mirchi Crop : మిరపలో హైబ్రిడ్‌లకు దీటుగా సూటిరకాలు - అధిక దిగుబడులిస్తున్న లాంఫాం రకాలు 

Mirchi Crop : సుగంధ ద్రవ్య పంటగా పేరుగాంచిన మిరప, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన వాణిజ్యపంటగా విరాజిల్లుతోంది. 20 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణంతో మన దేశం, మిరప ఉత్పత్తి, ఉత్పాదకతతో  ప్రపంచంలో ద్వితీయ స్థానంలో వుంది. ప్రస్థుతం తెలుగు రాష్ట్రాల్లో హైబ్రిడ్ మిరప రకాలు రాజ్యమేలుతున్నాయి . వీటిలో అధిక దిగుబడినిచ్చే  సామర్థ్యం వున్నప్పటికీ, అంతే స్థాయిలో సమస్యలు పెరిగిపోవటంతో రైతులు అనేక కష్టనష్టాలు ఎదుర్కుంటున్నారు.

చీడపీడల సమస్య తక్కువగా వుండే సూటి మిరప రకాలను నిర్లక్ష్యం చేయటం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. సాగు ఖర్చులను తగ్గిస్తూ… హైబ్రిడ్ లకు దీటుగా దిగుబడినిచ్చే  మిరప రకాల రూపొందించటంలో  గూంటురు జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంకు మంచి పేరుంది. ఇక్కడనుంచి  రైతుల ఆదరణ పొందుతున్న మిరప రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగుమతి ప్రాధాన్యంతో ఏటా 5వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే ఎర్రబంగారంగా  పేరుగాంచింది   మిరప. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో విరివిగా సాగవుతున్నా… ఎండుమిరప కోసం ఈ పంటను రైతులు ఖరీఫ్, రబీ సీజన్ లో ఎక్కువగా సాగుచేస్తున్నారు . ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మూడున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంతో, దేశంలో అత్యధిక మిరప ఉత్పత్తి, ఉత్పాదకత కలిగిన రాష్ట్రంగా ప్రధమ స్థానంలో వుంది. అయితే గత 3 సంవత్సరాలుగా  సాగు ఖర్చులు విపరీతంగా పెరగటం, చీడపీడల బెడద ఎక్కువైపోవటంతో  రైతులకు లాభాలు తగ్గిపోయాయి.

ముఖ్యంగా  మిరపపై వైరస్ దాడి రైతుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గత ఏడాది వైరస్ వల్ల అనేక ప్రాంతాల్లో నాటిన రెండుమూడు  నెలలకే పంటను తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాల సాగువైపు రైతులు మొగ్గుచూపటం, వీటిలో వైరస్ ను తట్టుకునే రకాలు లేకపోవటం వల్ల మిరపసాగులో  లాభనష్టాల మాట పరిపాటిగా మారింది.

మిరపలో అధిక దిగుబడి సామర్ధ్యం వున్న అనేక సూటి రకాలను శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ  వీటి సాగు పరిమితంగా వుంది. సూటి రకాల్లో ఎరువుల వాడకం తక్కువ వుండటం వల్ల చీడపీడల సమస్య తక్కువ వుంటుంది. దీనివల్ల సాగు ఖర్చులు కూడా అదుపులో వుంటాయి. వీటిలో కొన్ని రకాలు హైబ్రిడ్ లకు దీటుగా దిగుబడినిస్తున్నాయి.

గుంటూరు  జిల్లా లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం నుండి అనేక మిరప రకాలను శాస్త్రవేత్తలు రూపొందించారు . ఈ ఖరీఫ్ లో వీటి సాగుద్వారా రైతులు మంచి ఫలితాలు సాధించవచ్చని  సూచిస్తున్నారు, మిరప విభాగం ప్రధాన శాస్త్రవేత్త డా. శారద. ఇటీవలికాలంలో లామ్ ఫామ్ నుండి కొన్ని కొత్త మిరప వంగడాలను కూడా విడుదల చేసారు. వీటిలో రకాలతోపాటు, హైబ్రిడ్ లు కూడా వుండటం విశేషం.

Read Also : Soil Test For Agriculture : నేలకు ఆరోగ్యం.. పంటకు బలం – భూసార పరీక్షలతోనే అధిక దిగుబడులు 

ట్రెండింగ్ వార్తలు