Rohit Sharma (Pic credit @ BCCI)
Rohit Sharma – Hardik Pandya : ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంపై అభిమానుల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. ముంబైకి ఐదు సార్లు కప్పును అందించిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం పై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు.
ఐపీఎల్ మ్యాచుల్లోనూ దీని ప్రభావం కనిపించింది. ఐపీఎల్ మ్యాచుల్లో కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యను ఫ్యాన్స్ అవహేళన చేశారు. రోహిత్ కనిపించిన ప్రతీసారి రోహిత్.. రోహిత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక హార్దిక్ నాయకత్వంలో ముంబై వరుస ఓటములు కూడా మరో కారణం.
తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ..
కాగా.. కెప్టెన్సీ మార్పు పై ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఎక్కడా స్పందించలేదు. తాజాగా హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై స్పందిస్తూ.. ‘‘జీవితంలో అన్ని మనం అనుకున్నట్లు జరగవు. అయినా నేను ఇతరుల కెప్టెన్సీలో ఆడటం ఇదేమీ కొత్త కాదు’’ అని చెప్పాడు.
టీ20 ప్రపంచకప్‌కు జట్టును బీసీసీఐ ప్రకటించింది. వరల్డ్ కప్ జట్టులో కొందరు ఆటగాళ్లను పక్కన పెట్టడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మలు మీడియా సమావేశంలో వివరించారు. ఈ సమావేశంలో ఐపీఎల్‌లో హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడడంపై రోహిత్ శర్మను విలేకరులు ప్రశ్నించగా పై విధంగా సమాధానం ఇచ్చాడు.
Also Read: కేఎల్ రాహుల్ కంటే సంజూ శాంసన్ బెటర్.. కుండబద్దలు కొట్టిన అజిత్ అగార్కర్
కాగా.. రోహిత్ ఇప్పటి వరకు ఎంఎస్ ధోని, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లి నాయకత్వంలో టీమ్ఇండియా తరుపున ఆడాడు. ఇక ఐపీఎల్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, హర్భజన్ సింగ్, రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆడాడు. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచులు ఆడిన రోహిత్ 314 పరుగులు చేశాడు.
ఇదిలా ఉంటే.. రోహిత్ సారథ్యంలోనే టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ ఆడనుంది. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించగా హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్‌గా ఎంపిక అయ్యాడు.