Sanju Samson : సంజూ శాంసన్ జర జాగ్రత్త.. దూబె వెనుకే ఉన్నాడు.. రోహిత్ శర్మ ఆల్టైమ్ టీ20 రికార్డు బ్రేక్..
టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్లో సంజూ శాంసన్ (Sanju Samson)అదరగొట్టాడు.
Sanju Samson creates history became Most sixes by an Indian in single edition of T20 World Cup
- సంజూ శాంసన్ అరుదైన ఘనత
- టీ20 ప్రపంచకప్లో ఓ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ఆటగాడిగా
- రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
Sanju Samson : టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్ మ్యాచ్లో సంజూ శాంసన్ అదరగొట్టాడు. గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతులను ఎదుర్కొన్న అతడు 89 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు.
ఈ క్రమంలో సంజూ శాంసన్ టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ను అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో రోహిత్ శర్మ 15 సిక్సర్లు కొట్టగా ఇంగ్లాండ్తో మ్యాచ్లో 7 సిక్సర్లు బాదిన శాంసన్ టీ20 ప్రపంచకప్ 2026లో తన సిక్సర్ల సంఖ్యను 16కు పెంచుకున్నాడు. న్యూజిలాండ్తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో శాంసన్ సిక్సర్ల సంఖ్య 20 కి చేరుకునే అవకాశం ఉంది.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయులు వీరే..
* సంజూ శాంసన్ – 16* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
* రోహిత్ శర్మ – 15 సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2024)
* శివమ్ దూబె – 15* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
* ఇషాన్ కిషన్ – 14* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
* హార్దిక్ పాండ్యా – 14* సిక్సర్లు (టీ20 ప్రపంచకప్ 2026)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో సంజూ శాంసన్ (89; 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) అర్థశతకం బాదగా.. శివమ్ దూబె (43), ఇషాన్ కిషన్ (39) లు రాణించారు. ఇంగ్లీష్ బౌలర్లలో ఆదిల్ రషీద్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు సాధించగా.. జోఫ్రా ఆర్చర్ ఓ వికెట్ తీశాడు.
ఆ తరువాత 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో జాకబ్ బెథెల్ (105; 48 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ చేసినా మిగిలిన వారు విఫలం కావడంతో ఏడు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది. టీమ్ఇండియా బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ లు తలా ఓ వికెట్ తీశారు.
