CM Revanth Reddy : ఇకపై వారందరికీ కొత్త పింఛన్లు.. తేదీ ఫిక్స్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
CM Revanth Reddy : రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Telangana CM Revanth Reddy
CM Revanth Reddy : రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ అనీమియా బాధితులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులను గుర్తించి ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని, బాధిత కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు పింఛన్లు దోహదపడతాయని అన్నారు.
Also Read : Peddi Sudarshan Reddy : బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు చనిపోయినప్పుడు వారి భార్యలకు తక్షణమే పింఛన్లు ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంలో ఎటువంటి జాప్యానికి తావివ్వద్దని రేవంత్ రెడ్డి సూచించారు.
మండల స్థాయిలో అన్ని శాఖల పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులను ఎంపీడీవోలు పర్యవేక్షించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 45 రోజులకు ఒకసారి మండల పరిషత్ సమావేశాలు నిర్వహించాలని, సమావేశాలకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానించాలని సూచించారు. సర్పంచులు తమ గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయని అన్నారు.
రాష్ట్రంలోని తారు రోడ్డులేని గ్రామం ఉండకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ప్రతి గ్రామానికి తారు రోడ్డు నిర్మించాలని, ప్రతి పంచాయతీకి కార్యాలయం నిర్మించాలని ఆదేశించారు. పంచాయతీలోని జనాభా ఆధారంగా ఏ, బీ, సీలుగా వర్గీకరించి భవనాలు నిర్మించాలన్నారు. కార్యదర్శులు పారిశుద్ధ్య పనులు, ఇతర అంశాలపై పూర్తి స్థాయిలో బాధ్యత వహించేలా చూడాలని తెలిపారు. అదేవిధంగా.. రాష్ట్రంలో వివిధ కారణాలతో ఎన్నికలు జరగని పంచాయతీలకు పారిశుద్ధ్య, ఇతర పనులకు ఆటంకం లేకుండా వెంటనే నిధులు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళలకు పంపిణీ చేసే చీరలు పూర్తి నాణ్యతతో, ఆకట్టుకునే డిజైన్లలో ఉండాలని చెప్పారు. డిజైన్ల రూపకల్పనకు ఎన్ఐఎఫ్టీ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ చీరలకు మహిళల నుంచి మంచి స్పందన వచ్చినందున, నాణ్యత, రంగుల విషయంలో రాజీపడొద్దని సూచించారు.
ఎల్నినో నేపథ్యంలో తాగునీటి సరఫరా విషయంలో పంచాయతీల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గ్రామీణ తాగునీటి సరఫరా, హైదరాబాద్ మెట్రో వాటర్, నీటి పారుదల శాఖ అధికారులు సమన్వయంతో సమావేశాలు నిర్వహించుకోవాలన్నారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
గ్రామీణ తాగునీటి పథకాల పరిధిలో పని చేసే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అయిదో తేదీ లోపు వేతనాలు ఇవ్వాలని అన్నారు. స్థానిక వనరుల ఆధారంగానే తాగునీటి సరఫరాకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ సమీక్షలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
